ఓటు మన బాధ్యత

GHMC ELECTIONS : Meet Women Voters In Hyderabad - Sakshi

మనిషి ఇంట్లో ఉండటం తక్కువ. రోజంతా బయటే! చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యాపకాలు. అలసి ఇంటికి చేరిన వారిని ఇల్లు ఆదరిస్తుంది. ఫ్యాన్‌ వేసి కూర్చోబెడుతుంది. మంచినీళ్ల గ్లాసు చేతికి అందిస్తుంది. స్నానానికి వేణ్ణీళ్లు పెడుతుంది. అప్యాయంగా భోజనం వడ్డిస్తుంది. సేదతీరాక, ‘ఈరోజు ఎలా గడిచింది?’ అని అడుగుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మనిషికి కూడా ఇలాంటి ఆదరణే ఉండాలి. రోజూ వెళ్లొచ్చే రోడ్లు బాగుండాలి. రాకపోకలకు రవాణా సౌకర్యం ఉండాలి. రద్దీ తక్కువగా ఉండాలి. రక్షణ, భద్రత ఉండాలి. ఒక్కమాటలో.. మహానగరమే అయినా మన ఇల్లులా ఉండాలి! ఆ నగర ‘గృహ’ బాధ్యత ‘మేయర్‌’ది అయితే, మేయర్‌ ఎన్నికల్లో ఓటు వేయడం పౌరుల బాధ్యత.

ఇంట్లో నీళ్ల ట్యాప్‌ అయినా, రోడ్డు మీద నడిచే మన బతుకు బండైనా ఉండేది మేయర్‌ చేతిలోనే. ఆ  మేయర్‌ని ఎన్నుకునే అవకాశం మళ్లీ ఇప్పుడు నగరజీవి చేతికి వచ్చింది.  డిసెంబర్‌ 1న హైదరాబాద్‌ కార్పోరేషన్‌ ఎన్నికలు. కోటీ 20 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్‌ సిటీలో 74 లక్షలకు పైగా ఓటేయబోతున్నారు. వారిలో మహిళా ఓటర్లు 35 లక్షలకు పైగానే. ఈ మహిళల ఓట్లే ఇప్పుడు కీలకం! ఓటు హక్కును వినియోగించుకోడం తమ బాధ్యత అని భావిస్తున్నారా లేదా అని తెలుసుకోడానికి జీహెచ్‌ఎంసీ (గ్రేటర్‌ హైదరాబాద్‌ మెట్రో కార్పోరేషన్‌) పరిధిలోని మహిళా ఓటర్లను ‘సాక్షి’ కలిసింది. ఎక్కువమంది మహిళల్లో  ఓటు వేయడం పట్ల చైతన్యంతో కూడిన బాధ్యత వ్యక్తం అయింది. 

ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు మాత్రమే ఓటు వేసేదాన్ని. సిటీ ఎన్నికల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే స్థానిక సమస్యల పరిష్కారంలో నగర పాలకవర్గానిదే ప్రధాన పాత్ర అని ఇప్పుడు తెలుస్తోంది. అందుకే ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా ఓటేస్తాను. మా శేరిలింగంపల్లి డివిజన్‌లో అనుమతి లేని నిర్మాణాల వంటి అనేక అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దగలిగిన వ్యక్తినే కార్పొరేటర్‌గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. చుట్టూ ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత, సరైన ప్రతినిధిని ఎన్నుకోవాల్సిన విధి సిటిజన్‌గా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎన్నికల సమయంలో నిరాసక్తంగా ఉండి తర్వాత ఎవరిని తప్పు పట్టినా ప్రయోజనం ఉండదు.
– పి. నీలిమ, ప్రాజెక్ట్‌ మేనేజర్, మైక్రోసాఫ్ట్‌

అప్పట్లో మాకు 21 ఏళ్లకు ఓటు హక్కు వచ్చేది. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతిసారీ ఓటు వేస్తున్నాను. ఎలక్షన్‌ల సమయంలో రేడియో ఉద్యోగంలో పని ఎక్కువగా ఉంటుంది. ఎన్ని పనులున్నా సరే ఓటు వేయడం మానలేదు. ఉదయం ఓటింగ్‌ మొదలయ్యే సమయానికే బూత్‌కి వెళ్లి ఓటు వేసిన తర్వాత డ్యూటీకి వెళ్లేదాన్ని. ఢిల్లీలో ఉద్యోగం చేసినన్నాళ్లు అక్కడ వేశాను, ఇప్పుడు హైదరాబాద్‌లో వేస్తున్నాను. తలవంచుకుని వెళ్లి ఓటు వేసి రావడం కాదు, ఓటింగ్‌ సరళిని గమనించి సమాచారంతో ఆఫీసుకు వెళ్తుంటాను.
– ఎమ్‌.ఎస్‌.లక్ష్మి, న్యూస్‌ కరస్పాండెంట్, ఆల్‌ ఇండియా రేడియో  

మేము హైదరాబాద్‌కి వచ్చి ముప్పై ఏళ్లయింది. ఇక్కడ ఓటు వచ్చి ఇరవై ఏళ్లయింది. ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నాం. మా కష్టం ఎవరూ తీర్చరు. అలాగని ఓటు వేయకపోతే... మనం ఊర్లో ఉన్నా లేనట్లే చూస్తారు. ప్రభుత్వం మాలాంటి వాళ్ల కోసం ఏదైనా పథకం పెట్టినప్పుడు మమ్మల్ని ఏ లీడరూ పట్టించుకోరు. మాకూ అర్హత ఉందని గట్టిగా అడగాలంటే ఓటు వేయాల్సిందే.
– టి. సరస్వతి,పూల వ్యాపారి 

ఒకరొచ్చి చెప్పాలా?!
ఓటు వేయడం ద్వారా మన జీవితంలో ఐదేళ్ల కాలాన్ని ఆ ప్రతినిధి చేతిలో పెడుతున్నాం. అందుకే ఆ ఎన్నిక ప్రక్రియలో విధిగా భాగస్వాములు కావాలి. సరైన వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకోవాలి. నగరంలో మనిషికి ప్రభుత్వం చేయాల్సిన కనీస సర్వీసులు కరెంటు, వాటర్, డ్రైనేజ్‌ సర్వీసులే. అవన్నీ మనం కట్టే పన్నుల నుంచి అందుతున్న సర్వీసులే. ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలను సక్రమంగా అందించే బాధ్యత ఆ ప్రతినిధిది. స్ట్రీట్‌ లైట్‌ వెలగకపోయినా, డ్రైనేజ్‌ పొంగినా మనకు అందాల్సిన సర్వీస్‌ గురించి అడగగలగాలి. అలాగే జనం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎవరో వచ్చి చైతన్యపరచాలని ఎదురు చూడకూడదు. ఎవరికి వాళ్లు చైతన్యవంతం కావాలి. ఇక చాలా మందికి క్యూలో నిలబడడం అంటే నామోషీ. బేషజాలకు పోయి విలువైన ఓటు హక్కును వినియోగించుకోరు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ కూడా రాష్ట్రపతి హోదాలో నేరుగా వెళ్లి ఓటేయకుండా, క్యూలో నిలబడి తన వంతు కోసం ఎదురు చూసి మరీ ఓటేశారు. అంతకంటే స్ఫూర్తి మరేం కావాలి? నా మట్టుకు నేను ప్రతి ఎన్నికలోనూ ఓటేశాను. సాధారణ ఎన్నికలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలో గ్రాడ్యుయేషన్‌ కాన్‌స్టిట్యుయెన్సీ ఓటు కూడా వేశాను. ఇప్పుడు కూడా ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ ఓటు వేస్తాను.
– పి. హరిత, ఎంటర్‌ప్రెన్యూర్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top