వరుణుడు కోసం అగ్నిబాణాలు | Bun Bang Fai, A Rocket Festival In Laos And Thailand | Sakshi
Sakshi News home page

వరుణుడు కోసం అగ్నిబాణాలు

May 10 2026 4:56 PM | Updated on May 10 2026 4:55 PM

Bun Bang Fai, A Rocket Festival In Laos And Thailand

వానలు సమృద్ధిగా కురవాలి; పంటలు పుష్కలంగా పండాలి. ఇంటికి సిరిసంపదలు తేవాలి– ప్రతి దేశంలోనూ రైతులందరి ఆశ ఇది. ఇదే ఆకాంక్షతో థాయ్‌లాండ్, లావోస్‌ ప్రజలు ప్రతి ఏటా ‘బున్‌ బాంగ్‌ ఫై’ అనే రాకెట్‌ ఫెస్టివల్‌ను అత్యంత ఉత్సాహభరితంగా, అంగరంగ వైభవోపేతంగా జరుపుకొంటారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుత వేడుక యసోథోన్‌ ప్రావిన్స్‌లో మే 8న ప్రారంభమై మే 10తో ముగుస్తుంది.

తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. లావోస్‌ వానదేవుడైన ‘పయా థేన్‌’ ఒక నాగ సర్పం కారణంగా ఆగ్రహించడంతో వర్షాలు కురవక కరవు వాటిల్లింది. దీంతో ప్రజలు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వెదురుతో తయారు చేసిన భారీ రాకెట్లను ఆకాశంలోకి ఎగురవేశారట! ఈ పురాణం ఆధారంగా వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెదురు రాకెట్లను ఎగురవేసే సంప్రదాయం మొదలైంది. వీరు ఎగురవేసే రాకెట్లు నేరుగా స్వర్గానికి చేరుకుని, ప్రజల అవసరాలను వానదేవుడికి విన్నవిస్తాయని, ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. 

థాయ్‌లాండ్‌ ఈశాన్య ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. కాబట్టి వారికి వర్షాలు చాలా కీలకం. రుతుపవనాలు సకాలంలో రావడం వారికి చాలా ముఖ్యం. ఈ ప్రకృతి పండుగను థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రాంతాలైన యసోథోన్, రోయి ఎట్, కలసిన్, ఉడాన్‌ థాని, నోంగ్‌ ఖై, మహా సారఖామ్, సిసాకెట్, నోంగ్‌ బువా లాంఫు, లోయి, అమ్నాత్‌ చారోయెన్‌ ప్రావిన్స్‌లతో పాటు ఉత్తర ప్రాంతంలోని కొన్ని ప్రావిన్స్‌లలో విస్తృతంగా జరుపుకొంటారు. 

మూడు రోజుల పాటు నిర్వహించుకునే ఈ ఉత్సవం రంగురంగుల ఊరేగింపులతో, జానపద నృత్యాలతో కోలాహలంగా సాగుతుంది. సుమారు 20 నుంచి 25 కిలోల గన్‌పౌడర్‌తో నింపిన ఈ రాకెట్లను బౌద్ధ పురాణాల్లోని ‘నాగ’ అనే పౌరాణిక సర్పం బొమ్మతో అలంకరిస్తారు. రాకెట్లను ప్రయోగించే ముందు బౌద్ధ సన్యాసులు వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదిస్తారు. రాకెట్లను తయారు చేసిన బృందాలకు బహుమతులు అందజేస్తారు. అయితే, ఒకవేళ ఏదైనా రాకెట్‌ ప్రయోగం విఫలమైతే, ఆ రాకెట్‌ తయారుచేసిన వాళ్లని సరదాగా బురదలో ముంచి శిక్షిస్తారు. ఇది దేవుడికి ఆగ్రహం కలిగించిందని భావించి చేసే ఒక వినోదాత్మక ఆచారం. 

పురుషులు, స్త్రీల వేషధారణలో కనిపిస్తూ, హాస్యభరితమైన ప్రదర్శనలతో పర్యాటకులను అలరిస్తారు. వ్యవసాయ ఇతివృత్తాలతో కూడిన జానపద నృత్యాలు ఇక్కడ ప్రధానం. ముఖ్యంగా ‘లామ్‌ వాంగ్‌’ అనే నృత్యంలో పాల్గొనేవారు వృత్తాకారంలో లయబద్ధంగా నర్తిస్తారు. వేడుక సందర్భంగా బంధుమిత్రులతో కలిసి విందులు చేసుకుంటారు. 

ఈ బున్‌ బాంగ్‌ ఫై కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, ఒక అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణగానూ మారింది. టూరిజం అథారిటీ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ 1974 నుంచి ఈ వేడుకలకు అండగా నిలుస్తోంది. ఈ మూడురోజుల పండుగ కాలాన్ని ఈశాన్య ప్రాంతంలో సెలవుదినంగా గుర్తిస్తారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడానికి ముందు రైతులు జరుపుకునే ఈ వినోదభరిత ఉత్సవం ప్రకృతికి, మానవ సంకల్పానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.  
రమా జంబుల

(చదవండి:

Advertisement
 
Advertisement
Advertisement