సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన పెద్దలు చెబతుండటం విన్నాం. అంతెందుకు శ్రావ్యమైన సంగీతం వింటుంటే శారీరకంగా, మానసికంగా బాగుంటాం అని నిపుణులు సైతం అంటున్నమాటే. తాజాగా వినడమే కాదు పాటలు పాడితే మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందట. పైగా గట్ హెల్త్ బాగుంటుందని సాక్షాత్తు హార్వర్డ్ నిపుణులే చెబుతున్నారు. అదేవిధంగానో ఆ నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా.!.
పాడటం అనేది కళాత్మక ప్రక్రియ. మరి దీనికి జీర్ణక్రియకు సంబంధం ఎలా అంటే.. పాటలు పాడినప్పుడు మనసు, పేగులు, నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఒక బృందంగా పాడుతున్నప్పుడు శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ (ఏ), కార్డిసాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించారు. పాడటం అనేది మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి, ఆందోళనతో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొందరు దీన్ని అధిగమించిగలుగుతారు అందుకు ఇదే కారణమని అంటున్నారు.
పాడినప్పుడు ఏం జరుగుతుందంటే..
శరీరంపై సానుకూల ప్రభావం మెదడు నుంచి మొదలై వేగస్ నాడి ప్రేరణ ద్వారా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకోసం బీథోవెన్ సంగీతాన్ని ఆలపిస్తున్న బృందంపై పరిశోధనలు చేయగా, వారందిరలోనూ పాడటం కారణంగా లాలాజలంలో ఒక కీలకమైన రోగనిరోధక యాంటీబాడీ నాటకీయంగా పెరగడం గుర్తించామని తెలిపారు. ఆ యాంటీబాడీ.. జీర్ణవ్యవస్థ లోపలి పొర, గొంతు, శ్వాస మార్గాలలో మన శరీరానికి మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందట.
ఫలితంగా వ్యాధికారకాలు మనపై పట్టు సాధించే అవకాశం రాకమునుపే ఈ యాంటీబాడీ అడ్డుగోడగా మారుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే గానానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉందని చెబుతున్నారు. మెదడుకు, పేగుకి మధ్య ఉన్న ప్రధాన సమాచార ప్రసార మార్గం అయిన వేగస్ నాడి పాటను ఆలపించగానే ఉత్తేజితమవుతుందట. ఎప్పుడైతే పాట కోసం ఉదర శ్వాసను ఉపయోగిస్తామో అప్పుడు ఈ వేగస్ నాడీ తక్షణమే యాక్టివ్ అవుతుందట. దాంతో విశ్రాంతి, జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి ప్రేగులు అత్యుత్తమంగా పనిచేయడం ప్రారంభిస్తాయట. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమేగాక, ప్రేగుల లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు శరీరంలో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతకు మద్దతిస్తుందట.
గానం ఎలా హెల్ప్ అవుతుందంటే..
గానం విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా మనం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. దాంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పాట పడటం కోసం ఉదర శ్వాసను వినియోగిస్తాం దాంతో శ్వాశ, నాడీవ్యవస్థ నియంత్రణ ఫలితం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీర్ణవ్యవస్థకు మెదడు నుంచి సరైన సంకేతాలు అందితేనే తన పనిని సజావుగా జరపగలదట. అందువల్లే గానం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పగలమని అన్నారు. గానం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అది సమర్థవంతంగా సంకేతాలను అందించడంతో ప్రేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు.
అందరూ పాడేటప్పుడు లోతైన శ్వాసను తీసుకుంటే వేగస్ నాడీ ఉత్తేజమయ్యి..జీర్ణవ్యవస్థ బాగుండేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే మన పూర్వీకులు మన చేత నిరంతరం జపాలు, పారాయణాల పేర్లతో మంత్రాలు, భక్తిపాటలను లయబద్ధంగా ఆలపించేలా చేసేవారని అంటున్నారు. అంటే మెరుగైన ఆరోగ్యానికి చక్కటి జీవనశైలి, శ్వాస, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమనేది గుర్తురెగండి అని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..)


