 
													సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై ఇప్పటికే అనేక కథనాలను చూశాం. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై గుంతల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ఓ మోస్తరు వర్షానికి కూడా రోడ్లపై నరకం చూడాల్సి వస్తోందని ఇప్పటికే సామాన్య జనం సహా, అనేకమంది అసహనం వ్యక్తం చేశారు.
ఇవి రహదారులు కాదు, యమపురికి దారులు, రోడ్లపై రక్షణ అనేదే లేకుండా పోయిందంటూ సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు మండిపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బెంగళూరు రోడ్లపై 5,670 గుంతలు ఉన్నాయని బీబీఎంపీ ఇటీవలి సర్వేలో తేలిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తాజాగా బెంగళూరు రోడ్ల అధ్వాన్న స్థితిని కళ్లకు కట్టేలా ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ద్వారా రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకుద్దేశించిన నిరసన ఆసక్తికరంగా మారింది. కర్నాటకలోని ఉడిపిలో చనిపోయిన వారి కోసం యమరాజు లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నాడు అంటూ కార్తీక్ రెడ్డి అనే యూజర్ ఈ వీడియోను ఎక్స్ పోస్ట్ చేశారు. ఇది నెటిజనులను ఆకట్టుకుంటోంది. యమధర్మరాజు , చిత్రగుప్తుడు రోడ్డు గుంతలను కొలుస్తున్న వైనం పరిస్థితికి అద్దం పడుతోంది. గుంతలు, అధ్వాన్నమైన రహదారుల కారణంగా సామాన్యుడు గాయపడినా, చచ్చిపోయినా రాజకీయనాయకులు పట్టించుకోరంటూ నెటిజనులు విమర్శలు గుప్పించారు.
Yamaraja conducts long jump competition for the dead in Udupi, Karnataka. pic.twitter.com/MLBxCuZoZn
— Karthik Reddy (@bykarthikreddy) August 27, 2024

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
