
ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ కావాల్సింది వినోదం. విపరీతమైన పని ఒత్తిడికి దారి తీస్తున్న ప్రస్తుత ఉరుకులు పరుగుల లోకంలో విశ్రాంతి దానితో పాటే వినోదం కూడా ఒక నిత్యావసరంగా మారిపోయింది. అందుకు అనుగుణంగానే అనేక రకాల వినోద మార్గాలు, సాధనాలు అందుబాటులోకి వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. తమ ప్రజల్ని వినోదభరితంగా ఉంచడానికి అనేక దేశాల్లో ప్రభుత్వాలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రపంచంలోనే అత్యంత వినోదభరిత దేశంగా ప్రజలు ఏ దేశాన్ని గుర్తిస్తున్నారు? అనే ఆలోచనతో ది యుఎస్ న్యూస్ బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ ఆధ్వర్యంలో ది వరల్డ్స్ మోస్ట్ ఫన్ కంట్రీస్ పేరిట తాజాగా ఒక అధ్యయనం నిర్వహించారు. వినోదాన్ని పంచే వేడుకలు, ఈవెంట్లు, సాహసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు..వగైరాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. దాని ప్రకారం వినోద భరిత జీవనాన్ని అందించే 40 దేశాల జాబితాను రూపొందించారు.
ఇటీవలే విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం.. స్పెయిన్ అత్యుత్తమ వినోద భరిత దేశంగా నిలిచింది. సాహసాలు, సంస్కృతీ సంప్రదాయల పరంగా 4వ స్థానంలో నిలిచిన ఈ దేశం మొత్తంగా చూస్తే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా స్పెయిన్‌లో నిర్వహించే టమాటినా ఫెస్టివల్ అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. ప్రపంచలోనే అతిపెద్ద టమాటా ఫెస్టివల్‌గా వందల కొద్దీ టన్నులను దీని కోసం వినియోగిస్తారు. ఇవే కాకుండా మరిన్ని వినోదాలు, అడ్వంచర్స్ కూడా స్పెయిన్‌ను ఈ అంశంలో అందలాలు ఎక్కించాయి.
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బ్రెజిల్, థాయ్‌ల్యాండ్, ఇటలీ, మెక్సికో, గ్రీస్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఐర్లాండ్, సింగపూర్, టర్కీ, అమెరికా, కెనడా, కోస్టారికా, ఐస్‌ల్యాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, కొమెనిక్ రిపబ్లిక్, యునైటెడ్ కింగ్ డమ్, జపాన్, బెల్జియం, మొరాకో, ఈజిప్ట్, స్విట్జర్లాండ్, సైప్రస్, ఆస్ట్రియా, క్రొయేషియా, ఇండోనేషియా, యుఎఇ, చిలీ, ఫిన్లాండ్, సౌత్ ఆఫ్రికా, కొలంబియా, పెరు, స్వీడన్, డెన్మార్క్‌లు ఉన్నాయి.
ఈ జాబితాలో ఎక్కడా ఇండియాకు చోటు దక్కకపోవడం విశేషం. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం ఇంకా కొన్ని రకాల కట్టుబాట్లను సంకెళ్లను తెంచుకోకపోవడం అలాగే మన దేశంలో వినోదం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు లేకుండా మన పండుగలు, సంప్రదాయ జాతరలు వంటి వాటిలో అది మమేకమైపోవడం వంటి పలు కారణాలు ఉండవచ్చునని అంటున్నారు. అంతేగాక ఈ అధ్యయనం కోసం ఎంచుకున్న ప్రజలు, ప్రాంతాలను బట్టి కూడా ఇది ఆధారపడి ఉండవచ్చునని విశ్లేషిస్తున్నారు.