
ఉరుకుల పరుగుల జీవనయానంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. సామాజిక స్థాయిలు మారాయి. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కిట్టీ పార్టీ కల్చర్ వచ్చింది. బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు, నిశ్చితార్థాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు.. సందర్భం ఏదైనా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హోటళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆ ఆహారమే అనారోగ్యమని గుర్తించలేపోతున్నారు.
మురికి కాలువ గట్ల మీద ఉండే చిన్నపాటి తినుబండారాల తోపుడుబండి నుంచి పెద్దపెద్ద భవనాల్లో ఉండే ఖరీదైన హోటళ్ల వరకు అన్ని వేళలా ఆహార ప్రియులతో కిటకిటలాడుతుంటాయి. శుభకార్యాల నుంచి అశుభకార్యాల వరకు అన్ని సందర్భాల్లోనూ వడ్డించే ఫుడ్ కోసం హోటల్స్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంటి భోజనం కంటే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్‌కు బాగా ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇక్కడ తయారయ్యే ఆహారాలు, నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసినవి కావడంతో ఆ వంటకాలు తిని పలువురు రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ రోగుల్లో 53 «శాతం మంది హోటల్స్ ఆహారంతోనే సమస్య తెచ్చుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.
ఆహారాల్లో ప్రమాదకర రసాయనాలు
హోటళ్లల్లో ఆహారాలు కలర్ ఫుల్, రుచికరంగా ఉండేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తుండడంతో అనేక రోగాలకు కారణమవుతున్నాయి.
మెటానియల్ ఎల్లో వాడకం నిషేధించినప్పటికీ చాలా హోటళ్లలో వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దుష్ప్రభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతోంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి.
వంటకాల్లో రంగు కోసం వాడే నిషేధిత టార్‌ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీంతో మానసిక వ్యాధితోపాటు థైరాయిడ్, క్యాన్సర్, ఎలర్జీ, దద్దుర్లు, తామర, రక్తకణ జాలంలో హానికర కణ జాలల వృద్ధి చెందడం, డీఎన్‌ఏ నష్టపోవడం, నిద్రలేమి, నీరసం వస్తాయి.
స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాటారజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్ట్రాజీన్‌లు ప్రమాదకరమే.
చాకెట్లలో వాడే రోడ్‌మన్–బీ కూడా ప్రాణాంతకమే. అయినా చాక్లెట్లు, చిన్న పిల్లలు తినే రంగుల ఆహార పదార్థాల్లో వీటిని వినియోగిస్తున్నారు.
పార్టీ కల్చర్.. ప్రమాదకరం
కొన్నేళ్ల క్రితం వరకు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లినా.. సమయానికి ఇంటికి రాలేని పరిస్థితుల్లో కొందరు హోటళ్లలో తినేవారు. కొందరైతే ఎంత సమయమైనా ఇంటికి వచ్చే భోజనం చేసేవారు. ఇప్పుడు కల్చర్ మారింది. సామాజిక నడతలో మార్పు వచ్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కల్చర్ వచ్చింది.
నలుగురు స్నేహితులు కలిస్తేనే కాదు.. వీకెండ్ ఫ్యామిలీస్‌తో కలిసి లంచ్, డిన్నర్ బయటే చేస్తున్నారు. ఖరీదైన ఆహారం తింటున్నామనే భ్రమలో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రహించలేకపోతున్నారు. నిల్వ ఉంచిన ఆహారం, ప్రమాదకర రసాయనాలు కలిపిన ఆహారాలతో అప్పటికప్పుడు నష్టం లేకపోయినా దీర్ఘకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
నిబంధనలు బేఖాతర్
జిల్లాలో చిన్నా, పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, చాట్ బండార్‌లు, నూడిల్స్ షాపులు, అన్ని కలుపుకుని 5 వేలకు పైగా ఉంటాయి. ఒక్క నగరంలోనే 3 వందల వరకు హోటల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి హోటల్స్ యజమానులు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది.
ఆ శాఖ నిబంధనల మేరకు ఆహారం తయారు చేయాలి. ఈ చట్టం 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితోపాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరు నెలకు 12 శాంపిల్స్ సేకరించాలి. శాంపిల్స్‌ను ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత అవి ప్రమాణాల మేరకు లేకపోతే కేసులు నమోదు చేయాల్సి ఉంది. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించే వీలుంది. కానీ ఇవి జరగడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని తమ వద్దకు ఎవరూ రారన్న ధీమాతో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు.
నాసిరకం.. రంగుల మయం
హోటళ్లల్లో తయారయ్యే ఆహార పదార్థాలు నాసిరకం.. రంగుల మయంగా ఉంటాయి. పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీలో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆ ద్రావణాన్ని సాధారణ నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీని వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
మిరప కాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులు వాడుతుంటారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వండే సమయంలో వాడిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వినియోగిస్తున్నారు. దీని వల్ల క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాద మున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
చికెన్, మటన్ బిర్యానీలు, తందూరిలో ఆకట్టుకునేందుకు ఎక్కువగా హానికరమైన రంగులను వాడుతున్నారు. అనారోగ్యానికి గురైన, ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతోపాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
చిన్న చిన్న హోటళ్లు, కర్రీస్ పాయింట్లలో వేడి వేడి కూరలు, పప్పు, సాంబారు వంటి ఆహార పదార్థాలు పల్చటి పాలిథిన్ కవర్లలో వేసి ఇస్తున్నారు. పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరిగి వాటిని తినే వారికి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి.
∙నిషేధిత క్యాట్ ఫిష్‌లను సైతం కొర్రమీనుగా విక్రయిస్తున్నారు. జిల్లాలో వీటిని చికెన్, మటన్ వ్యర్థాలతో గుంతల్లో పెంచుతున్నారు.
అల్లం, వెల్లుల్లి పేస్టులను సైతం కల్తీ చేస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో అందులో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్‌ను కలుపుతున్నారు.
నిత్యం తనిఖీలు చేస్తున్నాం
హోటల్స్, ఐస్‌క్రీం పార్లర్‌లు, రెస్టారెంట్‌లు, పండ్ల దుకాణాలను నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలా వరకు కాలం చెల్లినవి, ఉంటున్నాయి. 2024–25లో పలు హోటల్స్‌ను తనిఖీ చేసి 296 శ్యాంపిల్స్‌ను సేకరించగా 20 శాంపిల్స్‌లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు, 18 శాంపిల్స్ ప్యాకెట్స్‌పై వివరాలు లేకుండా ఉన్నట్లు గుర్తించాం.
– వెంకటేశ్వరరావు, జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్
కల్తీ వల్ల ఆరోగ్య సమస్యలు
కల్తీ ఆహారం తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీ వల్ల జీవనక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు బయట ఫుడ్‌కు స్వస్తి చెప్పి ఇంటి ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యానికి ఎంతో మంచిది.
– డాక్టర్ ఎంవీ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల
(చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! )