చాలామంది అలిసిపోడం, జుట్టు రాలడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కొందరిలో కీళ్ల నొప్పులు, నోటి పూతలు తరుచుగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని అస్సలు తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైకి సాధారణంగా కనిపించే ఈ లక్షణాలు ఆ వ్యాధికి సంకేతం కావొచ్చని హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి సమస్యలు ఎక్కుగా 20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళల్లోనే అధికం అని అంటున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే..
బాగా అలసిపోవడం, జుట్టురాలిపోవడం, తరుచుగా నోటిపూతలు, కీళ్ల నొప్పులు..ఒక వారానికి పైగా ఉండటం, లేదా మళ్లీ మళ్లీ అదేపనిగా ఈ సమస్యలు రావడం వంటివి జరిగితే అది లూపస్ వ్యాధికి సంకేతం కావొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే యువతులలో తరుచుగా ఈ వ్యాధి నిర్ధారణ కాకుండానే ఉండిపోతోందని అంటున్నారు. ఈ సమస్య తీవ్రమైన లక్షణాలతో మొదలవుతుందని అనుకుంటారు.
కానీ ఇది నిరంతర అలసట, కీళ్ల నొప్పులు, కారణం తెలియని జుట్టు రాలడం, నోటి పూతలు, స్వల్ప జ్వరం, ఎండ తగిలిన దద్దుర్లు వంటి వాటితో ప్రారంభమవుతుందని అన్నారు. ఇది రోజువారి చిన్నపాటి సమస్యలతో పోలి ఉండటంతో చాలామంది యువతులు ఈ సమస్యలను తేలిగ్గా కొట్టిపారేస్తుంటారని అంటున్నారు.
ఎందుకు వస్తుందంటే..
మహిళలు కెరీర్‌ని నిర్మించుకునే క్రమంలో గర్భధారణ ప్లాన్స్ వేసుకోవడం, లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి చేస్తుంటారు. అదీగాక కొందరు హర్మోన్ల మార్పులతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్లలో ఈ లూపస్ వ్యాధి మరింత సమస్యాత్మకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎక్స్ క్రోమోజోమ్‌లతో ముడిపడి ఉన్న రోగ నిరోధక సంబంధింత జన్యువుల కారణంగా పురుషుల కంటే మహిళలకు సహజంగానే బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు.
ఈ బలమైన రోగనిరోధక వ్యవస్థ తరచుగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడినప్పటికీ, కొన్నిసార్లు అది అతి చురుకుగా మారి పొరపాటున శరీరం సొంత కణజాలాలపై దాడి చేస్తుందట. దీన్నే లూపాస్ వ్యాధి అంటారట. ఇదొక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది చాలామటుకు ఒకే కారకం వల్ల అరుదుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. కానీ ఒక్కోసారి ఈ క్రింది వాటి కలయిక వల్ల మరింత వేగవంతమవుతుందంటుననారు.
జన్యుపరమైన సున్నితత్వం
హార్మోన్ల మార్పులు
సూర్యరశ్మికి గురవ్వడం(ఎండకు బహర్గతమవ్వడం)
ఇన్ఫెక్షన్లు
మానసిక లేదా శారీరక ఒత్తిడి
లక్షణాలు:
నిరంతర అలసట
కీళ్ల నొప్పి లేదా వాపు
జుట్టు రాలడం
నోటి పూతలు
స్వల్ప జ్వరం
ఎండ తగిలిన తర్వాత చర్మంపై దద్దుర్లు
కండరాల నొప్పి
మెదడు మసకబారడం
కారణం తెలియని బలహీనత
ఈ లక్షణాలు ఒత్తిడి, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత లేదా సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం వంటి వచ్చే సమస్యల్లా కనిపించడంతో చాలామంది మహిళలు తేలికగా తీసుకుంటారట. దాంతో తక్షణ వైద్య సహాయం ఆలస్యమవుతోందని చెబుతున్నారు.
లూపస్ కేవలం హార్మోన్ల వల్ల వచ్చే వ్యాధి కాదు, కానీ ఈస్ట్రోజెన్ రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచుతుంది. జన్యుపరంగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నవారిలో, ఆ అదనపు రోగనిరోధక ప్రేరణ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు
లూపస్‌ని ప్రభావితం చేసేవి..
ఋతుచక్రాలు, గర్భధారణ, ప్రసవానంతర కోలుకోవడం, గర్భనిరోధకం సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు కొంతమంది రోగులలో లూపస్ తీవ్రతను ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో లూపస్‌పై కేర్ తీసుకుంటారట వైద్యులు.
లేకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. సరైన పర్యవేక్షణ మరియు చికిత్సతో, లూపస్ ఉన్న చాలా మంది మహిళలు ఆరోగ్యకరమైన గర్భధారణను కలిగి ఉండగలరని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
సకాలంలో చికిత్స తీసుకోకపోతే..
కీళ్ళు
చర్మం
మూత్రపిండాలు
ఊపిరితిత్తులు
గుండె
నాడీ వ్యవస్థ తదితరాలను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలసట, జుట్టురాలడం, కీళ్లనొప్పులు, జ్వరం వంటివి తరుచుగా వస్తే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగానే ఈ సమస్యను గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది లేదా నివారించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మరిన్ని వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!)


