
డిజిటల్ వరల్డ్
‘ఆ హీరోయిన్‌డేట్లు దొరకడం చాలా కష్టం’
‘ఆ హీరోయిన్ ఎక్కువ టేకులు తీసుకుంటుంది’
‘బాగానే నటిస్తుంది గానీ టైమ్‌కు లొకేషన్‌కు రాదు.
నిర్మాతలను ఏడిపిస్తుంది’... ఇలాంటి మాటలు
టిల్లీ నార్వుడ్ విషయంలో వర్తించవు. టిల్లీ నార్వుడ్ హాలీవుడ్‌లో తొలి ఏఐ జనరేటెడ్ నటిగా చరిత్ర సృష్టించనుంది...
లండన్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ పార్టికల్ 6’ డిజిటల్ స్టార్ టిల్లీ నార్వుడ్‌ను సృష్టించింది. తమ డిజిటల్ స్టార్‌ను జ్యూరిచ్ సదస్సులో పరిచయం చేశారు. ఆమె నటనైపుణ్యాన్ని పరిచయం చేసే డెమో వీడియోలు రూ పొందించారు. ఈ అందాల సుందరిని తెరంగేట్రం చేయించడానికి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్, ఏజెంట్లతో చర్చలు మొదలయ్యాయి.
చర్చలు ఫలప్రదం అయితే ఫస్ట్ ఏఐ–జనరేటెడ్ స్టార్‌గా టిల్లీ నార్వుడ్ చరిత్ర సృష్టించనుంది. ‘భవిష్యత్‌లో టెలివిజన్ అభివృద్ధి’ అనే అంశంపై తీసిన ‘ఏఐ కమిషనర్’ అనే కామెడీ స్కెచ్‌లో తొలిసారిగా కనిపించింది టిల్లీ. ‘నా మొట్టమొదటి పాత్ర ప్రత్యక్షప్రసారం అయింది. నిజంగా ఇది నమ్మలేక పోతున్నాను!’ అని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది టిల్లీ నార్వుడ్.
ఈ ఏఐ స్టార్ గురించి ‘ఆహా’ అనేవాళ్లతో పాటు ‘అయ్యయ్యో’ అంటున్నవాళ్లు కూడా ఉన్నారు. నిర్మాణసంస్థల ఆసక్తి విషయం ఎలా ఉన్నా హాలీవుడ్ తారలు మాత్రం ఏఐ స్టార్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇన్ ది హైట్స్’ స్టార్ మెలిసా బరెరా ‘ఎంత దారుణం ఇది’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిరసన తెలి పారు. ‘ఆమెకు అందమైన రూపం తీసుకురావడానికి ఎంతోమంది నిజజీవిత అందగత్తెల ముఖాలను రెఫరెన్స్‌గా తీసుకొని ఉంటారు. ఇంత శ్రమ ఎందుకు? ఆ సహజ అందాల సుందరులనే హాలీవుడ్‌కు పరిచయం చేయవచ్చు కదా!’ అని హలీవుడ్ నటుడు ఒకరు స్పందించారు.
ఘాటైన విమర్శల నేపథ్యంలో ‘ పార్టికల్6’ వ్యవస్థాపకురాలు, సీయీవో ఎలిన్ వాన్ ఇలా స్పందించారు... ‘మా ఏఐ క్యారెక్టర్ టిల్లీ నార్వుడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారికి చెప్పేదేమిటంటే.., నిజమైన నటులకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఎన్నో సృజనాత్మక అంశాలలో ఇది కూడా ఒకటి. సృజనాత్మక శక్తిని తెలియజేసేది. యానిమేషన్, తోలుబొమ్మలాట, సిజీఐ వలన తెరపై కొత్తదనం వచ్చిందే తప్ప నటులు కనిపించకుండా పోలేదు. ఇప్పుడు కూడా అంతే. సరికొత్త ఏఐ క్యారెక్టర్ వలన కొత్త ఆలోచనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆ క్యారెక్టర్‌లకు తగినట్లు కొత్తకథలు తయారవుతాయి. నేను స్వతహాగా నటిని, ఏఐ క్యారెక్టర్ మనిషి సహజ నటనైపుణ్యాన్ని దూరం చేయదు’.
నిజానికి సినీరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ను ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఉదా: నటుల వయసు తగ్గించడానికి, దివంగత నటుల గొంతును తిరిగి తీసుకురావడానికి, సినిమా ట్రైలర్‌లు ఆకట్టుకునేలా రూ పొందించడానికి... మొదలైనవి. అయితే ఏఐ నటి మెయిన్ స్ట్రీమ్‌లోకి రావడం అనేది టిల్లీ నార్వుడ్‌తోనే మొదలు కానుంది.
హాలీవుడ్ టు టాలీవుడ్... తప్పదేమో!
అక్కడెక్కడో ఆవిష్కృతమైన సాంకేతిక అద్భుతం గురించి తెలుసుకొని ‘ఆహా వోహో’ అనుకునేలోపే ఆ సాంకేతికత మనల్ని కూడా పలకరించి లోకలైజ్ అయి పోతుంది. ‘గుండమ్మ కథ రీమేక్ చేస్తే బానే ఉంటుందిగానీ గుండమ్మ పాత్రను అంత అద్భుతంగా ఎవరు చేయగలరండి!’
‘సావిత్రి లాంటి మహానటి నటనను మళ్లీ చూడలేమా?’... ఇలాంటి మాటలు సినీప్రియుల నోటి నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ‘ పార్టికల్6’ టాలీవుడ్‌కు చేరువ అయితే... ‘ఆ లోటును ఎవరు భర్తీ చేయగలరు’ అనే మాట వినిపించక పోవచ్చు. ఎందుకంటే ‘ పార్టికల్6’ ఏఐ అవతార్‌తో వారినే స్వయంగా నటింపజేయవచ్చు!