
అడవిలోని కోతులు చిటారుకొమ్మనున్న పండును రుచి చూస్తున్నట్టుగా కొద్దిగా కొరికేసి, మళ్లీ మరో పండును అందుకుంటాయి. పూర్తిగా తినేయకుండానే పండ్లనిలా పక్కకు విసిరేస్తున్నందుకు విసుగూ, చిరాకు మనకు.
అరణ్యంలోని ఏనుగు అవసరమైనదేదో తినేయకుండా అందుతున్న కొమ్మల్ని అల్లిబిల్లిగా విరిచేసి అల్లంత దూరానికి విసిరేసి చెల్లాచెదురుగా పడేస్తుంది.
చూడ్డానికి ఇదేదో వృథా పనిలా అనిపిస్తుందిగానీ... ఇందులో అడవి మనుగడ దాగుంది. కోతి మాత్రమే చిటారు కొమ్మకు చేరగలుగుతుంది. కానీ అంతదూరాలకు ఎక్కలేనివీ... మధ్య కొమ్మలూ, చెట్టు మొదళ్లలో ఉండే జీవులూ తినడానికి ప్రకృతి చేసిన ఏర్పాటది. అలా ఎన్ని జీవులు ఎంత ఎక్కువగా తింటే... వాటి గింజలు
అంతంత దూరాలకు చేరి అక్కడ మొలకెత్తుతుంటాయి. అలా మొలకెత్తే మొక్కలకు సూర్యరశ్మి అందేందుకూ... పక్కలకు పాకకుండా ఇతర మొక్కలకూ అవకాశమిస్తూ చెట్టు నిటారుగానే ఎదిగేందుకు ఏనుగులిలా పక్క కొమ్మల్ని విరిచి పడేస్తుంటాయి.
మనుగడ కోసం అన్ని జీవులూ ప్రయత్నిస్తున్నట్టే... తనలోని ఇతర జీవులను బతికించుకుంటూ... తాను బతికి పచ్చటి ఆకుల బట్టకట్టడానికి ప్రయత్నిస్తుంది అడవి. సహజ సహజాతం తప్ప ఇతర జ్ఞానాలేమీ లేని మూగజీవులూ అందుకు తోడ్పడుతుంటే... అద్భుత జ్ఞానం ఉండి... అన్నీ తెలిసిన మనిషి మాత్రం అడవుల నిర్మూలనకు పాల్పడుతుంటాడు.
అయితే కేరళ ఉత్తర వాయనాడ్‌లోని పెరియ అనే ప్రాంతంలోని గురుకుల బొటానికల్ శాంక్చువరీలో... అంతరిస్తున్న ఓ అడవిని కాపాడటానికి ఇరవై మంది మహిళలు నిత్యం కృషి చేస్తుంటారు. వారి శ్రమ కారణంగా మునపటి విస్తీర్ణానికి తోడు... ఇప్పుడు మరో 32 హెక్టార్లు అదనంగా పెరుగుతోందా ఆ అడవి. అక్కడి అరుదైన జాతుల్లో దాదాపు 40% మొక్కలకు ఆ అడవే నివాసం. గోరింటాకు పెట్టుకునే ఆ మహిళల చేతులే... ఇప్పుడు ‘గుల్‌మెహందీ’ అనే హిందీ పేరున్న ‘బల్సామినసీ’ కుటుంబపు అనేక ప్రజాతుల మొక్కలను పెట్టని కోటలా కాపాడుతున్నాయి.
ఆ అడవి ఇప్పుడు అత్యంత అరుదైన మొక్కలకు ఆలవాలం. ఎర్రచందనం చెట్లు కేవలం శేషాచలం అడవుల్లోనే పెరుగుతూ మరెక్కడా జీవించలేనట్టే... అత్యంత అరుదైన జాతి మొక్కలైన ‘ఇంపాటియెన్స్ జెర్డోనియా’ వంటి మొక్కలు అక్కడ... అంటే ఆ పశ్చిమ కనుమల సానువుల్లో తప్ప మరెక్కడా పెరగవు. ‘బల్సామినసీ’ అనే కుటుంబానికి చెందిన ఆ మొక్కలన్నీ దాదాపుగా అంతరించే దశకు చేరుకున్నాయి. అలాంటి జాతుల మొక్కల్ని సంరక్షించడమే కాదు... అలాంటి అనేక రకాల అరుదైన ఇతర జాతుల మొక్కలకూ ఆ అడవిలో ఆవాసం కల్పిస్తూ వాటిని సంరక్షిస్తున్నారా అతివలు.
మరోమాటగా చెప్పాలంటే అవన్నీ ఎపీఫైటిక్‌ప్లాంట్స్. ‘ఎపీ’ అంటే ‘పైన’... ‘ఫైట్’ అంటే మొక్క. అంటే తమ మనుగడ కోసం అవి మరో చెట్టుని ఆలంబనగా చేసుకోవాలి. ఇక్కడ ‘పారసైట్’కూ, ‘ఎపీఫైట్’కు తేడా ఏమిటంటే... తాము ఎదుగుతున్న చెట్టుపైనే బతుకుతూ, అలా బతకడానికి దాని ఆహారాన్ని దొంగతనంగా తీసుకుంటే అవి పారసైట్స్. కేవలం తమ అవసరాలైన సూర్యరశ్మీ, ఇతర వనరులు చక్కగా అందడానికి ఇతర మొక్కల మీద ఎదిగేవీ ఎపీఫైట్స్. తాము పెరగడానికి దోహదపడుతున్న చెట్ల ఆహారాన్ని ఇవి దొంగిలించవు. అలాంటి ఈ ఎపీఫైట్స్ మనుగడ కోసం తీవ్రంగా ఫైట్ చేస్తున్నారు ఆ అడవిని సంరక్షిస్తున్న ఆడపిల్లలు.
– యాసీన్