అటు ప్రయోగం ఇటు ప్రయోజనం! | Funday LitWorld | Sakshi
Sakshi News home page

అటు ప్రయోగం ఇటు ప్రయోజనం!

May 31 2026 8:23 AM | Updated on May 31 2026 8:23 AM

Funday LitWorld

అందమైన పరిసరాల్లో పుట్టి పెరిగిన కళాకారుల రచనల్లో సౌందర్యం జాలువారుతుందని వర్డ్స్‌వర్త్, కీట్స్, కాలెరిజ్‌ తదితర ఇంగ్లిష్‌ భావకవులు– మూడువందల యేళ్ళ కిందట – ఓ సిద్ధాంతం చెప్పారు. విలియం గిల్పిన్‌ అనే విమర్శకుడు వారి సిద్ధాంతానికి ‘పిక్చరెస్క్‌ ఈస్థెటిక్స్‌‘ (రమణీయ సౌందర్యశాస్త్రం) అని పేరుపెట్టారు. అంతకు వెయ్యిన్నర సంవత్సరాల కిందట భామహుడు మొదలుకొని ఆనందవర్ధనుడి వరకు ఎందరో భారతీయ ఆలంకారికుల సిద్ధాంతాల్లోనూ అలాంటి భావాలున్నాయనే మాట నిజమే– అయితే అదలా వుంచండి! ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ భావనకు ఉదాహరణగా చెప్పదగిన రచయిత జ్షాన్‌ మారీ గుస్తావ్‌ లా క్లేజ్యో ఒకరు. లా క్లేజ్యోకు 2008లో నోబెల్‌ సాహిత్యపురస్కారం ప్రకటిస్తూ ‘ఆయన రచనలు సరికొత్త ప్రయోగాలూ, కవితాత్మక సాహసకృత్యాలూ, ఆనందానుభూతుల చిత్రణలతో నిండి వుంటాయ’ంది స్వీడిష్‌ ఎకాడెమీ.

 (నోబెల్‌ సాహిత్య పురస్కారం ఎవరికివ్వాలో నిర్ణయించేది ఈ ఎకాడెమీయే.) అంతేకాదు– ‘ప్రస్తుతం చెలామణీలో వున్న నాగరికతను మించినవారి కథలనూ, దాని పరిధిలోకి రానివారి కథలనూ కూడా చిత్రించిన రచయిత’గా లా క్లేజ్యోను ప్రశంసించింది స్వీడిష్‌ ఎకాడెమీ. నవలాకారుడిగానూ, కథానిక రచయితగానూ, వ్యాసకర్తగానూ, అనువాదకుడిగానూ సుప్రసిద్ధుడు లా క్లేజ్యో. ఇటలీ సరిహద్దుకు చేరువగా వుండే ఫ్రెంచ్‌ నగరం నీస్‌లో పుట్టారాయన. అది ఆయన తల్లి తరఫు బంధువుల స్వస్థలం. లా క్లేజ్యో తండ్రి తరఫు బంధువులు వందల సంవత్సరాల కిందటే తరలి వెళ్ళిపోయారు. అలా ఆయన పుడుతూనే ద్విజాతీయుడు. అందుకే లా క్లేజ్యో తనను తాను ఫ్రాంకో–మారిషియన్‌గా చెప్పుకుంటారు.

ఇంగ్లండ్‌– ఫ్రాన్స్‌– మెక్సికో దేశాల్లో చదువుకుని డాక్టరేట్‌ పట్టా పుచ్చుకున్నారు లా క్లేజ్యో. అండర్‌ గ్రాడ్యుయేట్‌ పట్టాకోసం ఆయన ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. మాస్టర్స్‌ కోసం, ఫ్రెంచ్‌ ప్రయోగాత్మక కవి– రచయిత– చిత్రకారుడు హెన్రీ మిషో రచనలను ఎంచుకున్నారు. తీరా డాక్టరేట్‌ విషయానికి వచ్చేసరికి ఆధునిక చరిత్ర ఆవిర్భవిస్తున్న దశను లా క్లేజ్యో ఎంపిక చేసుకున్నారు. సామాన్య శకం 1525 వరకూ, స్వతంత్రంగా జీవించిన పూరిపెచా ప్రజలు ఆ దశలో మశూచికం తదితర అంటువ్యాధుల పాలబడ్డారు. ఆ పరిస్థితిలో, వారి నాయకులు ప్రజల సంక్షేమం కోసం యుద్ధాన్ని నివారించాలని భావించారు. స్పెయిన్‌ రాజుకు సామంతరాజ్యంగా ఉంటామని స్వచ్ఛందంగా ప్రకటించారు.

 దాన్నే ‘పూరిపెచా జాతిపై దిగ్విజయం’గా వక్రీకరించారు స్పానిష్‌ చరిత్రకారులు. లా క్లేజ్యో తన సిద్ధాంత గ్రంథంలో ఈ వంచనను వెలికితీశారు! పదహారో శతాబ్ది నాటి రాతప్రతుల ఆధారంగా ఆయన ఈ గుట్టు రట్టు చేయగలిగారు. ఆయన అధ్యయన ప్రణాళిక ఇంత క్లిష్టంగా వున్నందువల్లనే అది పూర్తికావడానికి పాతికేళ్ళు పట్టింది.రచయితగా, ప్రయోగశీలతనూ – ప్రయోజన దృష్టినీ గొప్పగా సమ్మిళితం చేశారు లా క్లేజ్యో. రాబర్ట్‌ లూయీ స్టీవెన్సన్, శాలింగర్, మిషో, హెమింగ్వే, ఫాక్నర్‌– లా క్లేజ్యోను ప్రభావితం చేసినవారు. అలాంటి రచయిత ప్రయోగం– ప్రయోజనం అనే రథచక్రాల మీద వీరవిహారం చెయ్యడంలో వింతేముంది? ఏడేళ్ళ పసితనంలోనే సముద్రం గురించి చిన్న పుస్తకం రాసేశాడు ఈ పిడుగు! నైజీరియాలో వున్న తండ్రిని మరుసటి సంవత్సరం –1948లో– కుటుంబ సమేతంగా కలవబోతున్నానన్న ఊహే, లా క్లేజ్యో చేత ఆ పుస్తకం రాయించింది. 

ఇదే ఊహ, 44 సంవత్సరాల తర్వాత ‘అనీత్సా’ అనే నవలగానూ రూపుదిద్దుకుంది. అదీ పూర్తిగా కల్పన కాదంటారు లా క్లేజ్యో సాహిత్య నిపుణులు. బహుశా అందుకేనేమో, వారెన్‌ మాటీ అనే విమర్శకుడు ఈ 44 యేళ్ళ కాలాన్ని లా క్లేజ్యో శిక్షణకాలంగా అభివర్ణించాడు! ఈ కథ 1848లో జరిగిందని రచయిత ప్రత్యేకంగా ప్రకటించడం విశేషం! ఫ్రాన్స్‌ దక్షిణ తీరం నుంచి ఓ పాత నావలో బయల్దేరిన తల్లీ కొడుకులు పశ్చిమ ఆఫ్రికా తీరం పొడుగునా సాగించే సుదీర్ఘ యాత్రే ఈ నవలకు ఇతివృత్తం. ఈ రెండు పుస్తకాలూ రాయడానికి మధ్య కాలంలో లా క్లేజ్యో ఎన్నో మెరుపులు మెరిపించారు. 

1963లో వెలువడిన ‘లా ప్రాసెస్‌ వెర్బల్‌’ (విచారణ– ఇంటరాగేషన్‌) అనేది లా క్లేజ్యో తొలి నవల. దానికే ‘ప్రీ రెనాడో‘ పురస్కారం అందుకున్నాడాయన. ఇదే రచన మరో పోటీల్లో కూడా షార్ట్‌ లిస్ట్‌ కావడం విశేషమే మరి. లా క్లేజ్యో ప్రయోగాల్లో అత్యధిక పాఠకాదరణ పొందిన నవల ‘డెజెర్ట్‌.’ ఉత్తర ఆఫ్రికాలో కనిపించే సంచార ఆదివాసుల ప్రణయగాథ దానికి ఇతివృత్తం. ఈ నవల వేర్వేరు కాలాల్లో జరిగిన కథను వేర్వేరు వ్యక్తుల దృష్టికోణం నుంచి చూపిస్తాడు కథకుడు. ఇలాంటి శిల్పవిన్యాసం పాఠకులను రంజింప చెయ్యడంలో వింతేముంది?

లా క్లేజ్యోతో పొల్చదగిన రచయితలు అతని సమకాలికుల్లో ఎవరూ లేరనే చెప్పొచ్చు. అయితే అతనికన్నా ముందుగా నోబెల్‌ సాహిత్య పురస్కారం అందుకున్న ఫ్రెంచ్‌ రచయితలు కూడా ఎవరికీ తీసిపోరు మరి! ఈ పురస్కారం మొదలైన యేడాదే, 1901లో, దాన్ని గెల్చుకున్నవాడు సూలీ ప్రూదాం. ఆయన రాసిన ప్రతీకాత్మక కవిత్వం సుప్రసిద్ధం. ముఖ్యంగా, ప్రూదాం రాసిన ‘ద బ్రోకెన్‌ వేజ్‌ – పగిలిన కలశం’ కవితను నెట్‌ లో చూడొచ్చు! ఇక 85 ఏళ్ళ తర్వాత ఈ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన క్లాడ్‌ సిమో కూడా తక్కువ వాడేం కాడు. శైలీ విన్యాసానికీ, ప్రయోగశీలతకూ సిమో సుప్రసిద్ధుడు. పోతే, 2000 సంవత్సరానికి గానూ నోబెల్‌ సాహిత్య పురస్కారం అందుకున్న గావ్‌ షింజియాంగ్‌ ఫ్రెంచ్‌ జాతీయుడే కానీ ఫ్రెంచ్‌ రచయిత కారు! అయినా, పెద్దలతో పోలికలెందుకు మనకు? ఎవరంత వాళ్ళు వారనుకుంటే పోలా? 

-లిట్‌వరల్డ్‌ 

Advertisement
 
Advertisement
Advertisement