క్లూషియల్‌: ది రైటర్‌ | FunDay Crime Story | Sakshi
Sakshi News home page

క్లూషియల్‌: ది రైటర్‌

May 31 2026 8:17 AM | Updated on May 31 2026 8:18 AM

FunDay Crime Story

ప్రముఖ క్రైమ్‌ నవలా రచయిత చక్రవర్తి మరణం రాష్ట్రాన్ని  కుదిపేసింది. క్రైమ్‌ నవలా రచయితగా అతనికి   ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతని క్రైమ్‌ కథలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ కేసును పరిశోధించడానికి క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ నచికేత రంగంలోకి దిగాడు.క్రైమ్‌ సీన్‌... టేబుల్‌ మీద అలాగే ఒరిగిపోయి ఉన్నాడు చక్రవర్తి. టెక్నాలజీ ఎంత పెరిగినా అతను పెన్‌తో కాగితం మీద కథలు రాయడానికి ఇష్టపడతాడు. కథ రాస్తూ అలాగే ఒరిగిపోయాడు. ఉదయానికే చక్రవర్తి ఊపిరి ఆడక ప్రాణాలు విడిచాడు. పైకి అది గుండెపోటులా కనిపించింది. కానీ అది అసహజ మరణంగా, హత్యగా అనిపించింది నచికేతకు.

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా చక్రవర్తి టేబుల్‌పై ఉన్న ఆ ఫౌంటెన్‌ పెన్‌ అతని కంటపడింది. ఆ పెన్‌ నిబ్‌ దగ్గర స్వల్పంగా నీలిరంగు మరక ఉండడం గమనించాడు. పేపర్‌ మీద రాసిన అక్షరాల ఇంక్‌ నలుపు రంగులో ఉంది. మరి ఆ నీలి రంగు ఏమిటి?
నచికేత వెంటనే ఆ పెన్‌ ను ఫోరెన్సిక్‌ లాబ్‌కు పంపాడు.నచికేత విచారణ మొదలుపెట్టాడు. ఇంట్లో అందరినీ ప్రశ్నించాడు. చక్రవర్తి తమ్ముడు భార్గవతో సహా ఇల్లంతా సోదా చేశాడు. భార్గవ గదిని సోదా చేసినప్పుడు అక్కడ కొన్ని పాత సైన్స్‌ జర్నల్స్‌ కనిపించాయి.
నచికేత చక్రవర్తి వాడిన ఫౌంటెన్‌ పెన్‌ను నిశితంగా పరిశీలించాడు. కానిస్టేబుల్‌ని పిలిచి ఆ నిబ్‌ పెన్‌ చూపించి ఏదో చెప్పాడు.
సరిగ్గా అరగంట తర్వాత చక్రవర్తి తమ్ముడు భార్గవను గదిలోకి పిలిచాడు ఇన్‌స్పెక్టర్‌ నచికేత.

‘మీ అన్నయ్య ఆత్మశాంతి కోసం ఒక సందేశాన్ని ఈ కాగితం మీద రాసి ఇవ్వండి. చక్రవర్తిగారు ప్రముఖ రచయిత కదా... మీ స్వదస్తూరితో ఆ సందేశాన్ని రాస్తే పత్రికల్లో సంతాప సందేశాన్ని ప్రకటనగా ఇద్దాం.’ అన్నాడు ఫౌంటెన్‌ పెన్‌ను భార్గవకు ఇస్తూ..  ఆ పెన్‌ వంక, నిబ్‌ వంక భయంగా చూశాడు భార్గవ.‘మీ అన్నయ్య రాత్రి వాడిన పెన్నే.. సెంటిమెంట్‌గా ఇచ్చాను.. వేలితో నిబ్‌ను సరిచేసుకో.’ అన్నాడు.  అతని వంకే చూస్తూ...భార్గవ మొహంలో రంగులు మారాయి. పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎదురుగా పోలీసులు సంకెళ్లతో..

మీడియా గుమికూడింది. ప్రముఖ క్రైమ్‌ నవలా రచయిత మరణం మిస్టరీని అరవై నిమిషాల్లో ఛేదించిన నచికేతను అభినందిస్తూ ‘హంతకుడిని ఎలా పట్టుకున్నారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించింది.నచికేత చెప్పడం మొదలుపెట్టాడు.‘చక్రవర్తికి కథ రాస్తున్నప్పుడు వేలితో నిబ్‌ను సరిచేసుకునే అలవాటు ఉంది.ఆ పెన్‌ నిబ్‌ దగ్గర స్వల్పంగా నీలిరంగు మరక ఉండటం గమనించాను. అతను అప్పటి వరకు రాసి ఉన్న కాగితం మీద అక్షరాల ఇంక్‌ నలుపు రంగులో ఉంది. మరి ఆ నీలి రంగు ఏమిటి? వెంటనే ఆ పెన్‌ ను ఫోరెన్సిక్‌ లాబ్‌కు పంపాను. రిపోర్ట్‌లో అది ‘రిసిన్‌’ అనే విషం అని తేలింది.భార్గవ గదిని సోదా చేసినప్పుడు అక్కడ కొన్ని పాత సైన్స్‌ జర్నల్స్, ఆముదపు గింజల అవశేషాలు కనిపించాయి. 

భార్గవ ఇంటర్నెట్‌ హిస్టరీని చెక్‌ చేయించగా, అతను గత నెల రోజులుగా ‘విషప్రయోగం – ఎవరికీ దొరక్కుండా ఎలా చేయాలి?’ అనే అంశాలపై సెర్చ్‌ చేసినట్లు తేలింది.భార్గవకు ఆస్తిపై మోహం.. అన్న చక్రవర్తిపై ద్వేషం.. కోట్లాది రూపాయల విలువైన వారసత్వ ఆస్తి దక్కాలంటే అన్న అడ్డు తొలగాలి. భార్గవ తెలివైన క్రిమినల్‌ మైండ్‌ వున్నవాడు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్‌ వేశాడు. ఆముదపు గింజల నుండి తీసిన అత్యంత ప్రమాదకరమైన ‘రిసిన్‌’ అనే విషాన్ని సేకరించి, చక్రవర్తి రోజూ వాడే ఖరీదైన ఫౌంటెన్‌ పెన్‌ నిబ్‌కు అతి సూక్ష్మంగా పూశాడు.

అందుకే చక్రవర్తి వాడిన ఫౌంటెన్‌ పెన్‌ లాంటిది ఇచ్చి దాని నిబ్‌ను టచ్‌ చేయమంటే భయపడిపోయాడు. దొరికిపోయాడు.నిజానికి ఈ పరిశోధన వెనుక చక్రవర్తి గారు రాసిన క్రైమ్‌ కథల ప్రేరణ వుంది. నేరస్థుల మైండ్‌ సెట్‌తో ఆయన రాసే కథల్లోని పరిశోధన నాకు ఉపయోగపడింది.వారి ఆత్మకు శాంతి చేకూరాలి. భార్గవ లాంటి నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.’ చెప్పి ముందుకు కదిలాడు నచికేత.
 -శ్రీసుధామయి 

Advertisement
 
Advertisement
Advertisement