ముదినేపల్లి (కై కలూరు): సింగరాయపాలెం సెంటర్ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులు స్వామివారి దేవస్థానం పుట్ట వద్ద పాలు పోసి పూజలు చేశారు. దేవస్థానం ఉచిత భోజన సౌకర్యం కల్పించింది. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తణుకు అర్బన్: తణుకు పాతవూరు ప్రాంతంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న విద్యుత్ తీగలు చోరీ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాతవూరు పశువుల ఆస్పత్రి ప్రాంతంలోని లే అవుట్‌లో ఏర్పాటుచేసి ఉన్న విద్యుత్ స్తంభాల నుంచి విద్యుత్ తీగలను కట్‌చేసి, చుట్టుకుని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్న వీడియోలు వివిధ వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే విద్యుత్ తీగలు కట్ చేసి చుట్ట చుట్టిన ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. అతను విద్యుత్ శాఖకు చెందిన వ్యక్తి అని, మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుడంటూ ఆరోపణలు వినిపిస్తుండగా.. ఆ రెండు విభాగాల అధికారులు అతడు తమ ఉద్యోగి కాదని, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా చెబుతున్నారు. వీడియోలో చోరీ చేస్తున్న వ్యక్తి కొమ్మాయిచెరువు ప్రాంత వాసిగా భావిస్తున్నారు.


