
ఎలక్ట్రిసిటీ అంటే ఎడిసన్, టెలిఫోన్ అంటే గ్రాహం బెల్, కంప్యూటర్ అంటే ట్యూరింగ్ గుర్తొస్తారు. కాని, ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ శాస్త్రవేత్త గురుతేజ్ సంధు పేరు చేర్చాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా యూఎస్‌లో ఎడిసన్ పొందిన పేటెంట్ల సంఖ్యను కూడా దాటేసిన ఈ టెక్ టైగర్– ప్రపంచ టెక్నాలజీని వేగవంతం చేసిన మాస్టర్‌మైండ్! ఆయన పేరు ఇప్పటివరకు ఎక్కువమందికి తెలియకపోవచ్చు.
కాని, ప్రపంచవ్యాప్తంగా రోజూ వాడే టెక్నాలజీకి ఆధారం ఆయన ఆవిష్కరణలే! అమెరికాలోని మైక్రాన్ టెక్నాలజీలో పనిచేస్తూ, టెక్ రంగంలో నిశ్శబ్దంగా విప్లవం సృష్టించారు. వివిధ టెక్నాలజీలపై ఆయనకు ఇప్పటి వరకు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 1,380 పేటెంట్లు ఉన్నాయి. ఇది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎడిసన్ యూఎస్ పేటెంట్స్ కౌంట్ 1,093 కంటే ఎక్కువ.
సాధారణంగా పేటెంట్ అనేది సాధించడమే ఓ పెద్ద విషయం. ఒక్కటి పొందటానికి సంవత్సరాలు పడుతుంది. అలాంటిది అత్యధిక పేటెంట్స్ కలిగిన భారతీయుడుగా గురుతేజ్ సంధు నిలిచారు. మన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వేగం, సామర్థ్యం పెంచడంలో ఆయన పాత్ర అంచనాకు అందని స్థాయిలో ఉంది.
ఆయన అభివృద్ధి చేసిన ‘అటామిక్ లేయర్ డిపాజిషన్’, ‘పిచ్ డబ్లింగ్’ లాంటి సాంకేతిక పద్ధతులు మెమరీ చిప్‌ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. అంటే చిన్న పాకెట్‌లో పెద్ద ప్రపంచాన్ని నిక్షిప్తం చేయగల టెక్నాలజీని గురుతేజ్ రూపొందించారు. ప్రస్తుతం ఇవే గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా మారిపోయాయి. మీరు ఫోన్‌లో వీడియో చూస్తుంటే, ప్రతి పది సెకన్లకు ‘పాజ్’ కాకుండా స్మూత్‌గా ప్లే అవుతుంటే, దానికి మూల కారణం గురుతేజ్ సంధునే! ఇలానే, మరెన్నో మనం రోజూ వాడే టెక్నాలజీ పరిజ్ఞానాల్లో ఆయన మేధస్సు పనిచేస్తోంది.
ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి. ఆయనకు ‘ఐఈఈఈ ఆండ్రూ ఎస్. గ్రోవ్ అవార్డ్’ అనే అత్యున్నత గౌరవం దక్కింది. అంతేకాదు, ఆయనకు అంతర్జాతీయ మైక్రాన్ సంస్థలో అతి ముఖ్య సాంకేతిక గౌరవమైన ఫెలో హోదా దక్కింది. వివిధ టెక్నాలజీ పరిశోధనల్లో అద్భుత ప్రతిభ చూపినందుకు గాను ‘జార్జ్ ఈ. పేక్’ బహుమతిని కూడా అందుకున్నారు. అయితే, ఇంతటి ఘనత ఉన్నా ఆయన పేరు బహిరంగ ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడం కొంచెం ఆశ్చర్యకరం.
ఫ్యామిలీ స్టార్!
ఒక మధ్యతరగతి భారతీయ కుటుంబం నుంచి ఈ మేధావి కథ ప్రారంభమైంది! లండన్‌లో జన్మించిన గురుతేజ్ సంధు, మూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో భారత్‌కు వచ్చేశారు. తండ్రి సర్జీత్ సంధు, తల్లి గురుమీత్ సంధు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచే ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసించే మేధావిగా ఎదిగాడు. అలా ఆయన మేధస్సు మొదట ఐఐటీ ఢిల్లీ గేట్లు దాటింది, అక్కడే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం అమెరికా ప్రయాణం, నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ సాధించారు. అప్పటి నుంచే ల్యాబ్‌లో సైలెంట్‌గా పని చేస్తూ, ప్రపంచ మెమరీ చిప్‌లకు మెమరబుల్ సైంటిస్టుగా మారారు.
ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు సంగీతంలో ప్రావీణ్యం పొంది డీజేగా గుర్తింపు పొందారు. మరొకరు ఆస్ట్రేలియాలో ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఇలా ఆయన ఇద్దరు కుమారులు కూడా, ఒకరు మ్యూజిక్‌లో, మరొకరు మైక్రోచిప్‌లతో తమ తమ రంగాల్లో మ్యాజిక్ చేస్తున్నారు!. ప్రపంచాన్ని నడిపించే ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఈ మనిషికి గుర్తింపు లభించిందా అంటే – కొద్దిపాటి అవార్డులు మాత్రమే అని చెప్పాలి.