దారి తప్పుతున్న ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌! | Give Him Nobel: ironic meme used in online trolling | Sakshi
Sakshi News home page

దారి తప్పుతున్న ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌!

Jul 14 2025 10:49 AM | Updated on Jul 14 2025 1:38 PM

Give Him Nobel: ironic meme used in online trolling

‘గివ్‌ హిమ్‌ నోబెల్‌’.. గత కొంత కాలంగా ఈ ఒక్క వాక్యం గ్లోబల్‌ సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పటిలానే కొన్ని వింత వ్యాఖ్యలు చేయగానే, భారతీయ నెటిజన్లు దాన్ని వినోదాత్మకంగా తీసుకుని ట్రోలింగ్‌ మంత్రంగా మార్చేశారు. ఇలాంటి ట్రోలింగ్‌ కల్చర్‌ ప్రస్తుతం అంతర్జాతీయంగానే కాకుండా నగరంలో కూడా విపరీతంగా పెరిగిపోయింది. సోషల్‌ మీడియా యాప్స్‌ అతిగా వినియోగిస్తున్న క్రమంలో ఈ ట్రోలింగ్‌ పుట్టుకొచ్చి నానా హంగామా చేస్తోంది. 

సెలబ్రిటీలు, సినిమాలు, క్రీడలు, సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు, రాజకీయాలు ఇలా ఒకటేంటి.. ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశం పైనా ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇందులో హ్యూమర్, సెటైర్, సోషల్‌ కామెంటరీ, ఫన్, సూచనలు తదితర అంశాలు సమ్మిళితంగా ఉంటుంది. సాధారణంగా నగరంలో లక్షల మంది సోషల్‌ మీడియా యాప్స్‌ వాడుతున్న వారు ఉండటం, అంతర్జాతీయ అంశాలకు సైతం నగరం వేదికగా ఉండటంతో ఇక్కడ కూడా ట్రోలింగ్‌ స్థాయి కాస్త ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్న మాట. 

ట్రోలింగ్‌ ఒక వినోద మాధ్యమంగా ప్రారంభమై, నేడు ఓ సామాజిక ప్రయోగంగా మారింది. అయినా సరే, ఇది బాధ్యతతో వినియోగించాల్సిన సాధనం. హాస్యం చాటుతూనే, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్‌ వంటి డిజిటల్‌ నగరాలు ఈ మార్పులకు మార్గదర్శకంగా మారాలని నిపుణుల అభిప్రాయం. 

స్మార్ట్‌ఫోన్‌ విప్లవం, డేటా వినియోగం పెరిగినప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికల్లో (ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ మొదలైనవి) ట్రోలింగ్‌ ఒక మోడ్రన్‌ కల్చర్‌లా మారింది. హైదరాబాద్‌లోని మిలీనియల్స్, జెన్‌–జీ తరాలు ప్రత్యేకించి ట్రోల్స్‌ను వినోదంగా తీసుకుంటూ, వాటిని షేర్‌ చేయడం ద్వారా మీమ్స్, సెటైర్‌ వంటి కళలను కొత్త రీతిలో వెలుగులోకి తెస్తున్నారు. 

మూడు నుంచి ఐదు గంటలు.. 
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ విడుదల చేసిన 2024 డిజిటల్‌ యుసేజ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలో 78 శాతం మంది యువత రోజుకు కనీసం 3–5 గంటల వరకు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో ట్రోలింగ్‌ ఓ ప్రధాన వినోదపు సాధనంగా మారింది. స్థానిక స్థాయిలో జీహెజ్‌ఎంసీ పనితీరు, ట్రాఫిక్‌ సమస్యలు, మినిస్టర్‌ స్టేట్మెంట్లు మొదలుకొని అంతర్జాతీయంగా ట్రంప్, పుతిన్, ఎలాన్‌ మస్‌్కల వ్యాఖ్యలు కూడా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. 

అత్యధికంగా సినిమాలపైనే.. 
టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌ పాన్‌ ఇండియన్‌ మూవీ ‘ఆదిపురుష్‌ చిత్రం విడుదలైనప్పుడు ‘హనుమాన్‌కి వైఫై ఉంద’ని, థియేటర్లో హనుమాన్‌కు సైతం ఒక సీట్‌ వదిలేయాలనే ట్రోల్స్‌ జోరుగా సాగాయి. నాగ్‌చైతన్య, సమంత విడాకుల సమయంలో కూడా ‘వెడ్డింగ్‌ టార్గెట్‌ 2.0’ అనే పేరుతో కొందరి ఎడిటెడ్‌ పోస్టర్లు చక్కర్లు కొట్టాయి. నేషనల్‌ క్రష్‌గా మారిన రషి్మక మందన సినిమాలో నటిస్తే అది వెయ్యి కోట్లు కలెక్ట్‌ చేస్తుందని, పూజా హెగ్దే నటిస్తే సినిమా ఫ్లాప్‌ అవుతుందని ఇలాంటి వింత వింత ట్రోలింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

సామాన్యుల నుంచి సెలబ్రిటీలు.. ఈ మధ్యనే ముగిసిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సమయంలో ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ విపరీతంగా ట్రోల్‌కు గురయ్యారు. తన జెర్సీ నెంబర్‌ 18, ఈ సారి జరిగిన మ్యాచ్‌ కూడా 18వ మ్యాచ్‌ కావడంతో ఇక ట్రోఫీ గెలవరని దారుణంగా ట్రోల్‌ చేశారు. అయితే దీనికి విభిన్నంగా 18 ఏళ్ల తరువాత మ్యాచ్‌ గెలవడంతో ఈ ట్రోలింగ్‌కు తెలపడింది. 

కానీ మరుసటి రోజు బెంగళూరు వేదికగా విజయోత్సవ వేడుకల్లో భాగంగా అపశృతి జరిగి క్రికెట్‌ అభిమానులు తొక్కిసలాటలో మరణించడంతో మళ్లీ ట్రోలింగ్‌ పుంజుకుని ఒక వారం పాటు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఇదే ఐపీఎల్‌లో హైదరాబాద్‌ టీమ్‌ ఓడినప్పుడు కూడా.. ‘బిర్యానీ తిని ఆట పై దృష్టి సారించలేరనే’ కామెంట్లతో ట్రోల్‌ చేశారు.  

సోషల్‌మీడియా రాజకీయం 
రాజకీయాల పరంగా సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు పారీ్టల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిపుణులను సైతం పెట్టుకుని సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ మీమ్స్‌ తయారు చేస్తున్నారు. వీటికి ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్‌ వేదికల్లో ప్రత్యేక ఖాతాలు, గ్రూపులు సైతం ఆవిష్కరించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్య, ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ–టీడీపీ మధ్య ట్రోలింగ్‌ ఎక్కువగా ఉండగా.. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా బీజేపీ పైన విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతోంది.  

గ్లోబల్‌ వేదికగా.. 
భారత్‌ పాక్‌ యుద్ధం నేపథ్యంలో.. నువ్వు ఓకే అను ఏసేద్దాం అంటూ పోకిరి సినిమా డైలాగ్స్‌ను భారత్‌–ఇజ్రాయెల్‌ మీమ్స్‌గా తయారు చేసి పాక్‌ను విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఇలాంటి ట్రోల్స్‌ తెలుగు మీమర్స్‌ చాలా ఉత్సాహంగా, క్రియేటివ్‌గా ఉన్నారు. ఇదే యుద్ధం సందర్భంగా భారత్‌–పాక్‌ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అనే ట్రంప్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా.. ‘గీవ్‌ హిమ్‌ నోబెల్‌’ అనే ట్రోల్‌ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఎలన్‌ మస్క్‌ ‘ట్విట్టర్‌’లో మార్పులపై ‘ఇంతలోనే ట్విట్టర్‌ మేము మిస్‌ అవుతున్నాం మస్క్‌ గారు’ అంటూ ట్రోల్స్‌ చేశారు.  

ట్రోలింగ్‌లోనూ రెండు రకాలు.. 
పాజిటివ్‌ వర్సెస్‌ నెగెటివ్‌ ట్రోలింగ్‌. పాజిటివ్‌లో హ్యూమరస్, సెటైరిక్‌ ఎక్కువగా ఉంటూ.. సామాజిక అంశాలపై అవగాహన కలిగించేలా ట్రోల్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విఫలతలపై క్రియేటివ్‌గా విమర్శలు, పౌరుల చైతన్యం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు.  నెగెటివ్‌ ట్రోలింగ్‌లో బులీయింగ్, మోసం వంటి అంశాలను ఎత్తి చూపుతున్నారు. ఇందులో వ్యక్తిగత జీవితాలపై దూషణలు తారా స్థాయికి చేరాయి. ట్రోల్‌ పేరుతో హేట్‌స్పీచ్‌ ఎక్కువ వ్యాప్తిచేస్తున్నారు. కుల, మత, భౌగోళిక అంశాలపైన ఈ ట్రోలింగ్‌ ఎక్కువగా ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement