పిల్లలకి ఇవ్వాల్సింది ధైర్యమే! | indian cricketer Arundhati Reddy mother Bhagya Reddy shares the journey | Sakshi
Sakshi News home page

పిల్లలకి ఇవ్వాల్సింది ధైర్యమే!

Mar 29 2026 2:50 AM | Updated on Mar 29 2026 5:26 AM

indian cricketer Arundhati Reddy mother Bhagya Reddy shares the journey

‘నా విజయంలో అమ్మదే ప్రధాన పాత్ర’ అంటారు అరుంధతీరెడ్డి. భారత మహిళా క్రికెట్‌ టీమ్‌లో ఆమె సాధించిన విజయాలు తెలిసినవే! ‘పిల్లల ఇష్టాలను గమనించి, గైడ్‌ చేయడమే మనం చేయగలిగేది’ అంటారు అరుంధతీరెడ్డి తల్లి భాగ్య. ఆమెకు కొడుకు, కూతురు. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.

‘‘ఈ రోజుల్లో తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంటోందంటే... ‘డబ్బులు ఎన్నయినా పెడతాం, ఏదైనా చేయండి’ అనేట్టుగా ఉంటున్నారు. పిల్లలేమో ‘మీరే అన్నీ చూసుకోవాలి. మాకేం సంబంధం లేదు’ అనేలా ఉన్నారు. కష్టపడితేనే డబ్బు వస్తుందనే విషయాన్ని పిల్లలకు నేర్పించడం లేదు. ఏది అడిగినా పెద్దలు ఇచ్చేస్తారు అనే ధోరణి బాగా పెరిగింది. మా పిల్లలు స్కూల్‌ టైమ్‌లో నన్ను డబ్బులు అడిగినప్పుడు నిజంగా ఏది అవసరమో తెలుసుకొని, దానికే ఇచ్చేదాన్ని. మిగతావి ఎందుకు అనవసరమో కూడా చెప్పేదాన్ని.

పాకెట్‌ మనీ కావాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా కేటాయించేదాన్ని. అవి పూర్తి చేస్తేనే డబ్బులు ఇచ్చేదాన్ని. దీని వల్ల డబ్బు విలువ తెలియజెప్పేదాన్ని. మేముండేది సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో. ప్రవైట్‌ స్కూల్‌ టీచర్‌ని. ఇద్దరు పిల్లల పెంపకం, పెద్ద టాస్క్‌. విజయవంతంగా పూర్తి చేయాలంటే అన్నింటిలో క్రమశిక్షణ అవసరం.

ఎమోషన్స్‌ ముఖ్యం
భావోద్వేగాలు బ్యాలెన్స్‌ చేసుకోవడం ఈ రోజుల్లో తగ్గిపోయిందనే చెప్పాలి. పిల్లలు స్నేహితులకు ఇచ్చే విలువ తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు. ముందు అమ్మనాన్న, తర్వాతనే మిగతావి అనేది క్లియర్‌గా చెప్పాలి. ఇప్పటికీ మా పిల్లలకు ‘మీరు పెద్దయ్యారు. అన్నీ తెలుసుకుంటున్నారు. కాని, ఏ విషయంలోనైనా స్టెప్‌ తీసుకునేముందు సెల్ఫ్‌గానూ, కుటుంబానికి ఎంత వరకు మంచిదో నిర్ణయించుకోండి’ అని చెబుతుంటాను. ఈ రోజుల్లో మగపిల్లలకన్నా ఆడపిల్లలు చాలా బెస్ట్‌గా ఉన్నారు. కాని, సమాజం ఎంత ఆధునికంగా మారినా అబ్బాయి–అమ్మాయి అనే వివక్ష మాత్రం ఉంది. ఈ వ్యత్యాసం ఇంట్లో పిల్లల మీద చూపకూడదు. 

చదువుతో పాటు సంస్కారం
విలువలు చాలా ముఖ్యం. సంస్కారం, క్రమశిక్షణ లేకుండా చదువు ఎంత ఉన్నా అది వృథానే. ఇప్పుడు పిల్లల్లో చదువు స్ట్రెస్‌ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రుల్లోనూ ‘ఫీజులు లక్షల్లో కడుతున్నాం, చదువు రావడం లేదు’ అనే ఒత్తిడి పెరిగింది. పిల్లల గురించి టీచర్స్‌ ఏదైనా రిమార్క్‌ చెబితే స్కూల్లో అందరి ముందే వారిని తిట్టేస్తుంటారు. లేదంటే, ‘ఇక వీళ్లింతే...’ అని వదిలేస్తున్నారు. ఇలాంటి భావన ఈ రోజుల్లో చాలా ప్రమాదంగా మారుతోంది. మా షమ్మూ (ముద్దు పేరు) చదువులోనూ ముందుండేది.

చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్‌ పిల్లలతో కలిసి గల్లీలో క్రికెట్‌ ఆడేది. టీవీలో క్రికెట్‌ తెగ చూసేది. స్పోర్ట్స్‌లో చాలా చురుకుగా ఉండేది. ‘నేను వాలీబాల్‌ స్టేట్‌ ప్లేయర్‌ని. స్పోర్ట్స్‌ అంటే ఇష్టం ఉన్నా, కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురి ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. పన్నెండేళ్ల వయసు నుంచి తన ఇష్టం వైపుగా సపోర్ట్‌ చేశాను. ఈ రోజు ఫలితాన్ని చూస్తున్నాం. అందుకని, చదువు ఒక్కటే  కాదు, పిల్లల ఇష్టాలు ఎటుగా సాగుతున్నాయో, వారి అభిరుచులు ఏంటో కూడా తెలుసుకోవడం, సూచనలు ఇవ్వడం ముఖ్యం.

త్యాగాలు ఎన్నో!
పెంపకంలో ఎన్నో త్యాగాలు ఉంటాయి, కష్టం ఉంటుంది. పిల్లలు ఏ మార్గం ఎంచుకున్నారు, వారు ఎందుకు దానిని వదలుకుంటున్నారు.. ఆ సమయంలో వారి ఆలోచన ఏ విధంగా ఉంటోంది అని కూడా కనిపెట్టాలి. 2017లో మా అమ్మాయి రైల్వేలో ఉద్యోగంలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఎర్పరచుకుంది. అండర్‌ 23 జోనల్‌ టోర్నమెంట్‌లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్‌– జాబ్‌ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్‌ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. నిజానికి.. జాబ్‌ చేసుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చు. కాని, కష్టపడటానికే సిద్ధపడింది. మేమూ తన ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చాం.  

ఆసక్తులను ప్రోత్సహించాలి... 
అరుంధతికి క్రికెట్‌తో పాటు పాటలు పాడటం చాలా ఇష్టం. కాస్త సమయం దొరికితే మెలోడీస్‌ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ‘ఈ ఏడాది పిల్లలను స్పోర్ట్స్‌ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్‌ అయిపోవాల’ని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా. ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. 

మా అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కెనడాలో స్ధిరపడ్డాడు. కూతురు దేశం గర్వించే స్థాయిలో ఉంది. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్‌ ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా ప్రయాణంలో మా అమ్మ నాకు సపోర్ట్‌గా నిలిచింది. మా పిల్లల ఎదుగుదలలో నేనూ అంతే. ఎంచుకున్న మార్గం వైపు రిస్క్‌ ఎంత ఉన్నా ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను’’ అని వివరించారు భాగ్య.

పిల్లల పెంపకం గురించి ప్రముఖుల అభిప్రాయాలు, అనుభవాలు, సూచనలు ఇదే శీర్షికలో ప్రతివారం...

∙ నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement