Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్‌ వుమెన్‌లో ఈ సమస్యలు..

Health: Why Urinary Infections In Working Women Symptoms Diagnosis - Sakshi

వర్కింగ్‌ ఉమెన్‌... యూరినరీ సమస్యలు! 

సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. శరీర నిర్మాణపరంగా వారి మూత్రవ్యవస్థ నిర్మితమైన తీరు వల్ల వారిలో ఈ సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికం. దీనికి తోడు బయటకు వెళ్లి ఆఫీసుల్లో పనిచేసే మహిళల్లో (వర్కింగ్‌ ఉమెన్‌)లో... వారికి ఉండే కొన్ని పరిమితుల వల్ల ఇన్ఫెక్షన్లు, మరికొన్ని ఇతర సమస్యలు పెరుగుతాయి. అలా ఎందుకు జరుగుతుందో తెలిపే కథనం. 

సాధారణ మహిళలైన గృహిణులకూ (హోమ్‌ మేకర్స్‌కూ), బయటికి వెళ్లి పనిచేసే మహిళలకూ (వర్కింగ్‌ ఉమెన్‌కూ) కొన్ని తేడాలు ఉంటాయి. వర్కింగ్‌ ఉమన్‌ నీళ్లు తక్కువగా తాగడం, అలాగే మూత్రానికి వెళ్లాల్సిన అవసరమొచ్చినా చాలాసేపు ఆపుకోవడం ఈ రెండు పనులూ చాలా ఎక్కువగా చేస్తుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి...

1. మూత్రంలో ఇన్ఫెక్షన్‌ (యూరినరీ ఇన్ఫెక్షన్స్‌), 
2. మూత్ర విసర్జనలో సమస్యలు....

ఈ మూత్ర విసర్జన సమస్యలు మళ్లీ రెండు రకాలు.
►మొదటిది బ్లాడర్‌ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం.
►రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక  నొప్పి రావడం. ఇక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా రావచ్చు. 

ఎందుకీ సమస్యలు :
మొదటి కారణం
సాధారణంగా వర్కింగ్‌ ఉమెన్‌... మూత్రవిసర్జనను తప్పించుకోడానికి నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. నిర్వహణ బాగుండే పెద్ద పెద్ద ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్‌ బాగుండకపోవడం, కొన్ని చోట్ల మరీ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. 

రెండో కారణం
ఇక ఎంతగా మూత్రవిసర్జన చేయాల్సి వచ్చినా రెస్ట్‌రూమ్‌/బాత్‌రూమ్‌లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనను ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్‌ సామర్థ్యం తగ్గుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలా బిగబట్టడం వల్ల పెద్దగా సమస్యలేవీ రావుగానీ... అదే పని పదేపదే చాలాకాలం పాటు కొనసాగుతున్నప్పుడు మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. 

ఎలాంటి సమస్యలొస్తాయంటే...
మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు
మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్‌ను ‘యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌’ (యూటీఐ) అంటారు. ఈ సమస్య ఎలా వస్తుందంటే... శరీరం తనలోని వ్యర్థాలను శుభ్రపరిచాక... వాటిని మూత్రం రూపంలో ఓ కండర నిర్మితమైన బెలూన్‌ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతుంది. ఈ బ్లాడర్‌ చివర స్ఫింక్టర్‌ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి.

చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుకుంటే... అక్కడ చాలా పరిమాణంలో మూత్రం చాలాసేపు నిల్వ ఉండిపోతుంది. ఇలా దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటే బ్యాక్టీరియా వృద్ధిచెంది... దాని కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం.

మొదటిసారి ఇన్ఫెక్షన్‌ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్‌’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని... ‘పర్సిస్టెంట్‌ బ్యాక్టీరియూరియా’ లేదా ‘రికరెంట్‌ యూరినరీ ఇన్ఫెక్షన్స్‌’ అని అంటారు. కిడ్నీల్లో వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్‌ అంటారు. దీన్ని కొంచెం సీరియస్‌ సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. 

లక్షణాలు
మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ విసర్జనకు వెళ్లాలనిపించడం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

నిర్ధారణ పరీక్షలు...
సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య పదే పదే వస్తుంటే మాత్రం అందుకు కారణాలు నిర్ధారణ చేసుకోవడం కోసం కొన్ని పరీక్షలూ చేయిస్తుంటారు.
సీయూఈ, యూరిన్‌ కల్చర్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి), సిస్టోస్కోప్‌ (యూటీఐ).
అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు అవసరమవుతాయి.  

చికిత్స
యూరినరీ  ఇన్ఫెక్షన్లకు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్‌ మందులతోనూ, అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్‌డ్‌  యాంటీబయాటిక్స్‌ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.
-డాక్టర్‌ లలిత, సీనియర్‌ కన్సల్టెంట్‌, యూరో గైనకాలజిస్ట్‌

చదవండి:  అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్‌! టీనేజ్‌ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి
Muscle Cramps: గుగ్గిల వృక్షం.. ఈ జిగురుతో కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు!
రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top