
‘‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే’’ అన్నది రోబో సినిమాలో ఓ పాట. అదే పాట పదాలను కాస్త మారిస్తే ‘నర రూప రోబో’ ఒకటి పాడే పాటల్లో పదాలిలా ఉండొచ్చు... అవి... ‘‘ఐ యామ్ ఏ సూపర్ గాళ్. ‘కనిపెంచే’ రోబో గాళ్... కడుపున మోసే ప్రెగ్నెంట్ గాళ్!! ’’ ఈ పాటలూ, మాటలూ... అందులోని పదాల ప్రస్తావననే ఇప్పుడెందుకంటే మహిళలు తమ గర్భాన మొయ్యాల్సిన ప్రెగ్నెన్సీ బరువును ఇకపై రోబోలే కడుపున మోసే రోజులు త్వరలో రానున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా చైనా ఒక రోబోను రూపొందించింది. అవును... ఇనుములో హృదయానికి బదులు ఇప్పుడో గర్భసంచి నిజంగానే రూపొందింది. వచ్చే ఏడాదికి అందులో బిడ్డ ప్రసవమూ జరగనుందంటోంది చైనా. ఆ వివరాలేమిటో చూద్దాం.
గ్వాంగ్‌ఝూ నగరంలోని కైవా టెక్నాలజీస్ సంస్థ ఓ హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది. ఆ రోబో ప్రత్యేకత ఏమిటంటే... దాని కడుపున బిడ్డను మోసేలా ఓ కృత్రిమ గర్భసంచిని ఏర్పాటు చేశారు అక్కడి శాస్త్రవేత్తలు. ఇప్పుడీ ‘ఆర్టిఫిషియల్ ఊంబ్’ అమరి ఉన్న ఆ రోబో వచ్చే ఏడాదికి మార్కెట్లోకి రానుందని చెబుతున్నారు ‘కైవా టెక్నాలజీస్’ సంస్థ వ్యవస్థాపకుడు ఝాంగ్ క్వి ఫెంగ్. ఆయన చెబుతున్న ప్రకారం ఆ రోబో ధర దాదాపు లక్ష యువాన్ల కంటే తక్కువే. డాలర్లలో చె΄్పాలంటే 13,900 డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో అటు ఇటుగా దాదాపు రూ. 12 లక్షలు!
అదెలాగంటే...
ఇదెలా సాధ్యమని అనుకోడానికి ఇప్పుడు వీల్లేదు. మనకు అర్థమయ్యే భాషలో చె΄్పాలంటే... ఇక్కడ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలను కృత్రిమ గర్భంలాంటి ఇంక్యుబేటర్‌లో పెట్టి సాకినట్టే... ఆ రోబోకు ఓ కృత్రిమ ఇంక్యుబేటర్ అమరి ఉంటుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందే ఆ ఇంక్యుబేటర్... బిడ్డ పెరుగుదలను బట్టి సమకూర్చాల్సిన సౌకర్యాలూ, అందించాల్సినపోషకాలూ ఇవన్నీ అందిస్తుంది.
అంతేకాదు... స్వాభావికంగా రూపొందించిన పిండాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఉమ్మనీటిలో (ఆమ్నియాటిక్ ఫ్లుయిడ్‌లో) ఉంచుతూ, ఓ పైపు ద్వారా కృత్రిమపోషకాలతో పెంచుతూ... నెలలు నిండి బిడ్డ పూర్తి రూపం సంతరించుకోవడం (జెస్టేషన్) పూర్తయ్యాక ప్రసవం పూర్తి చేసి ఆ గడుసుపిండాన్ని మానవ మాతృమూర్తి చేతుల్లో పెడుతుందా రోబో గట్టి‘పిండం’. అలా తన గర్భాన పెంచి తన కడుపు పంటను మానవ మహిళ చేతుల్లో ఉంచుతుందా ‘యంత్రమాత’!!
ఈ విధంగా సరోగసీలో అమ్మల అవసరాల్ని తీర్చడమే కాదు... కడుపున బిడ్డ భారం మోయలేని అమ్మలకూ ఓ వరప్రసాదంలా మారనుందంటున్నారు ఝాంగ్ క్విఫెంగ్. ఈ కాన్సెప్టును ఈ ఏడాది బీజింగ్‌లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌లోనే వెల్లడించారాయన.
‘‘ఈ రోబో కేవలం ఓ లైఫ్‌సైజ్ ఇంక్యుబేటర్ మాత్రమే కాదు. ఇది కేవలం హ్యూమనాయిడ్ రోబో మాత్రమే కాదు... కడుపున పెంచడం మొదలుకొని, కనేవరకూ... యంత్రగర్భంలోంచి ప్రసవం వరకు కడుపున పెరిగే సమయంలో ఏయే కార్యకలా పాలు జరుగుతాయో వాటన్నింటినీ నెరవేరుస్తూ చిన్నారి బిడ్డను పెంచే ఓ యాంత్రిక మమకారాల ‘గర్భ’కోశం’’ అంటూ వివరించారు ఝాంగ్ క్విఫెంగ్. ఇలా ఆయన తన కాన్సెప్టును వివరించారో లేదో ఈ తరహా రోబోల గర్భధారణల తాలూకు నైతిక అంశాలపై ప్రస్తుతం అక్కడ తీవ్ర చర్చ మొదలయ్యింది.
అయితే ప్రస్తుతానికి జవాబు దొరకాల్సిన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే... పిండాన్ని పెంచే కృత్రిమ గర్భమైతే రూపొందింది గానీ, వీర్యకణం, అండం తాలూకు ఫలదీకరణమంతా ఈ కృత్రిమ గర్భంలో జరుగుతుందా లేక టెస్ట్‌ట్యూబ్ బేబీలోలా బయట ఫలదీకరణ జరి పాక అందులో ప్రవేశపెడతారా, ప్రసవం తాలూకు తీరుతెన్నులేమిటి, ఈ తరహా గర్భం తాలూకు చట్టబద్ధత, నైతికత లాంటి అనేక అంశాలపై హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. – యాసీన్
అటు అమెరికాలోనూ...
చైనాలోని గర్భవతులైన యాంత్రిక రోబోల తీరుతెన్నులిలా ఉంటే... ప్రపంచపు మరో పక్కన అమెరికాలోని న్యూయార్క్ సిటీ మిడ్‌టౌన్‌లో ‘కాయిడ్ (కే ఓ ఐ డీ)’ అనే బ్రాండెడ్ రోబో వీధుల్లో తిరుగుతూ బర్గర్లూ, హ్యాంబర్గర్లు కొంటూ యంత్రమానవుల్లా సంచరిస్తోంది. దాన్ని చూస్తూ, నవ్వుతూ, భయపడుతూ, ఫొటోలూ తీసుకుంటున్న కొందరు రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. ‘‘దేవుడు చెప్పినట్టుగా సాతాన్ స్వైరవిహారాలు చేసే కాలం వచ్చేసిందనీ’’, ‘‘మొదటి లైట్ బల్బ్‌నూ, మొదటి కారునూ నేను చూళ్లేదు గానీ... మొట్టమొదటి మానవ రోబోను చూస్తున్న అనుభూతిని నాకు సొంతం చేసిందీ కాయిడ్’’ అంటూ పలుపలు విధాల కామెంట్స్ వినవస్తున్నాయి.
దీనికి భిన్నంగా పాజిటివ్ కామెంట్సూ వినవస్తున్నాయి. అవేమిటంటే... ‘‘ఇదో అద్భుతం’’ అని కొందరూ; ‘‘కుక్కల బొచ్చు వల్ల అలర్జీలతో బాధపడేవారికి ఇవి వాచ్‌డాగ్స్‌లా, అసిస్టెంట్లుగా పనిచేస్తాయి’’ అంటూ ఇంకొందరూ, ‘‘మా ఇంట్లో పనిమనిషిలా వాడుకుంటా’’ అంటూ మరికొందరు మరో వైపున మరో తరహా కామెంట్లూ స్వైరవిహారం చేస్తున్నాయి. అన్నట్టు ఈ కాయిడ్ రోబో కూడా ‘యూనీ ట్రీ’ అనే చైనీస్ రోబోటిక్ సంస్థ రూపొందించగా లాంగ్ ఐలాండ్ బేస్‌డ్ రోబో స్టోర్ అనే స్టాన్‌ఫార్డ్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇది రూపొందిందంటున్నారు అక్కడి నిపుణులు.