చెట్టు చేసిన త్యాగం | grandmothers bedtime moral stories childhood memories | Sakshi
Sakshi News home page

చెట్టు చేసిన త్యాగం

May 2 2026 12:05 PM | Updated on May 2 2026 12:05 PM

grandmothers bedtime moral stories childhood memories

ప్రతి వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్తాము. రోజు రాత్రి నిద్రించే ముందు మా అమ్మమ్మ ఒక నీతి కథ చెబుతుంది. అందులోని ఈ కథ నాకు బాగా నచ్చింది..

రామగిరి (నల్లగొండ) : పూర్వం అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేదట.. దానికి సమీపంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి చెందిన రాజు అనే బాలుడు ప్రతిరోజూ అడవికి వెళ్లి ఆ చెట్టు వద్ద ఆడుకునేవాడట. అతను చెట్టెక్కి మామిడి పండ్లు  తినేవాడు, దాని నీడలో హాయిగా నిద్రపోయేవాడు. ఆ చెట్టు, రాజు ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉండేవారు. కాలక్రమేణా రాజు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక రోజు అతను చాలా బాధపడుతూ చెట్టు వద్దకు వచ్చి తనకు బొమ్మలు కొనుక్కోవడానికి డబ్బు కావాలని చెప్పాడు. అప్పుడు ఆ చెట్టు.. నా దగ్గర డబ్బులు లేవు, కానీ నువ్వు నా మామిడి పండ్లను కోసి అమ్ముకో దానివల్ల నీకు డబ్బు వస్తుంది అని చెప్పింది. రాజు సంతోషంగా పండ్లను కోసుకుని వెళ్లిపోయి చాలాకాలం వరకు తిరిగి రాలేదు. 

కొన్నేళ్ల తర్వాత రాజు యువకుడిగా తిరిగి వచ్చాడు. తన కుటుంబం కోసం ఒక ఇల్లు కావాలని చెట్టును కోరాడు. ఆ చెట్టు తన కొమ్మలను నరుక్కుని ఇల్లు కట్టుకోమని చెప్పింది. దీంతో రాము ఆ చెట్టు కొమ్మలన్నీ నరుక్కుని వెళ్లి తిరిగిరాలేదు. 

మళ్లీ చాలాకాలం తర్వాత ఒక వేసవి కాలంలో రాజు తిరిగి వచ్చాడు. తాను సముద్ర ప్రయాణం చేయడానికి ఒక పడవ కావాలని చెట్టును అడిగాడు. అప్పుడు ఆ చెట్టు తన కాండాన్ని నరుక్కుని పడవ తయారు చేసుకోమని చెప్పింది. రాజు అలాగే చేసి పడవలో వెళ్లిపోయాడు. 

చివరకు చాలా ఏళ్ల తర్వాత రాజు ముసలివాడిగా తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ చెట్టు ‘నా దగ్గర నీకు ఇవ్వడానికి పండ్లు లేవు, ఎక్కడానికి కొమ్మలు లేవు’ అని రాజుతో చెప్పింది. కానీ రాజు తనకు కేవలం విశ్రాంతి తీసుకోవడానికి ఒక చోటు కావాలని చెట్టును కోరారు. అప్పుడు ఆ చెట్టు తన మిగిలి ఉన్న వేర్ల మీద కూర్చుని విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించింది. రాజు అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ మామిడి చెట్టు ఎంతో సంతోషించింది.

నీతి: చెట్లు మనుషులకు నీడను, పండ్లను మరియు కలపను ఇచ్చి తమ జీవితాంతం సేవ చేస్తాయి. కానీ మనుషులు తమ స్వార్థం కోసం వాటిని నరికేస్తున్నారు. మనం కొత్త మొక్కలను నాటకపోయినా, కనీసం ఉన్న చెట్లను నరకకుండా కాపాడుకోవాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement