నిద్రలేమి ముప్పు : హైదరాబాద్‌ న్యూరాలజిస్ట్ కీలక పోస్ట్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

నిద్రలేమి ముప్పు : హైదరాబాద్‌ న్యూరాలజిస్ట్ కీలక పోస్ట్‌ వైరల్‌

Published Wed, May 22 2024 4:29 PM

Hyderabad Neurologist Claims Losing 1 Hour Of Sleep Takes 4 Days To Recover

ఒక గంట నిద్రనష్టపోతే కోలుకోవడానికి నాలుగు రోజులు

మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నిద్ర అవసరం. రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నా, మరుసటి రోజుగా చురుగా  పనులు  చేసుకోవాలన్నా నిద్ర చాలా అవసరం.రనిద్ర తక్కువైతే ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మరికొన్ని  కీలక విషయాలను ప్రకటించారు.  దీంతో ఆయన పోస్ట్ వైరల్‌గా మారింది.


తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, గుండెపోటు  వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయి. రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది.  అనేక అధ్యయనాలు  నిద్ర లేమి వల్ల బరువు పెరగడం, ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, పనితీరులో మార్పు ,హార్మోన్ల లోపాలు వంటి అనేక రుగ్మతలకు దారి తీస్తాయి.  ఫలితంగా గుండె జబ్బులు , మానసిక రుగ్మతలు అలాగే కొన్ని సందర్భాల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం  ఉంది. కానీ పెద్దలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పోవడం లేదు. ఇది మానవ శరీరంపై, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది న్యూరాలజిస్టులు, నిపుణులు నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో డా. సుధీర్‌ కుమార్‌ కూడా మరో కీలక విషయాన్ని వెల్లడించారు.

కేవలం ఒక గంట నిద్రకోల్పోతే కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని సుధీర్ కుమార్ పేర్కొన్నారు. నిద్రలేమితో తలనొప్పి, కంటి చూపులో లోపం, చికాకు, నిర్ణయాలు తీసుకునే  సామర్థ్యంలో సమస్యలొస్తాయని ఆయన తన ఎక్స్‌లో వెల్లడించారు. అధిక ఒత్తిడి ,పేలవమైన జీవనశైలి అలవాట్ల కారణంగా నిద్రలో సమస్యలొస్తాయని ఆయన వివరించారు. అంతేకాదు ఏ వయసులో ఎంత సమయం నిద్ర పోవాలి అనేది కూడా ఆయన స్పష్టం చేశారు.

వయసుల వారీగా  సగటు రోజువారీ నిద్ర, 
నవజాత శిశువులు (3 నెలల వరకు): 14 నుండి 17 గంటలు నిద్రపోవాలి. 
శిశువులు (4 నుండి 12 నెలల వయస్సు): 12 నుండి 16 గంటలు నిద్రపోవాలి.
చిన్నపిల్లలు (1 నుండి అయిదేళ్ల వయస్సు): 10 నుండి 14 గంటల వరకు, 
పాఠశాల వయస్సులో ఉన్న పిల్లలు (6 -12 సంవత్సరాలు): 8 నుండి 10 గంటల నిద్ర.

అలాగే రాత్రిపూట 7-9 గంటలు ఒకేసారి నిద్రపోవడం సరైనది, ఉత్తమమైంది. ఒక వేళ రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే  అతను/ఆమె పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చుఅని సుధీర్‌  కుమార్‌ తెలిపారు
 

Advertisement
 
Advertisement
 
Advertisement