మట్టి లారీ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

మట్టి లారీ సీజ్‌

Jul 23 2026 1:12 AM | Updated on Jul 23 2026 1:12 AM

మట్టి లారీ సీజ్‌ దెందులూరులో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు విద్యుత్‌ షాక్‌తో పాడి గేదె మృతి జంగారెడ్డిగూడెం డీఎస్పీగా వెంకటేశ్వర్లు

కొయ్యలగూడెం : అనుమతులు లేని మట్టి రవాణాపై రెవెన్యూ అధికారుల చర్యలు చేపట్టారు. బుధవారం రాజవరం శివారు గంగవరం వద్ద అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న లారీని తహసీల్దార్‌ ఎన్‌.నాగరాజు, రెవెన్యూ అధికారులు అడ్డుకుని సీజ్‌ చేశారు. అనంతరం లారీను కొయ్యలగూడెం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

దెందులూరు : మండలంలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని దెందులూరు ఎస్సై డి.వెంకట్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం దెందులూరు పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలో ఏ విధమైన అంశాలపై సమావేశాలు, సామూహిక ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు. పోలీస్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జంగారెడ్డిగూడెం : శతాధిక వృద్ధురాలు కుచ్చలపాటి సూర్యకాంతమ్మ (108) స్థానిక శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. సమాచారం ఇచ్చినా కుటుంబ సభ్యులు రాకపోవడంతో, ఆశ్రమ నిర్వాహకుడు జయవరపు శేఖర్‌, సహాయ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ వీరమల్ల మధు ముందుకొచ్చి, హిందూ స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను శాస్త్రబద్ధంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. కన్నవారే రాని సమయంలో బిడ్డల కంటే మిన్నగా అంతిమ సంస్కారాలు చేసిన శేఖర్‌, మధు సేవలను క్షత్రియ సేవా సమితి సభ్యుడు దండు ధనరాజు, పలువురు ప్రముఖులు కొనియాడారు.

తణుకు అర్బన్‌ : ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన ప్రయాణికులను హడలెత్తించింది. తణుకు రాష్ట్రపతి రోడ్డు కోర్టు సమీపంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బస్టాండ్‌ నుంచి మునిసిపల్‌ కార్యాలయం వైపు వెళ్తూ డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డివైడర్‌పై ఉన్న మొక్కల కుండీలు ధ్వంసమై పక్కరోడ్డుపైకి ఎగిరి పడ్డాయి. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కనీసం బస్సును ఆపకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. డ్రైవింగ్‌లో బస్సును అదుపు చేయలేకపోతే ప్రయాణికుల పరిస్థితి ఏంటని స్థానికులు చర్చించుకున్నారు.

చింతలపూడి: మండలంలోని ఎరగ్రుంటపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురై ఒక పాడిగేదె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాడిరైతు తెలిపిన వివరాల ప్రకారం ఎరగ్రుంటపల్లి గ్రామానికి చెందిన రైతు పెనుబాక రామారావు తన పాడిగేదెను మేతకు తోలుకెళ్లిన సమయంలో అక్కడ రోడ్డు పై పడి ఉన్న విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. చనిపోయిన గేదె విలువ సుమారు రూ. లక్ష రూపాయలు ఉంటుందని బాధితుడు వాపోయాడు.

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ నూతన డీఎస్పీగా బీహెచ్‌ వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్‌ నంద్యాల ఏఎస్పీగా బదిలీ అవ్వడంతో, విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ క్రైమ్‌ విభాగంలో సీఐగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు పదోన్నతిపై ఇక్కడికి డీఎస్పీగా వచ్చారు. నూతన డీఎస్పీకు జంగారెడ్డిగూడెం ఎస్సై ఆర్‌.వీరప్రసాద్‌, ట్రాఫిక్‌ ఎస్సై కుటుంబరావు, తడికలపూడి ఎస్సై వల్లీపద్మ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement