3,500 ఏళ్ల క్రితం ప్రజల తెలివి.. నేటి టెక్నాలజీకే సవాల్! | 3500 year old food storage technique that amazed scientists | Sakshi
Sakshi News home page

3,500 ఏళ్ల క్రితం ప్రజల తెలివి.. నేటి టెక్నాలజీకే సవాల్!

May 30 2026 7:47 AM | Updated on May 30 2026 12:50 PM

3500 year old food storage technique that amazed scientists

3,500 ఏళ్ల నాటి తమిళనాడు ‘భూగర్భ ఫ్రిజ్‌ల’కథ  

ఓ నాలుగైదు గంటలు కరెంటు లేకపోతే ఏమవుతుంది? ఉక్కపోత గురించి పక్కన పెడితే ఫ్రిజ్‌లో ఉన్న పాలు పాడైపోతాయేమో, కూరగాయలు కుళ్లిపోతాయేమో అనే కంగారు మొదలవుతుంది. కానీ ఎలాంటి విద్యుత్‌ సౌకర్యం, ప్లాస్టిక్‌ డబ్బాలు, ఆధునిక కోల్డ్‌ స్టోరేజ్‌ టెక్నాలజీ లేని 3,500 ఏళ్ల కిందట జీవించిన ప్రజలు తమ ఆహారాన్ని ఎంతో భద్రంగా దాచుకునేవారు. అప్పట్లో సాగు చేసిన పంట మరుసటి ఏడాది వరకు పాడవకుండా చక్కగా కాపాడుకునేవారు. ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటినా, కీటకాలు, ఎలుకల భయం ఉన్నా వారు ధాన్యాన్ని నెలల తరబడి సురక్షితంగా ఉంచుకోగలిగేవారు.. ఇదంతా ఎలాగంటారా? దానికి కారణం వారు ఉపయోగించిన సాంకేతికతనో మరేదో కాదు.. భూమి అంటే ఆశ్చర్యం కలగక మానదు.

తమిళనాడులోని కోయంబత్తూర్‌ సమీపంలో పశ్చిమ కనుమల అడుగుభాగంలో ఉన్న మొలపాళయం అనే ప్రాంతంలో తమిళ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రజు్ఞలు ఇటీవల జరిపిన తవ్వకాల్లో నవీన శిలా యుగం (నియోలిథిక్‌ ఎరా) నాటి అద్భుతమైన భూగర్భ గృహాలు బయటపడ్డాయి. ఇందులోనే వారు అన్నీ దాచుకునేవారు. ఇవి కేవలం పంట దాచుకునే సాధారణ గిడ్డంగులు మాత్రమే కావు.. నాటి కుటుంబాల జీవన కేంద్రాలు. కొన్ని గుంతలలో ప్రాచీన రుబ్బురాళ్లు లభించాయి. అంటే ఇవి వంటగదులుగా కూడా ఉపయోగపడేవని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనుషులు దాక్కోవడానికి వీలుగా వీటిని పెద్ద పరిమాణంలో నిర్మించారు.

మరి ఎలా పని చేస్తాయ్‌?
ఈ మొలపాళయం గుంతల నిర్మాణం వెనుక ఎంతో లోతైన భౌతిక, రసాయన శాస్త్ర సూత్రాలు దాగి ఉన్నాయి. భూమి ఉపరితలంపై ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా, భూమి లోపలి పొరల్లో ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా, చల్లగా ఉంటుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే వీటిని నిర్మించారు. తమిళనాడులోని ఉక్కపోత, తేమ వల్ల ధాన్యం బూజు పట్టకుండా ఉండటానికి గుంతల లోపలి గోడలకు చెరువు మట్టి, వరి తవుడు, వరి గడ్డి కలిపిన మిశ్రమంతో పూత పూసేవారు. ఇవి తేమను పూర్తిగా పీల్చేసుకుంటాయి. అలాగే క్రిమికీటకాలు చేరకుండా ఉండేందుకు గోడలపై ఆవు పేడ నీటిని చల్లేవారు. ఇది సహజ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. ఇక బయటి భాగాలకు సున్నం పూసేవారు. 

ధాన్యం తీసే ప్రతిసారీ గాలి లోపలికి వెళ్లి పంట పాడవకుండా ఉండటానికి, ఈ గుంతల అడుగు భాగంలో చిన్న రంధ్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అవసరమైనప్పుడు కొద్దికొద్దిగా ధాన్యాన్ని బయటకు తీసుకునే వీలుండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సాంకేతికత కేవలం చరిత్రకే పరిమితం కాలేదు. గత 20వ శతాబ్దం మధ్యకాలం వరకు తమిళనాడులోని సేలం, ఈరోడ్, దిండిగల్‌ ప్రాంతాల రైతులు ‘కులుమై’, ‘కుదిర్‌’అని పిలిచే మట్టి నిల్వ పద్ధతులను ఉపయోగించేవారు. భారతదేశంలో దాదాపు 70 శాతం ధాన్యాన్ని పూర్వం ఇటువంటి దేశీయ పద్ధతుల్లోనే భద్రపరిచేవారని అంచనా. కానీ హరిత విప్లవం రాకతో, రసాయన మందులు, ఆధునిక ఇనుప గిడ్డంగులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ అద్భుతమైన విధానాన్ని ‘పాతకాలపు పద్ధతి’గా కొట్టిపారేసి, పూర్తిగా మరుగునపడేశారు.

ప్రస్తుతం అవసరమే.. 
ప్రస్తుత తరుణంలో ఈ విధానం ప్రపంచానికి ఎంతో అవసరం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో ఏటా సరైన నిల్వ వసతులు లేక లక్ష లాది టన్నుల ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయి. ఆధునిక కోల్డ్‌ స్టోరేజ్‌ పద్ధతులు విపరీతమైన విద్యుత్‌ను వినియోగిస్తూ, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. మారుతున్న వాతా వరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శాస్త్రవేత్తలు మళ్లీ పాత పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. 3,500 ఏళ్ల కిందట మన పూరీ్వకులు కనిపెట్టిన ఈ జీరో కార్బన్‌ విధానాలను తక్కువ ఖర్చు తో కూడిన ప్రత్యామ్నాయాలుగా మార్చడానికి పరిశోధనలు చేస్తున్నారు. ప్రకృతిని గౌరవిస్తూ వారు సాధించిన ఈ విజయం, నేటి ఆధునిక ప్రపంచానికి ఒక గొప్ప పాఠం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement