నిర్వాసితుల పునరావాస భూసేకరణపై సర్వే | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితుల పునరావాస భూసేకరణపై సర్వే

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

నిర్వాసితుల పునరావాస భూసేకరణపై సర్వే చెల్లని చెక్కు కేసులో జైలు శిక్ష, జరిమానా

కొయ్యలగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి భూసేకరణ కోసం గురువారం సర్వే ప్రక్రియ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌ శర్మ (ఐఏఎస్‌) ఆధ్వర్యంలో అధికారుల బృందం అచ్చుతాపురం సమీపంలోని రెవెన్యూ పరిధిలో గల సుమారు 75 ఎకరాల ప్రాంతాన్ని పరిశీలించింది. చింతూరు, ఎటపాక ప్రాంతాలకు చెందిన పోలవరం నిర్వాసిత కుటుంబాల పునరావాసం కోసం ఈ భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా సర్వే నంబర్లు 1043, 1044లకు సంబంధించిన భూములను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కొవ్వూరు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, చింతూరు, ఎటపాక, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, కొయ్యలగూడెం తహసీల్దార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల వివరాలు, సేకరణ ప్రక్రియ పురోగతి, స్థానిక పరిస్థితులు, అవసరమైన పరిపాలనా చర్యలపై ఉన్నతాధికారులు విస్తృతంగా సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఐఏఎస్‌ అభిషేక్‌ శర్మ ఆదేశించారు.

నూజివీడు : చెల్లని చెక్కు కేసులో నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన చల్లారి సత్యన్నారాయణకు ఆరునెలల జైలు శిక్ష, రూ.11 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం గొల్లపల్లికి చెందిన చల్లారి సత్యన్నారాయణ, చల్లారి శివనాగమల్లేశ్వరరావు అన్నదమ్ములు. 2020 అక్టోబరు 4న శివనాగమల్లేశ్వరరావు, సత్యన్నారాయణకు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత తన బాకీ తిరిగి చెల్లించమని అడగగా సత్యన్నారాయణ 2023 జూన్‌ 19న రూ.10 లక్షలకు చెక్కును శివ నాగమల్లేశ్వరరావుకు ఇచ్చాడు. ఆ చెక్కును బ్యాంకులో వేయగా సత్యన్నారాయణ బ్యాంకు ఖాతాను నిలిపివేసినట్లు ఆ చెక్కును బ్యాంకు అధికారులు తిప్పి పంపారు. దీంతో శివ నాగమల్లేశ్వరరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం సత్యన్నారాయణకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement