
సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రక్షాబంధనం పండుగ తర్వాత చెప్పుకోదగినది యమ విదియ లేదా భగినీ హస్తభోజనం.. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. తమ తోబుట్టువుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటారు. కొందరు సోదరులకు పెట్టరు కానీ, సోదరులే తమ అక్కచెల్లెళ్లకు చీర, సారె పెడతారు. ఈ సంప్రదాయం మొదలవడానికి కారణం యమధర్మరాజు, ఆయన చెల్లెలు యమి (యమున). దీనికి సంబంధించిన ఒక ఇతిహాస గాథ ఉంది. అదేమిటో చూద్దాం.
రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. ‘భయ్యా ధూజీ’ లేదా ‘భాయి ధూజ్’ అనే పేరుతో ఉత్తరదేశంలో ప్రాచుర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది. దీనికి యమ విదియ అని, భగినీ హస్త భోజనమనీ పేరు. కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ. దీనికి సంబంధించిన కథ ఇలా చెప్పుకుంటారు.
యముడు, యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమున లో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! అందువల్ల సోదర సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చునని శాస్త్రం చెబుతోంది.