
కొత్త భాషలు నేర్చుకునేవారిలో జ్ఞాన విస్తృతి ఒక కోణం అయితే, ఉల్లాసం, ఉత్సాహం అనేది మరో కోణం. మరి మీరు కొత్త భాష నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా! గతంతో పోల్చితే కొత్త భాష నేర్చుకోవడం ఆట్టే కష్టం కాదు. ఇప్పుడు ఎన్నో లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి. అయితే అన్ని యాప్స్ ఉచితం కాదు.
ఈ నేపథ్యలో గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ యాప్ కేవలం అనువాదానికి మాత్రమే పరిమితం కావడం లేదు. కొత్త భాషలు నేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడనుంది. ‘గూగుల్ ట్రాన్స్‌లేట్’ యాప్‌ను ఏఐ–పవర్డ్ లైవ్ ట్రాన్స్‌లేషన్, లాంగ్వేజ్ లెర్నింగ్ టూల్స్‌తో అప్‌డేట్ చేసింది గూగుల్.
జెమిని ఏఐ ద్వారా కొత్త గూగుల్ ట్రాన్స్‌లేట్ ప్రాక్టీస్ మోడ్‌తో కొత్త భాషలు నేర్చుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండానే ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు. కొత్త భాషను వినే, మాట్లాడే అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. రకరకాల సంభాషణలతో భాషా నైపుణ్యాలకు పదును పెట్టవచ్చు.
ఉదాహరణకు మీరు స్పానిష్ మాట్లాడే ప్రాంతానికి వెళ్లబోతున్నారనుకుందాం. అక్కడికి వెళ్లిన తరువాత స్థానికులను ఎలా పలకరించాలి? సహాయం ఎలా అడగాలి....మొదలైన వాటిని నేర్చుకోవచ్చు. మీరు భాషను ఎంత మేరకు నేర్చుకున్నారు అనేదానికి సంబంధించి పద పరీక్షలు కూడా ఉంటాయి.
ఇలా...
లేటెస్ట్ గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్ లాంచ్ చేయాలి
ప్రాక్టీస్ బటన్ నొక్కాలి
‘గెట్ స్టార్టెడ్’ ఎంపిక చేసుకోవాలి
డిస్‌ప్లే లాంగ్వేజ్ (మీరు మాట్లాడే భాష), ప్రాక్టీస్ లాంగ్వేజ్(మీరు నేర్చుకోవాలనుకుంటున్న భాష) సెలెక్ట్ చేసుకోవాలి
నెక్ట్స్–బటన్ నొక్కాలి
కొత్త భాషకు సంబంధించి మీ అవగాహనను ఏఐ అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది
కొత్త భాష నేర్చుకోవడానికి సంబంధించి ‘బేసిక్’ ‘ఇంటర్‌మీడియెట్’ ‘అడ్వాన్స్‌డ్’ ఆప్షన్‌లు ఉంటాయి
‘గోల్స్’ లిస్ట్ కనిపిస్తుంది. నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. నచ్చకపోతే టాప్ రైటర్ కార్నర్‌లోని స్కిప్ బటన్ నొక్కవచ్చు
ఫైనల్‌గా ‘స్టార్ట్ ప్రాక్టీసింగ్’ను సెలెక్ట్ చేసుకోవాలి
లిజన్, స్పీక్ ఆప్షన్‌లు ఉంటాయి. వినడం అనేది పదాల పరిచయానికి, మాట్లాడడం అనేది ఉచ్చారణను మెరుపరచడానికి ఉపయోగపడతాయి. కొత్త భాషలు నేర్చుకునే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉండొచ్చు.
మీ లక్ష్యం సిద్దించిందా? కొత్త లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారా? ఇందుకోసం స్క్రీన్ టాప్‌లో ఉన్న ‘గోల్ బాక్స్’ను నొక్కాలి. సొంతంగా ప్రాక్టిస్ సినారియో క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక కొత్త ఫ్రెండ్‌ను కలుసుకోబోతున్నారనుకుందాం. దృశ్య సంబంధిత సంభాషణల ఆధారంగా లెర్నింగ్ సెషన్‌ను క్రియేట్ చేయవచ్చు.
(చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్')