
పోటీలు అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది యువతే.. అండర్ 14, అండర్ 17.. ఇలా పలు విభాగాల్లో యువతకు పోటీలు నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే మరి వయసు మళ్లిన వారి పరిస్థితి ఏంటి? వారికేమీ ఆటలు ఉండవా? వారిలో ఎలాంటి ప్రతిభా ఉండదా? అంటే ఉంటుందనే చెబుతున్నారు ముంబయికి చెందిన ‘ఖ్యాల్’ నిర్వాహకులు. ఈ విషయం మనలో చాలా మందికి తెలిసినా పెద్దగా పట్టించుకోము.. సరిగ్గా దీని కోసమే ఏర్పాటైన వేదికే ఖ్యాల్. అప్పటి వరకూ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగల బాధ్యతలతో తలమునకలై.. వయసు మళ్లిన తర్వాత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకే ఖ్యాల్ ఏర్పాటు చేశారు. ఖ్యాల్ అంటే తమలోని సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించడానికి, మెరుగుపరచడానికి కల్పించే అవకాశం.. అంటున్నారు నిర్వాహకులు..
వయసు మళ్లిన వారు అంటే చాలా మందికి ఓ చులకన భావం.. వారు ఏమీ చేయలేరు.. సాధించలేరు.. మరి అలాంటి భావాన్ని చెరిపేశారు కొందరు ప్రముఖులు.. సాధించాలనే తపన ఉంటే వయసుతో పనేంటి అను నిరూపించారు. ‘హార్లాండ్ సాండర్స్ 62 సంవత్సరాల వయసులో కేఎఫ్‌సీని ప్రారంభించారు.
ఫల్గుణి నాయర్ 49 సంవత్సరాల వయసులో నైకాను స్థాపించారు. హెన్రీ ఫోర్డ్ 45 సంవత్సరాల వయసులో మొదటి ఫోర్డ్ మోటార్ కారును ప్రజలకు పరిచయం చేశారు..’ ఇవన్నీ కథలు కావు విజయాలకు ప్రేరకాలు అంటారు ఖ్యాల్ నిర్వాహకులు హేమాన్షు జైన్, ప్రీతిష్ నెల్లెరి.
యువత కోసమేనా కాంటెస్ట్స్?
ఏ పోటీ చూసినా అండర్ 25, అండర్ 30 ఇలా యువత, మధ్యవయసు వారికోసమే ఉంటున్నాయి. కానీ సిసలైన జీవితం 50 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, ఆర్థిక స్థిరత్వం, జ్ఞానం, అభిరుచిని ఆస్వాదించే స్వేచ్ఛ అన్నీ ఉండేది అప్పుడే. వర్గీకరించబడేది వయసు మాత్రమే.. టాలెంట్ కాదు.. అందుకే ఖ్యాల్ 50 అబోవ్ 50ని ప్రారంభించింది.
ఇందులో సింగర్ ఆఫ్ ది ఇయర్, చెఫ్ ఆఫ్ ది ఇయర్, మాస్టర్ గార్డెనర్ ఆఫ్ ది ఇయర్, పొయెట్ ఆఫ్ ది ఇయర్, క్రాస్ వర్డ్ చాంపియన్ ఆఫ్ ది ఇయర్... ఇలా ఏ రకమైన టాలెంట్ ఉన్నా సరే పాల్గొనేలా రూపొందించాం. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ పోటీ ప్రపంచానికి గుర్తు చేయనుంది.
50 విభాగాల్లో 50మంది విజేతలు..
వయసు 50 ఏళ్లు దాటిన దగ్గర నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్‌లోనో, ఆధ్యాతి్మక యాత్రల షెడ్యూల్ ఖరారులోనో బిజీగా ఉండే వారి ఆలోచనల్ని సమూలంగా మార్చడమే తమ ధ్యేయం అంటున్నారు ఈ కాంటెస్ట్స్ నిర్వాహకులు. ఫిఫ్టీ ప్లస్ వయసు వారి కోసం 50 అబోవ్ 50 పేరుతో ఏకంగా 50 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ దీనికి సంబంధించిన ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా గత నెలాఖరున నగరంలోనూ ఆడిషన్స్ నిర్వహించిన సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే..
ఇకిగై.. భావనకు అనుగుణంగా..
జపనీయుల దీర్ఘకాల, సంతోషకర జీవనానికి దోహదం చేస్తున్న ‘ఇకిగై’ కాన్సెప్ట్‌కు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ‘ఉద్యోగ విరమణ తర్వాత జీవితం పూర్తిగా కొత్తగా నిర్మించడం’ దీని లక్ష్యం. గత 2020లో స్థాపించిన మా ఖ్యాల్, సీనియర్ సిటిజన్లకు సబ్‌స్కిప్షన్ ప్రాతిపదికన సేవలను అందిస్తుంది.
వారి శారీరక, మానసిక, భావోద్వేగ సామాజిక శ్రేయస్సును పరిరక్షిస్తుంది. మా యాప్‌కు మూడు మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ‘సీనియర్లు వివిధ రకాల కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఇష్టపడే ధోరణిని గమనించాం, ప్రోత్సహిస్తున్నాం, అంతిమంగా విభిన్న ఆసక్తులు కలిగిన సమూహాలను సృష్టించాలన్నదే మా తాపత్రయం.. అదే నేటి ఆడిషన్స్‌కు దారితీసింది.
ఈవెంట్ జరిగే తీరిది..
50 అబోవ్ 50 కోసం ఈ స్టార్టప్ ఆన్‌న్‌లైన్ వీడియో ఆడిషన్‌న్‌లను కూడా నిర్వహిస్తోంది. మే 1 నుంచి ప్రారంభమయ్యే పోటీల్లో హైదరాబాద్ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, లక్నో, జైపూర్, కొచ్చి, ఇండోర్ వంటి 20 నగరాలు పాల్గొంటాయి. ఇందులో భాగంగా పోటీదారులను ఒకచోట చేర్చడానికి కారి్నవాల్ నిర్వహిస్తారు. సరదా నిండిన కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం వ్యక్తిగత ఆడిషన్స్ సైతం ఉంటాయి.
వడపోత తర్వాత, ప్రతి విభాగం నుంచి టాప్–10 ఫైనలిస్టులను సంబంధిత కేటగిరీ నిపుణులు షార్ట్‌లిస్ట్ చేస్తారు. చివరకు ప్రతి కేటగిరీ కింద బెస్ట్‌ని ఎంపిక చేయడానికి పబ్లిక్ ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ జ్యూరీ సభ్యుల్లో ప్రముఖ ఇంద్రజాలికుడు నకుల్ షెనాయ్, రచయిత్రి గీతా రామానుజం, విజువల్ ఆర్టిస్ట్ సెల్వప్రకాష్ లక్ష్మణన్, కవి–ఎడిటర్ వినితా అగర్వాల్, కర్ణాటక న్యూమిస్మాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర మరుధర్ తదితరులు ఉన్నారు. ఖ్యాల్ విజేతలకు మొత్తం కలిపి రూ.1 కోటి నగదు బహుమతిని అందజేస్తారు. గ్రాండ్ ఫినాలే నవంబర్‌లో ముంబైలోని నెస్కో మైదానంలో జరుగుతుంది.
నగరంలో ముగిసిన తొలి దశ ఆడిషన్స్..
నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఇటీవలే ఈ పోటీ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. పదుల సంఖ్యలో హాజరైన అభ్యర్థులు తమ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా పరీక్షించారు. వీరిలో ఎంపికైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
(చదవండి: మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..! ఓ ఫ్యాషన్ డిజైనర్ స్టోరీ)