క్షమాగుణానికి నిలువెత్తు రూపం.. | The Embodiment Of Forgiveness Islam Inspiration Story | Sakshi
Sakshi News home page

క్షమాగుణానికి నిలువెత్తు రూపం..

Jun 11 2026 8:10 AM | Updated on Jun 11 2026 8:10 AM

The Embodiment Of Forgiveness Islam Inspiration Story

ఇస్లాం వెలుగు

అధికారం చేతికి రాగానే పగ తీర్చుకోవడం మానవ నైజం..

కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోవడం, అధికారం చేతికి రాగానే పగ తీర్చుకోవడం మానవ నైజం. కానీ, ఎన్ని అపనిందలు ఎదురైనా అల్లాహ్‌ పై నమ్మకం కోల్పోకుండా, తప్పు చేసిన వారు కళ్లముందు నిలబడినా కక్ష సాధించకుండా క్షమించిన మహోన్నత చరిత్ర ప్రవక్త యూసుఫ్‌ (అలైహిస్సలాం)ది. ముళ్లబాటలను అధిగమించి, ఈజిప్ట్‌ దేశాన్ని కరవు బారి నుంచి రక్షించిన ఒక అద్భుత ప్రజా నాయకుడి జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం.

యూసుఫ్‌ (అ) చిన్నతనం నుంచే ఎంతో అందమైనవాడు, అమాయకుడు. ఒకరోజు ఆయన కు ఒక వింత కల వచ్చింది. 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు తన ముందు వంగి నమస్కరిస్తున్నట్లు కల కన్నారు. ఈ విషయాన్ని తన తండ్రి యాఖూబ్‌ (అ) కు చెప్పగా.. ఆయన ఆ కలలోని దైవ సందేశాన్ని గ్రహించారు. ‘నాయనా! ఈ విషయాన్ని నీ సోదరులకు చెప్పకు, వారు అసూయపడతారు’ అని హెచ్చరించారు. కానీ, తండ్రికి యూసుఫ్‌పై ఉన్న మితిమీరిన ప్రేమే అన్నదమ్ముల మధ్య అసూయకు కారణమైంది.

బావి నుంచి బానిసగా..
అసూయతో రగిలిపోయిన సోదరులు యూసుఫ్‌ను అంతమొందించాలని పథకం వేశారు. ‘ఆడుకోవడానికి తీసుకెళ్తాం’ అని తండ్రిని ఒప్పించి, అడవిలోని ఒక పాడుబడ్డ బావిలోకి యూసుఫ్‌ను తోసేశారు. ఆయన బట్టలకు గొర్రె రక్తం పూసి, ‘తోడేలు తినేసింది’ అని తండ్రిని నమ్మించారు. ఆ కన్నతండ్రి ‘ఇది దైవ పరీక్ష, నేను ఓపిక పడతాను’ అని సహనం వహించారు. మరోవైపు, ఆ బావి మీదుగా వెళ్తున్న వర్తకులు యూసుఫ్‌ను రక్షించి, ఈజిప్ట్‌సంతలో ఒక అధికారికి బానిసగా అమ్మేశారు.

జైలు జీవితం.. కలలోని సత్యం
అక్కడ అపనిందలు, ఆరోపణలు ఎదురైనా యూసుఫ్‌ తన శీలాన్ని, దైవభీతిని కాపాడుకున్నారు. ఫలితంగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలులోనే ఆయనకు అల్లాహ్‌ ‘కలల అర్థాలను వివరించే’ అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించాడు.

సరిగ్గా అదే సమయంలో ఈజిప్ట్‌ రాజుకు ఒక వింత కల వచ్చింది. 7 బలిసిన ఆవులను, 7 బక్కచిక్కిన ఆవులు మింగేయడం.. అలాగే 7 పచ్చటి పనసలు, 7 ఎండిన పనసలు కనిపించడం రాజును కలవరపెట్టింది. దేశంలోని పండితులెవరూ ఆ కలకు అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు జైలు నుంచి యూసుఫ్‌కు పిలుపు వచ్చింది. ఆ కలకు యూసుఫ్‌ చెప్పిన పరిష్కారం ఇది: ‘రాబోయే 7 ఏళ్లు ఈజిప్ట్‌లో సమృద్ధిగా పంటలు పండుతాయి. ఆ తర్వాత 7 ఏళ్లు ఘోరమైన కరవు వస్తుంది. కాబట్టి తొలి ఏడేళ్ల ధాన్యాన్ని వృథా చేయకుండా ఖజానాలో దాచండి’’

యూసుఫ్‌ మేధస్సుకు ముగ్ధుడైన రాజు, ఆయనను సగౌరవంగా జైలు నుంచి విడుదల చేసి, ఖజానా అధిపతిగా నియమించాడు. బానిస గా వచ్చిన వ్యక్తి, తన మేధస్సుతో ఆ దేశ రక్షకుడి గా మారాడు! పగ కాదు.. ప్రతీకారం అంతకన్నా కాదు!

రాజు కన్న కల నిజమైంది. దేశంలో కరవు తాండవించింది. ఆహారం కోసం పొరుగు దేశాల నుంచి జనం ఈజిప్టుకు రావడం ్రపారంభించారు. ఆ గుంపులో యూసుఫ్‌ సోదరులు కూడా ఉన్నారు. తమను బావిలో పడేసిన అన్నదమ్ములు తన ముందే నిలబడి యాచిస్తుంటే, యూసుఫ్‌ వారిని గుర్తుపట్టారు. కానీ పగ తీర్చుకోలేదు.

చివరకు తన నిజమైన రూపాన్ని బయటపెడుతూ.. ‘నేనే మీ తమ్ముడు యూసుఫ్‌ను. మీ తప్పులను నేను క్షమించేశాను. నాపై మీకు ఎలాంటి నిందలు లేవు‘ అంటూ వారిని కౌగిలించుకున్నారు. తండ్రి యాఖూబ్‌ (అ) ను, మొత్తం కుటుంబాన్ని ఈజిప్టుకు పిలిపించుకున్నారు. చిన్నప్పుడు కన్న కలకు నిజరూపంగా.. తల్లిదండ్రులు, సోదరులు అందరూ యూసుఫ్‌ ఉన్నత స్థానాన్ని చూసి గౌరవంతో తలవంచారు. – ముహమ్మద్‌ ముజాహిద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement