
కొందరిలో జుట్టు ఉండి కూడా నెరిసిపోతుంటే అది కూడా ఓ సమస్యే. అయితే ఈ పరిస్థితి కాస్త ఉపశమనం కలిగించే సమస్య. ఎందుకంటే... అసలు జుట్టు లేకపోవడం కంటే... తలపై వెంట్రుకలు ఉండి అవి తెల్లబడుతుంటే కనీసం రంగైనా వేసుకోవచ్చునన్నది పలువురి అభిప్రాయం. ఒక వయసు రాకముందే జుట్టు తెల్లబడటాన్ని బాలనెరుపుగా (ప్రీ–మెచ్యుర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్‌గా) చెబుతుంటారు. వెంట్రుకలు ఎందుకు నెరుస్తాయో చూద్దాం.
వెంట్రుకలు తెల్లబడటం ఎందుకు...
సాధారణంగా మన వెంట్రుకల మూలాన్ని హెయిర్ ఫాలికిల్ అంటారు. ఇక్కడ మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి మెలనిన్ అనే రంగునిచ్చే పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ పిగ్మెంట్ వల్లనే వెంట్రుకకు నల్లటి రంగు వస్తుంది. కొన్ని వెంట్రుకల్లో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా ఆ వెంట్రుక నల్లరంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. నిజానికి వాడుక భాషలో దాన్ని తెల్లవెంట్రుకగా చెబుతుంటాంగానీ... వాస్తవానికి వెంట్రుక తెల్లగా మారదు. మెలనిన్ ఇచ్చే నలుపు రంగును కోల్పోవడం వల్ల అది ఒక మేరకు పాక్షికంగా పారదర్శకం (ట్రాన్స్‌లుసియెంట్)గా మారుతుంది. దాంతో అది తెల్లవెంట్రుకలా కనిపిస్తుంది.
చదవండి: Hidden Threats : జుట్టు రాలిపోయే.. స్కిన్‌పాలిపోయే!
జుట్టు తెల్లబడటానికి కారణాలు...
వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అన్నిటికంటే ప్రధానమైనవి జన్యుపరమైన కారణాలు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వెంట్రుకలు త్వరగా నెరిస్తే పిల్లల్లోనూ అవి త్వరగా తెల్లబడటానికి అవకాశాలెక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం జరగాలి. కానీ కొందరిలో చాలా త్వరగా వెంట్రుకలు తెల్లగా కావచ్చు. ఇందుకు సహాయపడే మరికొన్ని కారణాలు చూద్దాం.
కారణాలు : రక్తహీనత (అనీమియా) పొగతాగే అలవాటు, మితిమీరిన ఒత్తిడి, థైరాయిడ్ లోపాలు / థైరాయిడ్ అసమతౌల్యత, విటమిన్ బి–12 లోపం వీటికి తోడు కాలుష్యం, పోషకాహార లోపం కూడా కొంతమేరకు తెల్లవెంట్రుకలకు కారణమవుతాయి.
వెంట్రుకలు నల్లబడాలంటే...
విటమిన్ బి–12 మాంసాహారంలో ఎక్కువగా లభ్యవమతుంటుంది కాబట్టి అది సమృద్ధిగా అందేలా మాంసాహారం తీసుకోవడం.
ఒకవేళ శాకాహారులైతే రోజూ గ్లాసెడు పాలు తాగడంతోపాటు, వైటమిన్ బి12 ఎక్కువగా లభించే తృణధాన్యాలు తినడం, అప్పటికీ సరైన మోతాదులో విటమిన్ బి12 అందకపోతే డాక్టర్ సలహా మేరకు వైటమిన్ బి12 అందేలా టాబ్లెట్లు వాడటం అవసరం.
కాలుష్యం తాలూకు దుష్ప్రభావంతో వెంట్రుక బలహీనమవుతుంది. దాంతో అది తేలిగ్గా తెగిపోవడం, జుట్టుకు సహజంగా ఉండే మెరుపు తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి తోడు వాతావరణ ఉష్ణోగ్రత కూడా పెరగడంతో... దేహానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందడం తగ్గుతుంది. దాంతో ఆ ప్రభావం వెంట్రుక మీద కూడా పడుతుంది. వాతావరణంలోని వేడిమితో విపరీతంగా చెమటలు పట్టడం వంటి కారణాలతో... శరీరంలోని లవణాలు, పోషకాలు వెంట్రుకలకు అందడం తగ్గి అది జుట్టు మీదా ప్రభావం చూపుతుంది. ఫలితంగా జుట్టు చింపిరిగా మారడం, తేలిగ్గా విరిగి΄ోయేలా (అంటే తెగడం–ఫ్రాజైల్‌గా మారిపోయేలా) వెంట్రుకలో కొన్ని మార్పులు వస్తాయి. దుమ్మూధూళి వల్ల జుట్టు తేలిగ్గా చింపిరిగా మారడంతో పాటు మాడుపైన దుష్పరిణామాలు కనిపించవచ్చు. దాంతో మాడుపైనుంచి చుండ్రు, పొట్టు రాలుతుండటం వంటివి పెరిగేందుకు అవకాశాలెక్కువ. వీటన్నింటి మొత్తం ప్రభావాల వల్ల వెంట్రుకలు తేలిగ్గా రాలడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.
కాలుష్య ప్రభావం వెంట్రుకలూ / జుట్టుపై ఎలా పడుతుందంటే... పురుషుల్లో బట్టతలకు జన్యుపరమైన కారణాలే ప్రధానమైనవి. దానికి తోడు మగపిల్లల్లో వారు యుక్తవయసు వచ్చేనాటికి అతడిలో స్రవించే పురుష హార్మోన్లు వెంట్రుకలను పలచబార్చడం మొదలుపెడతాయి. ఇలా పురుష హార్మోన్ల కారణంగా వెంట్రుకలు పలచబడుతూ ΄ోవడాన్ని ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటారు. పురుషుల్లో ఒక యుక్తవయసు వచ్చిన నాటి నుంచి తలవెంట్రుకలు మొదలయ్యే హెయిర్ లైన్ క్రమంగదా వెనక్కు జరుగుతుంటుంది. అందుకే పురుషుల్లో దాదాపు 25 శాతం మందిలో యుక్త వయసు నుంచి 30 ఏళ్లు వచ్చే వరకు ఎంతోకొంత జుట్టు పలచబారుతుంది.
కారణాలు: పురుషుల్లో కండరాలు బలపడటానికి, ఎముకల సాంద్రత పెరగడానికి వీలుగా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. అది రోమాంకురమైన హెయిర్ ఫాలికిల్‌ను ఎంతో కొంత బలహీన పరుస్తుంది. దాంతో వెంట్రుకలు రాలడం పెరిగి జుట్టు పలచబారుతూ పోతుంది. దీనికి తోడు ఒత్తిడి వంటి మరికొన్ని అంశాలు దీనికి తోడైతే జుట్టు రాలడం మరింత పెరుగుతుంది.
ఇదీ చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!
మందులు : వెంట్రుకలు రాలడాన్ని పూర్తిగా నివారించలేకపోయినప్పటికీ... జుట్టు రాలడాన్ని ఆపేందుకూ, రాలిన వెంట్రుకలు తిరిగి మొలవడానికి సహాయపడే కొన్ని పూత మందులు, నోటి ద్వారా తీసుకునే మందుల వంటివి కొన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే వాటివల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. ఉదాహరణకు ఇవి వాడేవారిలో తలనొప్పి, చుండ్రు, మాడు చర్మం మందంగా మారడం, రక్తపోటు తగ్గిపోవడం వంటి అనేక సమస్యలు రావచ్చు.
నోటి ద్వారా మందులు వాడే వారిలో రొమ్ములు పెరగడం, అంగస్తంభన లోపాలు వంటివీ రావచ్చు. పైగా వీటి ఉపయోగం తాత్కాలికమే. ఆ మందులు ఆపేసిన మరుక్షణం జుట్టు రాలడమనేది మళ్లీ మొదలుకావచ్చు. అందుకే మరీ అవసరమని భావిస్తేనే వీటిని తప్పనిసరిగా నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలని గుర్తుంచుకోండి.
డా. స్వప్నప్రియ
సీనియర్ డర్మటాలజిస్ట్