ఎండలు మండే వేసవి కాలంలో కడుపు చల్లగా ఉంటేనే ఆరోగ్యం. వేసవి ప్రత్యేకంగా పిల్లా పెద్దా అందరికీ కడుపు చల్లగా ఉంచే వంటకాలు మీ కోసం...
స్వీట్‌కార్న్ స్టూ
(6 నెలల పైబడిన పిల్లలకు)
కావలసినవి: స్వీట్‌కార్న్: 1 టిన్ (160 గ్రాములు)
వెల్లుల్లి: 1 చిన్న రెబ్బ, నూనె: 1 టీస్పూన్
ఉల్లిపాయ: పావు వంతు (చిన్న ముక్కలుగా కోసినది), పాలు: 200 మి.లీ
మిక్స్‌డ్ హెర్బ్స్: పావు టీస్పూన్ (ఆప్షనల్)
తయారీ: ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి 1 నుంచి 2 నిమిషాల పాటు అవి మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత అందులో స్వీట్‌కార్న్, పాలు పోయాలి. పాలు మరిగిన తర్వాత, మంటను తగ్గించి సుమారు 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.
ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనిచ్చి, ఆ తర్వాత దీనిని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. దీనిని ఆరు నెలల పైబడిన పిల్లలకు రోజుకు 40 గ్రాముల వరకు తినిపించవచ్చు. దీనిని నిల్వ పెట్టుకోవాలనుకుంటే ఒక గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రీజర్‌లో పెట్టాలి. దీనికి తోడుగా ఉడికించిన కూరగాయలు, హోల్‌మీల్ బ్రెడ్ ముక్కలను కూడా కలిపి తినిపించవచ్చు.
జల్ జీరా
కావలసినవి: తాజా పుదీనా ఆకులు: 1/2 కప్పు
జీలకర్ర పొడి: టేబుల్ స్పూన్
చింతపండు గుజ్జు: టేబుల్ స్పూన్
నల్ల ఉప్పు: టీస్పూన్, నిమ్మరసం: టేబుల్ స్పూన్
బెల్లం పొడి: టేబుల్ స్పూన్, నీళ్లు: 4 కప్పులు
నిమ్మకాయ ముక్కలు: అలంకరణ కోసం
తయారీ: ఒక బ్లెండర్‌లో పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, నల్ల ఉప్పు, నిమ్మరసం, బెల్లం పొడి వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక జగ్గులోకి వడకట్టండి. ఇప్పుడు మిగిలిన నీటిని పోసి బాగా కలపండి. ఈ జల్ జీరాను కొన్ని గంటల పాటు రిఫ్రిజిరేటర్‌లో బాగా చల్లబడే వరకు ఉంచాలి.
ఈ చల్లబడిన జల్ జీరాను గ్లాసుల్లో పోసి, ఐస్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయండి. మీ రుచికి తగినట్లుగా పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. జల్ జీరా వేసవికి చాలా మంచిది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.
చికూ పెకాన్ కుల్ఫీ
కావలసినవి: పెకాన్ గింజలు (సిమ్లా అక్రోట్): 30 నుంచి 40
సపోటాలు: 5 నుంచి 6 (గింజలు తీసి, తొక్కతో సహా ముక్కలుగా కోసినవి)
చక్కెర: 1/4 కప్పు
పాల పొడి: 3 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి: 1/2 టీస్పూన్
మరిగించి చిక్కబరిచిన పాలు: 3 కప్పులు
గార్నిష్ కోసం: సపోటా ముక్కలు, పెకాన్ గింజలు.
తయారీ: 15 నుంచి 20 పెకాన్ గింజలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన పెకాన్ గింజలను మిక్సీ జార్‌లో వేసి రఫ్‌గా గ్రైండ్ చేయాలి. అందులోనే సపోటా ముక్కలు, చక్కెర, పాల పొడి, ఏలకుల పొడి వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సగం కోసిన పెకాన్ ముక్కలు, చిక్కబరిచిన పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మోల్డ్స్‌లో పోసి, మూతలు పెట్టి 6 నుంచి 8 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. కుల్ఫీ గడ్డకట్టిన తర్వాత బయటకు తీసి, మిగిలిన పెకాన్ ముక్కలపై దొర్లించాలి. ప్రతి కుల్ఫీని మధ్యలోకి కట్ చేసి, సపోటా ముక్కలు, పెకాన్ గింజలతో అలంకరించి చల్లగా వడ్డించాలి.


