
బ్లడ్ మూన్ హైదరాబాద్ ఆకాశాన్ని మాత్రమే కాదు, సోషల్ మీడియా వేదికలను కూడా ఆక్రమించింది. శాస్త్రీయ నిజాలు, మూఢనమ్మకాలు, యువత ట్రెండ్.. అన్నీ కలిపి నగరాన్ని బ్లడ్ మూన్ ముచ్చట్లతో ముంచెత్తాయి. వచ్చే బ్లడ్ మూన్ వరకూ హైదరాబాదీలు ఈ జ్ఞాపకాన్ని ఫొటోల రూపంలో, పోస్టుల రూపంలో ఆస్వాదిస్తూ మిగిలిపోతారు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ జరిగిన చంద్ర గ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రుడు ఎర్రటి వర్ణంలో మెరిసిపోవడం వల్ల దీనిని ప్రజలు బ్లడ్ మూన్ అని పిలిచారు. సహజసిద్ధంగా ఏర్పడే ఈ ఖగోళ క్షణం హైదరాబాద్ నగరాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
గ్రహణానికి గంటల ముందే ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వేదికలు హాష్‌ట్యాగ్‌లతో సందడి చేశాయి. కొందరు గ్రహణం ఫొటోలు పంచుకుంటే, మరికొందరు ‘బ్లడ్ మూన్ అంటే ఏమిటి?’ అనే గూగుల్ సెర్చ్‌లో మునిగిపోయారు. ఒక్క రాత్రిలోనే వేల పోస్టులు, వీడియోలు షేర్ కావడం గమనార్హం. ముఖ్యంగా యువత ఈ గ్రహణాన్ని ఫొటోషూట్‌లుగా మార్చుకుని #సెలనోఫైల్ #బ్లడ్ మూన్ వంటి హాష్‌ట్యాగ్‌లతో క్రియేటివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేశారు.
సైన్స్ వర్సెస్ మూఢనమ్మకాలు..
ఒకవైపు శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు ఈ ఘటనకు వెనుక ఉన్న ఖగోళ శా్రస్తాన్ని వివరించగా, మరోవైపు సోషల్ మీడియాలో మూఢనమ్మకాలు విపరీతంగా చెక్కర్లు కొట్టాయి. ‘గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదు’, ‘ఆహారం తినకూడదు’ వంటి అపోహలను కొందరు జోరుగా ప్రచారం చేశారు.
అయితే హైదరాబాద్‌లోని బీఎం బిర్లా ప్లానిటోరియం నిపుణులు, సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైన్స్ రీసెర్చ్, ఐఐటీఎస్ శాస్త్రవేత్తలు ఈ గ్రహణం సహజ ఖగోళ సంఘటన అని, దీనికీ మన ఆరోగ్యం లేదా దైనందిన జీవితానికీ ఎటువంటి సంబంధం, ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ‘బ్లడ్ మూన్ కేవలం విజువల్ ఎఫెక్ట్ మాత్రమే. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రకృతి అందించే అద్భుత క్షణం’ అని వివరించారు.
బ్లడ్ మూన్ అంటే?
సాధారణంగా చంద్రుడు భూమి నీడలోకి వెళ్లినప్పుడు చంద్ర గ్రహణం జరుగుతుంది. కానీ ఈ సమయంలో సూర్యకిరణాలు భూమి వాతావరణాన్ని దాటి చంద్రుని చేరుకున్నప్పుడు, నీలి కాంతి ఫిల్టర్ అవుతుంది, ఎర్రటి కాంతి మాత్రమే చంద్రుడిపై ప్రతిబింబిస్తుంది. అందుకే చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు. దీనినే ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు.
గతం–భవిష్యత్తు బ్లడ్ మూన్‌లు..
చరిత్ర చెబుతున్నట్లు.. గతంలో హైదరాబాద్‌లో 2018 జూలై 27న ఒక విశేషమైన బ్లడ్ మూన్ కనిపించింది. అది 21వ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘమైన చంద్ర గ్రహణంగా రికార్డయ్యింది. 2022లో కూడా కనిపించిన ఈ బ్లడ్ మూన్ ఈ ఏడాది మార్చిలోనూ కనువిందు చేసింది. 2026లో మరో బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది. ఈ విధంగా తరచూ కాకపోయినా, కొన్ని ఏళ్లకోసారి మాత్రమే ఈ అపూర్వ క్షణాలు మన కళ్లముందు మెరుస్తాయి.
హైదరాబాద్ ప్రత్యేకత..
హైదరాబాద్ ఆకాశం నుండి చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించడం ఈ సారి ప్రత్యేకత. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో, గోల్కొండ కోట ప్రాంగణంలో, షామీర్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో చాలా మంది ఫొటోగ్రాఫర్లు, సెలనోఫైల్స్ టెలిస్కోపులతో గ్రహణాన్ని ఆస్వాదించారు. టెర్రస్ పార్టీల రూపంలో కూడా బ్లడ్ మూన్ నైట్ జరుపుకున్నవారు ఉన్నారు. చంద్రుడి అందాన్ని ఆస్వాదించే వారికి ‘సెలనోఫైల్స్’ అని పేరు. ఈ తరం యువతలో ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఇది ‘అంతరిక్షంతో కనెక్ట్ అవుతున్నామనే ఫీలింగ్ ఇస్తుంది’ అని పలువురు యువత భావించారు.
(చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!)