న్యాయం దక్కలేదు.. చట్టం మారింది | Funday Story On Legal | Sakshi
Sakshi News home page

న్యాయం దక్కలేదు.. చట్టం మారింది

May 31 2026 8:28 AM | Updated on May 31 2026 8:29 AM

Funday Story On Legal

లైంగిక హింసకు గురైన ఓ ఆదివాసీ మహిళకు అండగా నిలబడి, ఆమె గౌరవాన్ని రక్షించడంలో వ్యవస్థ విఫలమైంది. న్యాయవ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే ఘటనల్లో ఇది ఒకటి.
– సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ 

రక్షకభట నిలయంలోనే తనకు రక్షణ కరువైందని, న్యాయం చేయాలని, మృగాళ్లను శిక్షించాలని ఓ యువతి వేడుకుంది. అయితే, న్యాయస్థానాల్లో ఆమెకు చుక్కెదురైంది. వ్యక్తిగతంగా ఆమెకు న్యాయం దక్కలేదు. నిందితులకు శిక్షపడలేదు. కాని, భారత న్యాయవ్యవస్థలో పలు మార్పులకు, మహిళా రక్షణ చట్టాల బలోపేతానికి ఈ కేసు నాంది పలికింది. అదే  తుకారాం వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు. ‘మథుర’ కేసుగా ఇది ప్రాచుర్యం పొందింది. 

ఇదీ విషాదం
అక్షరం ముక్క రాకపోయినా, తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెంది అనాథగా బతకాల్సి వచ్చినా, ఆమె వెరవలేదు. తన కాళ్లపై నిలబడింది. కూలి నాలి చేసుకుంటూ సోదరుడు గామాతో కలిసి జీవిస్తూ, తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. సోదరుడు పెట్టిన కేసు నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. ఆ యువతే మథుర. కూలి పనులతో పాటు స్థానికంగా ఒకరి ఇంట్లోనూ పని చేసేది. ఆ ఇంటి యజమానురాలి బంధువు అశోక్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆమె సోదరుడు గామాకు నచ్చలేదు. 

దీంతో ఆమె యజమానురాలు నున్షి, ఆమె భర్త, అశోక్‌లు మథురను అపహరించారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నిమిత్తం ఆమెను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దేశాయ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు రాత్రి సమయంలో తీసుకువచ్చారు. ఆమె వయస్సు ధ్రువీకరణ పత్రం తీసుకుని మర్నాడు స్టేషన్‌కు రావాలని చెప్పి రైటర్‌ బయటకు వెళ్లాడు. తుకారాం, గణపత్‌ అక్కడే కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు.

ఏం జరిగింది
మ«థుర వాంగ్మూలం ప్రకారం..‘అందరం బయటకు వెళుతున్న సమయంలో గణపత్‌ తనను ఆపాడని, మిగతా వాళ్లు వెళ్లిపోవాలని తుకారామ్‌ ఆదేశించాడు. పోలీస్‌ స్టేషన్‌ తలుపులు మూసేశారు. లైట్లు ఆర్పేశారు. ఒంటరిగా ఉన్న తనను భవనం వెనుక వైపు ఉన్న బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి తుకారామ్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడ్ని తప్పించుకుని బయటకు  వస్తుండగా గణపత్‌ సైతం లైంగిక దాడికి యత్నించాడు. అతడు మద్యం మత్తులో ఉండడంతో తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌ వెలుపలికి వచ్చాను’. ఈ ఘటనపై స్థానికుల నుంచి సైతం ఒత్తిడి రావడంతో కేసు నమోదైంది.  

కోర్టులో విచారణ
తొలుత చంద్రపూర్‌ సెషన్స్‌ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. లైంగిక నేరం జరిగిందనడానికి బలమైన కారణాలు లేవని, ఆమె ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద ఎటువంటి గాయాలు, ప్రతిఘటనకు సంబంధించిన ఆనవాళ్లు లేవని తేల్చింది. ఆమె అంగీకార పూర్వకంగానే ఇది జరిగి ఉండొచ్చని పేర్కొంది. కానిస్టేబుళ్లను  నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో కేసు హైకోర్టుకు చేరింది. సెషన్స్‌ కోర్టు వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. భయం, నిస్సహాయత కారణంగా ఆమె ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా భావించలేమని తుకారామ్‌కు ఐదేళ్లు, గణపత్‌కి ఏడాది జైలు శిక్ష విధించింది.

సుప్రీంకోర్టులోనూ..
హైకోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిస్సహాయ లొంగుబాటును అత్యాచారంగా పరిగణించడానికి సరిపడా ఆధారాలు లేవని పేర్కొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. 

వెల్లువెత్తిన నిరసనలు
కోర్టులో కేసు నిలబడలేదు. ఆమె కోరుకున్న న్యాయం దక్కలేదు. కాని, సమాజం నుంచి అనూహ్యంగా మద్దతు వెల్లువెత్తింది. సుప్రీం కోర్టు తీర్పుపై మేధావులు కలమెత్తారు. ఇది వాంఛనీయం కాదంటూ నలుగురు న్యాయ శాస్త్ర ప్రొఫెసర్లు అప్పటి చీఫ్‌ జస్టిస్‌కు బహిరంగ లేఖ రాశారు. చట్టం, రాజ్యాంగం ప్రకారం మహిళలకు సంక్రమించిన హక్కులను హరించేలా తీర్పు ఉందంటూ ఆక్షేపించారు. మథురకు జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తించినప్పటికీ సాంకేతికపర అడ్డంకులు న్యాయానికి ప్రతిబంధకాలుగా, నిందితులకు అనుకూలంగా మారాయి. మథురకు న్యాయం జరగలేదంటూ పౌర సమాజం స్పందించింది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా మొదటిసారి గొంతెత్తి నినదించింది. ప్రభుత్వాన్ని కదిలించింది. చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది.

  • మార్పులు ఇలా..
    అన్యాయానికి గురైన మహిళలకు రక్షణగా చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది. ఈ సవరణలు భారత  న్యాయవ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది.

  • ‘కస్టోడియల్‌ రేప్‌’ అంటే నిర్దిష్టమైన నిబంధనలను నిర్వచించింది. పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ అధీనంలో ఉన్న, పని చేస్తున్న వారిపై లైంగిక దాడికి పాల్పడితే పదేళ్ల వరకు శిక్ష విధించేలా మార్పులు చేసింది. 

  • తన సమ్మతి లేకుండానే లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేస్తే, తాను నిర్దోషినని నిందితుడే నిరూపించుకునేలా భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేశారు.

  • బాధితురాలి గౌరవాన్ని కాపాడేందుకు లైంగిక దాడి కేసులను బహిరంగ విచారణ కాకుండా, ఇన్‌ కెమెరా ట్రయల్స్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించారు.

  • బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసేలా మీడియాలో పేరు రాయడం, ఫొటోలు ప్రచురించడాన్ని నిషేధించారు. \

  • భయం, బెదిరింపులు, నిస్సహాయత కారణంగా ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా, నిశబ్దాన్ని అనుమతిగా  భావించరాదని గుర్తించారు.  

-దిలీప్‌ మాదిరెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement