∙ బక్రీద్
ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పవిత్ర పర్వదినం ‘ఈదుజ్జుహా’ లేదా ‘బక్రీద్’. పండుగ రాగానే అందరి ఇళ్లలో సందడి, ఖుర్బానీలు కనిపిస్తాయి. అయితే, ఈ పండుగ వెనుక ఉన్న అసలైన మర్మం, ‘ఖుర్బానీ’ అనే పదానికి ఉన్న మహోన్నతమైన అర్థం– మహత్తర త్యాగం. ప్రపంచ చరిత్రలోనే ఎవరూ ఊహించని, సాటిలేని త్యాగాన్ని ఆచరించి చూపించిన అమరమూర్తి ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలామ్ (అ). ఆయన జీవితం బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అడుగడుగునా కఠోర పరీక్షల పరంపర. పుత్రునిగా, భర్తగా, తండ్రిగా, ప్రవక్తగా... ఆయన తన కర్తవ్య నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఆ, స్ఫూర్తిదాయక గాథ ఇదిగో...
ఖుర్బానీ అంటే జంతుబలి కాదు... అనుపమానమైన ఆత్మత్యాగం! ఐదు వేల ఏళ్ల క్రితం ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక తల్లి దైవమార్గంలో ప్రదర్శించిన అచంచల విశ్వాసానికి, నిరుపమానమైన ఓర్పుకు సజీవసాక్ష్యం ఈ పండుగ. గుండెలను పిండేసే ఆనాటి సంఘటనలు, నేటికీ మానవాళికి అందిస్తున్న ఓ మహత్తర సందేశం...
దాదాపు ఐదువేల సంవత్సరాల క్రితం... నేటి ఇరాక్ ప్రాంతాన్ని ‘నమ్రూద్’ అనే గర్వాంధుడైన రాజు పాలిస్తుండేవాడు. తానే దేవుడినని గర్వించే ఆ రాజు బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఇబ్రాహీం (అ) గళం విప్పారు. సర్వ సృష్టిని సృష్టించిన ఆ ఒక్కడే దేవుడని, ఆయననే ఆరాధించాలని పిలుపునిచ్చారు.దీంతో ఆగ్రహించిన రాజు, ఇబ్రాహీంను భగభగ మండే అగ్నిగుండంలో పడవేయించాడు. కానీ, దైవసంకల్పంతో ఆ అగ్నిగుండం కాస్తా చల్లని పూలపాన్పుగా మారిపోయింది! ఆ పరాభవంతో రాజు దేశ బహిష్కారం విధించగా, ఇబ్రాహీం దైవసందేశ ప్రచారంలోనే శేషజీవితాన్ని గడిపారు.
ఎడారిలో కురిసిన ‘జమ్ జమ్’ అమృతం
వయసు పైబడుతున్న కొద్దీ, తన తర్వాత దైవసందేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక సంతానం ఉంటే బాగుండని ఆయన కోరుకున్నారు. దైవానుగ్రహంతో వృద్ధాప్యంలో పండంటి బాబు (ఇస్మాయీల్) జన్మించాడు. లేకలేక కలిగిన బిడ్డను చూసుకుని ఆ దంపతులు మురిసిపోతున్న తరుణంలో... దేవుడు మరో కఠిన పరీక్ష పెట్టాడు. భార్యను, పసికొడుకును జనసంచారం లేని నిర్జన ఎడారిలో వదిలి రమ్మని ఆదేశించాడు.
దైవాజ్ఞను శిరసావహించి, భార్య హాజిరాతో విషయం చెప్పారు. దైవనిర్ణయాన్ని ఆమె కూడా చిరునవ్వుతో స్వీకరించి, ఆ ఎడారిలో నిస్సహాయంగా నిలిచింది. (ఆనాటి ఆ నిర్జన ఎడారే నేటి ప్రపంచ ప్రసిద్ధ మక్కా నగరం).
నాలుక తడుపుకోవడానికి చుక్క నీరు లేని ఆ ఎడారిలో, పసికందు దాహంతో గుక్కపట్టి ఏడుస్తుంటే... ఆ తల్లి గుండె విలవిలలాడింది. నీటి కోసం అక్కడి ‘సఫా’, ‘మర్వా’ కొండల మధ్య ఆమె పరుగులు తీశారామె. ఆ సమయంలో, చిన్నారి ఇస్మాయీల్ దాహంతో ఏడుస్తూ కాలిమడిమలతో నేలను తాకిన చోట... దైవాజ్ఞతో ఒక అద్భుతమైన నీటి ఊట వెలిసింది. అదే పవిత్ర జలం ‘జమ్ జమ్’. నాటి నుండి నేటి వరకు, కోట్లాది మంది దాహం తీరుస్తున్న ఆ పవిత్ర జలం ఎన్నటికీ చెడిపోదు.
మానవ చరిత్ర ఎరుగని ‘ఆఖరి పరీక్ష’
కొన్నేళ్ల తర్వాత, ఇబ్రాహీం మక్కా తిరిగివచ్చి భార్యాపిల్లలను కలుసుకున్నారు. తనయుడు ఇస్మాయీల్‌తో కలిసి పవిత్ర ‘కాబా’ గృహాన్ని నిర్మించారు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో... మానవ చరిత్ర కనీవినీ ఎరుగని అత్యంత కఠినమైన పరీక్ష ఎదురైంది. తనప్రాణప్రదమైన కన్నకొడుకునే దైవమార్గంలో త్యాగం (ఖుర్బానీ) చేయాలని కలలో దైవాదేశం అయింది.
ఆశ్చర్యం ఏమిటంటే, తండ్రి ఆ విషయాన్ని కొడుక్కి చెప్పినప్పుడు... ఆ చిన్నారి ఇస్మాయీల్ ఏమాత్రం భయపడకుండా, ‘నాన్నా! దైవాజ్ఞను నెరవేర్చండి, నన్ను ఓర్పు వహించేవారిగా పొందుతారు‘ అని తండ్రికే ధైర్యం చెప్పాడు. ఆ తండ్రీకొడుకులు దైవసమ్మతి కోసం తమ సర్వస్వాన్ని,ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. వారి అచంచల విశ్వాసానికి మెచ్చిన అల్లాహ్... ఇస్మాయీల్ స్థానంలో ఒక జీవాన్ని ప్రసాదించి, ఆ పరీక్షను విజయవంతం చేశాడు. ఆ త్యాగానికి ప్రతీకగానే నేడు ముస్లింలు బక్రీద్ రోజున పశువును ఖుర్బానీ ఇస్తారు.
రక్తమాంసాలు కావు... భయభక్తులే ముఖ్యం!
ఖుర్బానీ అంటే కేవలం ఒక జంతువును బలి ఇవ్వడం కాదు; అల్లాహ్ పట్ల మనకున్న అంకితభావాన్ని, నిస్వార్థాన్ని చాటుకోవడం. అందుకే పవిత్ర ఖురాన్ స్పష్టంగా చెబుతోంది: ‘వాటి మాంసమూ అల్లాహ్‌కు చేరదు, వాటి రక్తమూ చేరదు. కానీ మీ హృదయాల్లోని భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయి’.
జీవన సూత్రం
మన ప్రతి ఆచరణా దైవాదేశాలకు అనుగుణంగా ఉండాలి. ఒకే దైవాన్ని విశ్వసించడం, మానవులంతా ఒక్కటే అని నమ్మడం, తల్లిదండ్రుల హక్కులు కాపాడటం, పేదలను ఆదుకోవడం, చెడుకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవడం... ఇవే బక్రీద్ మనకు అందించే జీవన సూత్రాలు. అవసరమైతే ధన, ప్రాణ త్యాగాలకైనా వెనుకాడమనే దృఢ సంకల్పాన్ని చాటి చెప్పే పవిత్ర చిహ్నమే ఈ ‘బక్రీద్’. – ముహమ్మద్ ముజాహిద్


