జేఈఈలో రెండుసార్లు ఫెయిల్‌, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్‌..! చివరికి.. | Delhi Techie faced 500 rejections before Google said yes. And thats just | Sakshi
Sakshi News home page

జేఈఈలో రెండుసార్లు ఫెయిల్‌, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్‌..! చివరికి..

May 11 2026 4:22 PM | Updated on May 11 2026 5:14 PM

Delhi Techie faced 500 rejections before Google said yes. And thats just

జీవితమంతా వైఫల్యాలు అడగడుగున పలికరిస్తూనే ఉన్నా వదలిపెట్టని ధీరుడి కథ. అదేంటి అన్ని పెయిల్యూర్స్‌ ఎదుర్కొటే ధీరుడు, శూరుడు అంటారేంటి అనుకోకండి. ఎందుకంటే గెలిస్తే వాట్‌ నెక్స్ట్‌ అంటూ సాగిపోతావు..అదే ఆపకుండా ఓటమి హగ్‌ ఇస్తూ ఉంటే..పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాలంటే అజేయమైన ఓర్పు, ఆత్మ విశ్వాసం కావాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు జాలిచూపులతో సానుభూతి చూపితే, మరికొందరు నీ వల్ల కాదు అన్న విమర్శల బాణాలు.. అయినా సరే డోంట్‌ కేర్‌ అంటూ ముందుకు సాగాలంటే ఆకాశమంత ధైర్యం కావలి. అందుకు ఉదాహరణ ఈ టెకీ. అతడి కథ వింటే..ఫెయిల్యూర్‌లు, రిజెక్ట్‌లు చూసినోళ్లే గొప్పోళ్లు అని కచ్చితంగా అంటారు. మరి అతడి కథేంటో చకచక చదివేద్దామా..!.

చాలామంది విద్యార్థులకు పోటీ పరీక్షలు ప్రారంభ విద్యా మైలురాళ్లలా విజయానికి అంతిమ కొలమానంగా ఉంటే..హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన రిజుల్ సింగ్ మాలిక్‌ విషయంలో మాత్రం అలా కాదు. ఎడతెగని ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో అందుకున్న గొప్ప గెలుపు రికార్డు అతడిది. అతడు పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. రిజుల్ తన పాఠశాల విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వసంత్ కుంజ్‌లో పూర్తి చేశాడు.

ఆ తర్వాత అందరిలానే ఇంటర్‌ పూర్తి అయిన తర్వాత ఐఐటీ జేఈఈకి ప్రిపేరయ్యాడు. మొదటిసారి ఓటమి ఎదుర్కొనడంతో మరోసారి ప్రయత్నించాడు. ఈ సారి హోమ్‌ ట్యూటర్‌, ఒక ఏడాది వృధా చేసుకుని లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని మరి ప్రిపేరయ్యాడు. అయినప్పటికీ ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు. కానీ ఇంతలా ప్రిపేరైనా..కనీసం కటాఫ్‌ మార్కులు కూడా సాధించలేకపోయాడు రిజుల్‌. 

పైగా ఒక ఏడాది వృధా చేసుకోవడం బంధువులు, మిత్రులు అంతా ఒకటే విమర్శించడం ప్రారంభించారు. పాపం రిజుల్‌ ఆ అవమానం తట్టుకోవడం సాధ్యం కాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు కూడా. అయితే 18 ఏళ్ల వయసులో రాసే ప్రవేశ పరీక్ష కెరీర్‌లో రాబోయే 40 ఏళ్లను నిర్దేశించదని గ్రహించి బీటెక్‌ ఐటీ చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. అయినప్పటికీ ఆ జేఈఈ ఫెయిల్యూర్‌ తలుచుకున్నప్పుడల్లా అతడిని బాగా మెలిపెడుతుండేది. 

ప్రతీదాంట్లో.. రెండు మూడు సార్లు వైఫల్యమే
అయితే 2019లో జరిగిన బర్కిలీ సమ్మర్ స్కూల్ అతని జీవితంలో ఒక ప్రధాన మలుపు. అక్కడ అతనికి డేటా సైన్స్‌తో మొదటిసారిగా గట్టి పరిచయం ఏర్పడింది. అలా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ (UC Irvine లేదా UCI)అమెరికాలో అకడమిక్ ప్రొబేషన్) ప్రవేశం పొందడం అతడి లక్ష్యంగా మారింది. అందుకోసం జీఆర్‌ఈఈకి సన్నద్ధమయ్యాడు. 

అయితే అది కూడా రిజుల్‌కు చుక్కలు చూపించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఆ పరీక్షనురాశాడు. మొదటి ప్రయత్నంలో 303, రెండవ ప్రయత్నంలో 305, మూడవ ప్రయత్నంలో 307 దాటి, చివరకు నాల్గవ ప్రయత్నంలో 308 స్కోర్ చేశాడు. అన్నిసార్లు రాయడంతో మరోసారి జీఆర్‌ఈకి రెడీ అవుతున్నా అని చెప్పాలంటే భయపడేవాడు. 

అయితే అనుకోకుండా యూసీ ఇర్విన్ నుండి అంగీకారం రావడంతో ఇది నిజమేనా అని నమ్మలేకపోయాడు. అయితే అక్కడి అధికారి స్కోరు నిజమైన విజయం కాదని, నువ్వు పట్టువదలకుండా రాయడమే అసలైన గెలుపు అని బదులిచ్చాడు. పాపం యూసీ ఇర్విన్‌లోని ఎంఎస్ ప్రోగ్రామ్ నుంచి కూడా మళ్లీ సవాళ్లు మొదలయ్యాయి. సరిగ్గా అమ్మ పుట్టిన రోజు అని భారత్‌కు వస్తే..తన GPA (Grade Point Average) అకడమిక్‌ ప్రతిభ 2.8కి పడిపోవడంతో, ఆ అకడమిక్ ప్రొబేషన్‌లో ఉంచేశామని, మెరుగుపడకపోతే తదుపరి చర్యలు ఎదుర్కొనక తప్పదని మెయిల్‌ వచ్చింది. 

దాంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఉత్సాహం కాస్తా ఉసురుమంది గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా అటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. పైగా అందరు ఉత్తీర్ణులయ్యారు, తానొక్కడినే పరాజితుడిగా ఉండిపోయానంటూ నాటి సంఘటనను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అదీగాక అమెరికాలో జాతివివక్ష వంటి పలు సవాళ్లు కూడా తోడవ్వడంతో తనపై ఒత్తిడి ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు. చివరికి తన జీపీఏను  మెరుగుపరుచుకుని విజయవంతంగా తన అకడమిక్‌ని పూర్తి చేశాడు. 

ఇక తక్షణమే ఉద్యోగ వేట అందరి కంటే ముందు మొదలు పెట్టాను గానీ, ప్రతిది రిజెక్ట్‌ అయ్యేదని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడగా చివరికి ఓ ఇంటర్న్‌షిప్‌కి అర్హత లబించినట్లు తెలిపాడు. అలా ఈవై, వాల్‌మార్కట్‌ కంపెనీల్లో పనిచేశాడు. అక్కడ పనిసంస్కృతి గొప్ప పాఠాలే నేర్పాయి. తన సహోద్యోగులు, మేనేజర్‌ నుంచి చాలా తక్కవుమద్దతే లభించేదని పేర్కొన్నాడు. ఒక సందర్భంలో, తాను సహాయం కోసం ఒక సీనియర్‌ను సంప్రదించగా, ఆ విషయాన్ని తన మేనేజర్ వరకు తీసుకెళ్లి చివాట్లు, నిందలు పడేలా చేశాడంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. 

గూగుల్‌లో జాబ్‌ కొట్టడం కోసం..
ఆ అనుభవం భవిష్యత్ కార్యాలయాల పట్ల ఎలా ఉంటే బెస్ట్‌ అనేది తెలుసుకోగలిగానని న్నారు. దాంతో మంచి పనిసంస్కృతి ఉండే ఉద్యోగ కోసం అన్వేషించే పనిలో పడ్డట్లు తెలిపాడు. ఆ క్రమంలోనే గూగుల్‌లో జాబ్‌ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడట అందుకోసం ఏ పదో, 20 కాదు ఏకంగా 520 సార్లకు పైగా తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తనని ప్రోత్సహించింది మాత్రం తన కాబోయే ప్రియురాలు, తల్లిదండ్రులేని అంటున్నాడు. వాళ్లిచ్చిన అండదండలతో వెనక్కి తగ్గకుండా గుగుల్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లు వివరించాడు. అలా ఓ రోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో, తన వాల్‌మార్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా ఆఫర్ లెటర్ పంపబడుతోందని ఫోన్ కాల్‌ వచ్చిందని చెప్పుకొచ్చాడు. 

దాంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. గూగుల్‌లో జాబ్‌ రాగానే తన కాబోయే భార్య ఖుషీకే ఫోన్‌ చేశానని, ఆ తర్వాత అమ్మనాన్నలకు చేసినట్లు తెలిపాడు. ఎందుకంటే అన్ని రిజెక్షన్‌లు రావడంతో నాకే ఎందుకు జరుగుతోందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే రిజుల్‌ ప్రియురాలు ఏంకాదు, కచ్చితంగా గెలుస్తావ్‌, ఆఫర్‌ లెటర్‌ అందుకుంటావ్‌ అంటూ ధైర్యం చెబుతూనే ఉండేది, ఒక్కసారి కూడా పోనీలే వదిలేయ్‌ అన్న మాట తన నోటినుంచి రాలేదంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. 

ఇతడి కథ చూస్తుంటే హాలీవుడ్‌ మూవీలోని ఒక కొటేషన్‌ గుర్తొస్తోంది. జీవితం అంటే "ఎంత బలంగా కొట్టావన్నది కాదు, ఎన్ని ఎదురదెబ్బలు తగలినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడమే" అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనం కదూ. ఎన్ని వైఫల్యాలు రానీ పట్టుదలతో సాగేవాడి ఎదురేలేదు, పైగా ఏదో ఒకనాటికి విజయం తథ్యం అనేది జగమెరిగిన సత్యం. 

 

(చదవండి: కోటి రూపాయలు శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!)
 

Advertisement
 
Advertisement
Advertisement