
మా అబ్బాయికి చాలా కాలంగా స్కిజోఫ్రీనియా వ్యాధి ఉంది. హైదరాబాదులో చికిత్స ఇప్పిస్తున్నాము. చాలాసార్లు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి కరెంటు ట్రీట్మెంట్ (ఇ.సి.టి.) కూడా ఇప్పించాము. చాలా కాలం నుండి డాక్టర్ ఇచ్చిన క్లోజపిన్ మందులు వాడుతున్నాము. అయితే తను మన అందరి లాగా పూర్తిగా నార్మల్‌గా ఉండడు. కొన్ని లక్షణాలు అలాగే మిగిలి ఉన్నాయి. పని కూడా ఏమీ చేయడు. ఇలా ఉండగా యూ ట్యూబ్‌లో ఒక కౌన్సెలర్ ఇంటర్వ్యూ చూసి ఆయనను వ్యక్తిగతంగా కలిసి ఆయన సలహా మేరకు మందులు – ఆపేశాం. మందులు మానేస్తే 3–4 నెలల్లోనే జబ్బును పూర్తిగా నయం చేస్తానన్నాడాయన. అలా చేసిన తర్వాత లక్షణాలు తగ్గకపోగా, మరింత పెరిగాయి. మా అబ్బాయికి చెవిలో మాటలు వినపడుతుండడంతో వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకి కూడా ప్రయత్నించాడు. ఇప్పుడు నాకు స్పష్టత రావట్లేదు – మళ్ళీ డాక్టర్ని కలిసి మందులు తీసుకోవాలా? లేక ఆ కౌన్సెలర్ చెప్పినట్టే ఇంకొంత కాలం మందులు లేకుండా కౌన్సిలింగ్ మాత్రమే చేయించాలా? ఏది నమ్మాలి? ఏం చేయాలో కన్‌ఫ్యూజన్ లో ఉన్నాను. అసలు మందులు లేకుండా మానసిక వ్యాధులను నయం చేయలేరా! – శ్రీనివాసరావు, హైదరాబాద్
‘స్కిజోఫ్రీనియా’ అనేది ఒక దీర్ఘకాలిక మానసిక వ్యాధి, కొంతమందిలో లక్షణాలు తగ్గినా, చాలాసార్లు దాన్ని పూర్తిగా నయం చేయడం కష్టం. చాలా సందర్భాల్లో దీర్ఘకాలికంగా మందులు అవసరమవుతాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర లక్షణాలు ఉన్నప్పుడు రోగిని ఆసుపత్రిలో ఉంచి ఇ.సి.టి. థెరపీ వంటి చికిత్సలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. తరువాత జబ్బు మళ్లీ పెరగ కుండా మందులను చాలాకాలం కొనసాగించడం అవసరం పడవచ్చు. ఇక మీ అబ్బాయికి వాడినట్లుగా మీరు చెబుతున్న క్లోజపిన్ అనే మందు స్కిజోఫ్రీనియా లక్షణాలు మొండిగా ఉన్నప్పుడు, ఇతర మందులు పని చేయని సందర్భాల్లో వాడే ఔషధం. దీనిని డాక్టర్ పర్యవేక్షణలో సరైన డోసుల్లో వాడితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆత్మహత్య ఆలోచనలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మానసిక సమస్యలకు ఇచ్చే చికిత్సలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. మెదడులో రసాయన అసమతుల్యతను సరిచేయడానికి కొన్ని మందులు వాడడం అలాగే రోగికి, వారి కుటుంబానికి జబ్బుపై అవగాహన పెంచడం (సైకోఎడ్యుకేషన్), లక్షణాలు తగ్గడం కోసం ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ వంటి సైకలాజికల్ ట్రీట్మెంట్, ఈ రెండూ కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. వైద్యుల సూచన లేకుండా మందులను ఇలా ఆపడం చాలా ప్రమాదం! మందులు ఆపిన తరువాత లక్షణాలు పెరిగి, ఆత్మహత్యా ప్రయత్నం జరగడం చాలా తీవ్రమైన విషయం. అందుకే మళ్లీ మీ సైకియాట్రిస్ట్‌ను కలిసి పరిస్థితిని వివరించి మందులను ప్రారంభించండి. అలాగే మందులతోపాటు, అవసరమైతే అర్హత కలిగిన (ఆర్.సి.ఐ. లైసెన్స్ పొందిన) క్లినికల్ సైకాలజిస్ట్ వద్ద నుండే సైకోథెరపీ కౌన్సెలింగ్ తీస్కోండి.
నేటి కాలంలో యూట్యూబ్, సోషల్ ’మీడియా వేదికల్లో చాలా మంది వైద్యపరమైన అర్హత లేని వ్యక్తులు పెద్ద పెద్ద హామీలు ఇస్తూ కనిపిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ముఖ్యంగా స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్. లాంటి మానసిక వ్యాధుల విషయంలో అలాగే ఆటిజం, ఎ.డి. హెచ్.డి. వంటి న్యూరో డెవలప్‌మెంట్ సమస్యల – విషయంలో అటువంటి అసంబద్ధమైన మోసపూరిత ప్రకటనలను నమ్మరాదని, వైద్యుల సూచన లేకుండా మందులు నిలిపివేయవద్దని మనవి. జబ్బు లక్షణాలు తగ్గేకొద్దీ, డాక్టర్లే మందుల డోసును క్రమేపీ తగ్గిస్తారు, తప్ప అర్హతలేని వారి సలహామేరకు మందులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపరాదు.. చిన్న చిన్న మానసిక వ్యాధుల విషయంలో ఒక్కోసారి మందులు లేకుండా కేవలం కౌన్సెలింగ్ తో సరిచేయవచ్చేమో కానీ, స్కిజోఫ్రీనియా లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులకు మందులు తప్పనిసరి!
చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com