ఇవాళ నుంచే రోహిణి కార్తె ప్రారంభం..! రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే.. | Devotion: Why Does Rohini Karte Cause Such Extreme Heat | Sakshi
Sakshi News home page

Rohini Karte 2026: ఇవాళ నుంచే రోహిణి కార్తె ప్రారంభం..! రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే..

May 25 2026 10:08 AM | Updated on May 25 2026 10:28 AM

Devotion: Why Does Rohini Karte Cause Such Extreme Heat

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతను సూచించే 'రోహిణి కార్తె' (Rohini Karthi 2026) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం , గ్రహాల రాజుగా పరిగణించే సూర్య భగవానుడు మే 25వ తేదీ సోమవారం నాడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ పక్షం రోజుల పాటు ఎండలు మునుపెన్నడూ లేని విధంగా భగభగమండనున్నాయి.

'రోహిణి కార్తె వస్తే రోళ్లు పగులుతాయా?'
వేసవి కాలంలో వచ్చే ఎండలు ఒక ఎత్తు అయితే, రోహిణి కార్తెలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మరో ఎత్తు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. అందుకే మండే ఎండల తీవ్రతను తెలపడానికి పెద్దలు "రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి" అనే సామెతను వాడుకలోకి తెచ్చారు.

వ్యవసాయ పంచాంగం - ఏరువాక ప్రారంభం:

  • సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం పేరుతో కార్తెగా పిలుస్తారు. ఏడాదికి మొత్తం 27 కార్తెలు ఉంటాయి.

  • రోహిణి కార్తె ముగియగానే జూన్ 9 నుండి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది.

  • ఈ సమయంలోనే తొలకరి జల్లులు కురుస్తాయి.

  • దీనిని బేస్ చేసుకుని రైతులు తమ పొలాల్లో  'ఏరువాక' పనులను ముమ్మరం చేస్తారు.

రోహిణి కార్తెలో చేయకూడని పనులు ఇవే:

ఈ పక్షం రోజుల పాటు సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పెద్దలు కొన్ని నియమాలను సూచించారు:

శుభకార్యాలు వద్దు: రోహిణి కార్తె సమయంలో ఎలాంటి శుభకార్యాలు లేదా కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.

ఆహార నియమాలు: శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ, సాత్విక ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

ప్రయాణాలు వాయిదా: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

ఈ కాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం, శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

(చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)

Advertisement
 
Advertisement
Advertisement