వందే నేతరం | Designer Gaurang Showcases Whispers of Looms for Handloom Day | Sakshi
Sakshi News home page

వందే నేతరం

Aug 9 2023 1:44 AM | Updated on Aug 9 2023 5:26 AM

Designer Gaurang Showcases Whispers of Looms for Handloom Day - Sakshi

తరం మారింది. ఈ తరంలో మగ్గంతో పని చేసే వాళ్లలో మహిళలే ఎక్కువ. గిట్టుబాటు లెక్క చూసుకుని ఈ వృత్తిని వదిలేస్తున్నారు.మగవాళ్లు. ఇంతకాలం మగవాళ్లకు సహాయంగా పని చేసిన మహిళలు ఇప్పుడు మగ్గం ముందు కూర్చున్నారు. కండె చేతిలోకి తీసుకున్నారు. తదేకంగా పని చేస్తున్నారు. వాళ్ల దీక్ష చూస్తుంటే మాటలతో పని లేనట్లు మౌనంగా ధ్యానంలో ఉన్నట్లే ఉంటారు. వాళ్ల చేతులు మాట్లాడతాయి. మగ్గం మీద దారంతో అద్భుతాలు సృష్టిస్తాయి.కశ్మీర్‌ నుంచి కేరళ వరకు ఈ మంత్రజాలం అంతా కొత్త చేనేతరానిదే. వారికి వందనం.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా (ఆగస్టు 7వ తేదీ) సోమవారంనాడు దేశంలోని చేనేతల గొప్పదనాన్ని తెలియజేసే కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని గౌరంగ్స్‌ కిచెన్‌లో ‘విష్పర్స్‌ ఆఫ్‌ ద లూమ్‌’ పేరుతో మాస్టర్‌ టెక్స్‌టైల్‌ డిజైనర్‌ గౌరంగ్‌ షా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జామ్‌దానీ నేత ప్రత్యేకతను వివరించారు. ఈ నేత విధానాన్ని మనదేశంలో ఎన్ని ఇతర చేనేతలతో సమ్మిళితం చేయవచ్చనేది ప్రయోగపూర్వకంగా వివరిస్తూ వీడియో ప్రజెంటేషన్‌ ఇచ్చారు గౌరంగ్‌. 
 
ఈ తరం మనసు పడుతోంది! 
మహిళలు మనదేశ సంప్రదాయ చేనేత వైవిధ్యాన్ని చెరిగిపోని జ్ఞాపకంగా నిలుపుతున్నారు. కశ్మీర్‌ నుంచి ఢాకా వరకు, కోట, పైఠానీ, వెంకటగిరి, ఉప్పాడ, బనారస్, కంజీవరం, పటోలా, మహేశ్వరి, చందేరి, జాకార్డ్, బంధాని, ఇకత్‌... ఇలా ఎన్నో రకాల చేనేతలున్నాయి మనదేశంలో. కొత్తదనం ఎప్పుడూ మనిషిని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. ఆశ్చర్యం ఆకర్షణగా మారుతుంది. అలా వెస్టర్న్‌ టెక్స్‌టైల్‌ ప్రవాహంలో కొంతకాలం మన సంప్రదాయ చేనేతలు తెరమరుగయ్యాయి.

కానీ కనుమరుగు మాత్రం కాలేదు. భారతీయత లాగానే మన చేనేత కూడా తన ఉనికిని చాటుతూనే ఉంది. పడి లేచిన కెరటంలాగ ఇప్పుడు మన సంప్రదాయ చేనేత ఫ్యాషన్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. చేనేతలో ఈ తరం చేసిన ప్రయోగాలు మహిళల మనసును దోచుకుంటున్నాయి. రోజూ చీర కట్టడానికి ఇష్టపడని మహిళలు కూడా మన చేనేత చీరల కోసం వార్డ్‌రోబ్‌లో కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారు. పండుగలు, వేడుకల వంటి ప్రత్యేకమైన రోజులను చేనేత చీరలతో పరిపూర్ణం చేసుకుంటున్నారు. ఈ రంగంలో చేనేత కళాకారుల కృషి కనువిందు చేస్తోంది.  
 
వైవిధ్యాల  సమ్మేళనం! 
ఒకప్పుడు ఒక చేనేత చీరను చూడగానే అది ఇకత్‌ అనీ, చందేరి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పైఠానీ... ఇలా వెంటనే పేరు చెప్పగలిగేటట్లు ఉండేవి. తరాలు మారుతున్నా నేత విధానంలో ఏ మార్పూ లేకపోవడం వల్ల ఆదరణ తగ్గుతూ వచ్చింది. అలవాటు పడిన తరాలు తప్ప కొత్తతరం చేనేత వైపు చూడని రోజులు కూడా వచ్చేశాయి. అప్పుడు వచ్చింది కెరటంలాంటి ఓ ట్రెండ్‌. కంజీవరంలో జామ్‌దాని, బనారస్‌లో జాకార్డ్, ఉప్పాడలో జామ్‌దాని... ఇలాంటి ప్రయోగాలతో ఈ తరం చేనేత చీర ఒక పజిల్‌లా ఉంది. దేశంలో ఉన్న నాలుగైదు రకాల వైవిధ్యతలకు ప్రతీకగా మారింది.  

మనం పరిరక్షించుకోవాల్సింది చేనేతను, చేనేతకారులను కూడా. సంప్రదాయ చేనేతకారుల కుటుంబాల నుంచి మహిళలు ఆ బాధ్యతను తలకెత్తుకున్నారు. వారికి సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించగలరని నిరూపిస్తున్నారు. ఈ రంగం మీద సంప్రదాయ చేనేత కుటుంబాల నుంచి మాత్రమే కాకుండా ఆసక్తి కొద్దీ ఇతరులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తన ప్రయోగాలకు సంప్రదాయ కుటుంబాలు శ్రద్ధ చూపించనప్పుడు వ్యవసాయరంగంలో పనులు చేసుకునే మహిళలకు శిక్షణ ఇచ్చి కొత్త చేనేతకారులను తయారు చేశానని చెప్పారు గౌరంగ్‌. మన వస్త్రాలు దేహాన్ని కప్పుకోవడానికి మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా భారతీయతను చాటి చెప్తాయి. మన కళాకారుల సృజనను, మేధను ప్రతిబింబిస్తాయి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

కళాత్మకతను కాపాడుకోవాలి! 
చేనేతలో వైవిధ్యభరితంగా ఒక చీర తయారు కావాలంటే నెలలు పడుతుంది, ఏళ్లు కూడా పడుతుంది. ఒక అంగుళంలో ఎనభై దారాలతో నేస్తే పట్టే సమయం ఒకలా ఉంటుంది. అంగుళంలో నాలుగు వందల దారాలతో నేస్తే పట్టే సమయం వేరు. నాలుగు వందల కౌంట్‌ దారం కంటికి కనిపించనంత సన్నగా ఉంటుంది. డిజైన్‌ను బట్టి చీర తయారయ్యే సమయం కూడా పెరుగుతూ ఉంటుంది. రెండు దారాలు తప్పుగా పడినా సరే పువ్వు ఆకారం మారిపోతుంది.

ఒక వరుస నేయడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది. అలా ఎన్ని వందల వరుసలు నేస్తే ఆరు మీటర్ల వస్త్రం తయారవుతుందో ఊహించుకోవాల్సిందే. మహిళలు ఉదయం ఇంటి పనులు చక్కబెట్టుకుని పన్నెండు– పన్నెండున్నర సమయంలో మగ్గం మీదకు వస్తే సాయంత్రం ఆరు గంటల వరకు తదేకంగా దీక్షతో పని చేస్తారు. ఇంత అద్భుతమైన కళను ముందు తరాలకు అందేలా కొనసాగించాలి.

ఒక హెరిటేజ్‌ కన్‌స్ట్రక్షన్‌ను పరిరక్షించుకున్నట్లే ఈ సంప్రదాయ కళలను కూడా కాపాడుకోవాలి. ఈ ఏడాది హాండ్‌లూమ్‌ డే కోసం... చేనేత ప్రయోగాలతోపాటు కలంకారీ, పటచిత్ర, చేర్యాల పెయింటింగ్‌లు, ఎంబ్రాయిడరీల్లో చికన్‌కారీ, కచ్‌వర్క్, ఆరే వర్క్, కసౌటీ, కశ్మీరీవర్క్‌లను కూడా చేనేతకు జోడించి ఓ ప్రయోగం చేశాను.  – గౌరంగ్‌ షా, మాస్టర్‌ టెక్స్‌టైల్‌ డిజైనర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement