అందం కమ్మేసిన అద్భుతం | Hollywood Actress Marilyn Monroe remembered on 100th birth anniversary | Sakshi
Sakshi News home page

అందం కమ్మేసిన అద్భుతం

May 31 2026 6:09 AM | Updated on May 31 2026 6:09 AM

Hollywood Actress Marilyn Monroe remembered on 100th birth anniversary

జీనియస్‌ మన్రో

రేపు శతజయంతి

‘సెక్స్‌ సింబల్‌’... ‘డంబ్‌ బ్లాండ్‌’.... ప్రపంచం ఆమెకు వేసిన ముద్రలివి... కానీ చరిత్ర ఇప్పుడు చెబుతోంది... ‘మన్రో ఒక జీనియస్‌’.  అందం వెనుక దాగిన అక్షరాస్యురాలు. కెమెరా ఎదుట కవ్వించిన ఆమె ఓ పుస్తకాల పురుగు. 2026 జూన్‌1కి ఆమెకు నూరేళ్లు. జీవించి ఉంటే నూరవ బర్త్‌డే కేక్‌ కట్‌ చేసేది. కానీ 36 ఏళ్లకే లైట్స్‌ ఆఫ్‌ అంది. 100 ఏళ్ల తర్వాత కూడా  వెలుగుతూనే ఉంది. 

మన్రో కేవలం అందగత్తె కాదు. తెర మీద కనిపించినట్టుగా ‘డంబ్‌ బ్లాండ్‌’ కాదు. ఆమె ఒక తిరుగుబాటుదారు. కవయిత్రి. ఫెమినిస్ట్‌. సినిమా ప్రొడక్షన్‌కు అధినేత. అప్పటికి దస్తోయెవ్‌స్కీని ఇతర గొప్ప రచయితలను చదివిన అరుదైన హాలీవుడ్‌ నటి. 

కాని లోకం ఆమెకు ‘ఖాళీ బుర్ర’ అని ముద్ర వేసింది. నిజం ఏంటంటే మన్రో ఐ.క్యూ. చాలా ఎక్కువగా ఉండొచ్చని కొందరు అంచనా కడతారు. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఐ.క్యూ. కంటే ఎక్కువ అనేవారూ ఉన్నారు. మార్లిన్‌ మన్రో చాలా తెలివైనది, మేధావి. అందుకు ఆమె చనిపోయినప్పుడు ఇంట్లో కనిపించిన 400లకు పైగా పుస్తకాల లైబ్రరీయే సాక్ష్యం. అవి అలంకారానికి అక్కడ లేవు. మన్రో వాటిని చదివినట్టుగా జేమ్స్‌ జాయిస్‌ ‘యులిస్సెస్‌’, దోస్తోయెవ్‌స్కీ ‘ది బ్రదర్స్‌ కరమజోవ్‌’, ఫ్రాయిడ్, రిల్కే, వాల్ట్‌ విట్‌మన్‌... అన్నీ పుస్తకాల్లో అండర్‌లైన్‌ చేసి, మార్జిన్ లో నోట్స్‌ రాసుకుని ఉంది. ఆమెను ‘మీరేం చదువుతారు?’ అని ఎవరో అడిగితే ‘నేను కవిత్వం చదువుతాను. ఎందుకంటే కవిత్వం నిజం చెబుతుంది. హాలీవుడ్‌ అబద్ధం చెబుతుంది’ అని జవాబు చెప్పింది. కవిత్వం రాసేది. ఆమె డైరీల్లో దొరికిన కవిత ఒకటి:
‘మనం ఇతరులను పూర్తిగా తాకలేం; మనలోని కొంతే వారిలోని కొంతను తాకుతుంది. 
ప్రతి ఒక్కరి సత్యం వారికి మాత్రమే సొంతం’
ఇది ‘డంబ్‌ బ్లాండ్‌’ రాసే కవిత్వమా? ఇది తత్త్వం.
  
1950ల్లో హీరోయిన్లంటే స్టూడియోల చేతిలో కీలుబొమ్మలు. కాంట్రాక్ట్‌ చేసుకున్న డబ్బే జీతం. స్క్రిప్ట్‌ సెలెక్ట్‌ చేసుకునే హక్కు లేదు. డైరెక్టర్‌ని ప్రశ్నించే ధైర్యం లేదు. మార్లిన్‌ ఏం చేసిందో తెలుసా? 1954లో ట్వంటియెత్‌ సెంచరీ ఫాక్స్‌తో  ఏడేళ్ల కాంట్రాక్ట్‌ను తెంచుకుని న్యూయార్క్‌ వెళ్లిపోయింది. లీ స్ట్రాస్‌బర్గ్‌ దగ్గర ‘మెథడ్‌ యాక్టింగ్‌’ నేర్చుకుంది. 1955లో సొంతంగా ‘మార్లిన్‌ మన్రో ప్రొడక్షన్స్‌’ అనే కంపెనీ పెట్టింది. హాలీవుడ్‌ చరిత్రలో స్టూడియోల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి సొంత ప్రొడక్షన్‌ కంపెనీ పెట్టిన తొలి ఫీమేల్‌ స్టార్‌ మన్రో. ఆ దెబ్బకు ఫాక్స్‌ దిగొచ్చింది. కొత్త కాంట్రాక్ట్‌ ఇచ్చింది. పారితోషికం ఎంతో తెలుసా? సినిమాకు లక్ష డాలర్లు,  అంతేకాదు లాభాల్లో వాటా,  డైరెక్టర్‌నీ, స్క్రిప్ట్‌నీ అప్రూవ్‌ చేసే హక్కూ. 
ఆ రోజుల్లో ఒక హీరోయిన్ కి ఇన్ని హక్కులు రావడం అంటే విప్లవం. అలాంటి విప్లవ వనిత మన్రో.
  
లాస్‌ ఏంజిల్స్‌లో మోకాంబో అనే ఫేమస్‌ నైట్‌క్లబ్‌ ఉండేది. అక్కడ నల్లజాతి గాయనిలకు అనుమతి లేదు. ఎల్లా ఫిట్జ్‌గెరాల్డ్‌ అనే గొప్ప సింగర్‌కు అక్కడ పాడే అవకాశం ఇవ్వలేదు క్లబ్‌. మెర్లిన్‌ ఫోన్‌ చేసింది. క్లబ్‌ ఓనర్‌తో మాట్లాడింది. ‘నువ్వు ఎల్లాకు వారం బుకింగ్‌ ఇస్తే, నేను ప్రతి రాత్రి ఫ్రంట్‌ టేబుల్‌లో కూర్చుంటా. ప్రెస్‌ మొత్తం వస్తుంది. నీ క్లబ్‌కి ఫ్రీ పబ్లిసిటీ’ అంది. ఓనర్‌ ఒప్పుకున్నాడు. వారం రోజులు మెర్లిన్‌ ఫ్రంట్‌ రోలో కూర్చుంది. నల్ల గాయని ఎల్లా కెరీర్‌ ఆ వారం రోజుల్లో మారిపోయింది. తర్వాత ఎల్లా ‘నేను మార్లిన్‌ మన్రోకు నిజంగా రుణపడి ఉన్నాను. ఆమె మాట ఇచ్చినట్టుగా ప్రతి రాత్రి ముందు వరుస టేబుల్‌లో కూర్చుంది. ఆమె ఊహించినట్టుగానే ప్రెస్‌ వాళ్లు పిచ్చెక్కిపోయారు.’ ఇది గ్లామర్‌ డాల్‌ చేసే పనా? కాదు. 
ఇది జెండర్, జాతి వివక్ష గోడలను బద్దలు కొట్టిన యోధురాలి పని.
  
ప్రపంచమంతా పేరు గడించిన ఈ తార బాల్యానిది ఊరు పేరూ లేని అనాథ బతుకు అనంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పుట్టింది జూన్‌ 1, 1926. లాస్‌ ఏంజిల్స్‌లో. అసలు పేరు నార్మా జీన్‌. తండ్రి ఎవరో తెలీదు. తల్లి గ్లాడీస్‌కు మానసిక ఆరోగ్యం బాగుండేది కాదు. దాంతో నార్మా జీన్‌ జీవితం అనాథాశ్రమాలలో అక్కడా ఇక్కడా గడిచింది. ఈ బాధల నుంచి విముక్తికి 16 ఏళ్లకే పొరుగింట్లో ఉండే జేమ్స్‌ డోహెర్టీ అనే కుర్రాడిని పెళ్లి చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేడియోప్లేన్‌ కంపెనీలో డ్రోన్‌ పార్ట్స్‌ తనిఖీ చేసే ఉద్యోగాన్ని వారానికి 20 డాలర్లు లెక్కన చేస్తుంటే 1944లో ఆర్మీ ఫొటోగ్రాఫర్‌ డేవిడ్‌ కొనోవర్‌ ఆ ఫ్యాక్టరీలో ఫొటోలు తీయడానికి వచ్చి ఈమెను చూశాడు. ‘నువ్వు మోడలింగ్‌ చేస్తే బాగుంటుంది‘ అన్నాడు. ఫొటోలు తీశాడు. ఆ ఫోటోలతోనే నార్మా జీన్‌ జీవితం మలుపు తిరిగింది.
  
కొన్నాళ్లు మోడలింగ్‌ చేశాక మన్రోకు ట్వంటియెత్‌ సెంచరీ ఫాక్స్‌ స్టూడియో కాంట్రాక్ట్‌ ఇచ్చింది. కండిషన్‌ ఒకటే– పేరు మార్చుకోవాలి, జుట్టు బ్లాండ్‌ చేసుకోవాలి. ఆ స్టూడియో ఎగ్జిక్యూటివ్‌ బెన్‌ లియాన్‌ ‘మార్లిన్‌’ అనే పేరు సజెస్ట్‌ చేశాడు. ‘మన్రో’ తనే జత చేసుకుంది. అది ఆమె అమ్మమ్మ 
ఇంటిపేరు. అలా నార్మా జీన్‌ ‘మార్లిన్‌ మన్రో’ అయ్యింది. మొదట్లో చిన్న చిన్న వేషాలు. డైలాగ్‌ ఒక్క ముక్క. కానీ ఆ ఒక్క ముక్కలో, ఒక్క నవ్వులో హాలీవుడ్‌ని కట్టిపడేసింది. 

జెంటిల్‌మెన్‌ ప్రిఫర్‌ బ్లాండ్స్‌ (1953), హౌ టు మ్యారీ ఎ మిలియనీర్‌ (1953), ది సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌ (1955), బస్‌ స్టాప్‌ (1956), సమ్‌ లైక్‌ ఇట్‌ హాట్‌ (1959), ది మిస్‌ఫిట్స్‌ (1961)...  సూపర్‌హిట్లు. 
  
హాలీవుడ్‌లో అందరూ ‘స్ట్రాంగ్‌’గా కనిపించాలని చూస్తారు. మెర్లిన్‌ మాత్రం ‘నాజూకు’గా కనిపించింది. ఆమె కళ్లలో అభద్రత, అమాయకత్వం... ప్రేక్షకుడు చూడగానే ‘అయ్యో పాపం, ఈమెని నేను కాపాడాలి’ అనుకునేవాడు. అదే ఆమె ట్రంప్‌ కార్డ్‌. బలంగా కాదు బలహీనంగా కనిపించి గెలిచిన 
ఏకైక స్టార్‌ ఆమె.

ఆమె గొంతు మామూలుగా ఉండేది కాదు. ‘బ్రెతీ వాయిస్‌’ అంటారు. గొంతుతోనే శృంగారం పలికించగలిగిన నటి. షాట్‌ తీస్తున్నప్పుడు  లైట్‌ ఎక్కడ పడాలో ఆమెకు తెలుసు. తల కొంచెం వంచడం, గడ్డం కిందికి దించి పైకి చూడడం, భుజం తిప్పడం ప్రతి కదలికా లైటింగ్‌తో డ్యాన్ ్స చేసినట్టు ఉండేది. ‘సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌’లో ఐకానిక్‌గా నిలిచి డ్రెస్‌ ఎగిరే సీన్‌ కోసం, గాలికి ఎలా రియాక్ట్‌ అవ్వాలనే ఎక్స్‌ప్రెషన్‌ కోసం 11 టేకులు రిహార్సల్‌ చేసింది. ఆమెది స్క్రీన్  మ్యాజిక్‌ కాదు, స్క్రీన్  సైన్ ్స. సాధారణంగా స్త్రీలు కామెడీ చేయరు. కాని మార్లిన్‌ది అద్భుతమైన కామిక్‌ టైమ్‌. చార్లీ చాప్లిన్‌ తర్వాత కామెడీని పండించిన స్టార్‌ ఆమె. ఇక మన్రో లిప్‌స్టిక్‌ పెదాలు జగద్విదితం. తన పెదాలకు ఎర్రదనం కోసం ఐదు షేడ్స్‌ కలిపేదట. ఆ కిటుకు ఇతరులకు తెలియదు.
  
ఆగస్ట్‌ 5, 1962. లాస్‌ ఏంజిల్స్‌లోని బ్రెంట్‌వుడ్‌ ఇంట్లో శవమై కనిపించింది మన్రో. అప్పటికి వయసు 36. అధికారిక కారణం నిద్రమాత్రల ఓవర్‌డోస్‌. కొందరు ఆత్మహత్య అన్నారు. కానీ ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ. కెన్నెడీ బ్రదర్స్, మాఫియా, ఎఫ్‌.బి.ఐ.... చాలా థియరీలు ఉన్నాయి. ఆమె సమాధి లాస్‌ ఏంజిల్స్‌లో వెస్ట్‌వుడ్‌ విలేజ్‌ మెమోరియల్‌ పార్క్‌లో ఉంది. 

నార్మా జీన్ గా పుట్టి, మార్లిన్‌ మన్రోగా ఎదిగి, లెజెండ్‌గా మిగిలిపోయింది. 16 సినిమాలే చేసింది. 36 ఏళ్ల చిన్న జీవితమే కావ చ్చు. కానీ 100 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఆమె పుట్టినరోజును జరుపుకుంటోంది.

కొందరు స్త్రీలు నటీమణులు. 
కొందరు స్త్రీలు సూపర్‌స్టార్లు. 
కానీ మార్లిన్‌ మన్రో ఒక్కత్తే. 
కల్చరల్‌ ఫినామినన్‌. 
అమరం అయిన అందం.
                               
– ఖదీర్‌

Advertisement
 
Advertisement
Advertisement