నూజివీడు: చెక్కుబౌన్స్ ఇచ్చిన కేసులో నూజివీడుకు చెందిన సోలే వందన అజయ్‌కుమార్‌కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2.50లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు పట్టణానికి చెందిన పరుచూరు రాహుల్ మనోహర్ 2023 అక్టోబర్ 17న అజయ్‌కుమార్‌కు రూ.2లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం గడిచిన తరువాత తన బాకీ తీర్చమని రాహుల్ అడగగా అజయ్‌కుమర్ 2023 నవంబరు 17న రూ.2లక్షలకు చెక్కును ఇచ్చాడు. దీంతో చెక్కును బ్యాంకులో వేయగా అజయ్‌కుమార్ అకౌంట్‌లో నగదు లేకపోవడంతో బౌన్స్ అయ్యింది. దీంతో రాహుల్ మనోహర్ కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం న్యాయమూర్తి అజయ్‌కుమార్‌కు జైలుశిక్ష, జరిమానా విధించారు.
నూజివీడు: పట్టణంలోని పెద్దచెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అధికారులు గురువారం దాడి చేశారు. విజిలెన్స్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్లు కేవీ రమణ, ప్రకాష్‌లు చెరువులో జరుగుతున్న తవ్వకాల వద్దకు వెళ్లి 6 ట్రాక్టర్లను, పొక్లెయిన్‌ను, జేసీబీని పట్టుకుని వీఆర్వో రంగారావుకు అప్పగించారు. విజిలెన్స్ అధికారులు వెళ్లిపోయిన తర్వాత ట్రాక్టరు డ్రైవర్లు 8 ట్రాక్టర్లలోని మట్టిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వీఆర్‌ఓ ఈ విషయాన్ని ఆర్‌ఐ, తహసీల్దార్‌లకు తెలియజేశారు.
ఆగిరిపల్లి: ఎద్దుల కొనుగోలు విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సురవరం గ్రామానికి చెందిన కనకలింగేశ్వరరావు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడికి ఏడేళ్ల క్రితం కోడూరుపాడు గ్రామానికి చెందిన నాగసాయి గంగాభవానితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం ఉదయం లింగేశ్వరరావు తన సోదరుడితో కలిసి వ్యవసాయ పనుల కోసం ఎద్దులను కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు ఉన్నందున ఇప్పుడు ఎద్దులు కొనవద్దని భార్య గంగాభవాని వారించినప్పటికీ అతడు గోపాలపురంలో రెండు గిత్తలను కొనుగోలు చేసి మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి అది కాస్తా పెనుగులాటకు దారితీసింది. ఆ సమయంలో గంగాభవాని చేతిలో ఉన్న కూరగాయలు కోసే చాకు లింగేశ్వరరావు గుండెల్లో దిగడంతో తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చిన్న ఆవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెదవేగి: ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఎమ్‌ఎస్‌ఎన్వీ ప్రసాదరెడ్డి కానిస్టేబుల్ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన ద్విచక్ర వాహనంపై ఏలూరు నుంచి ఏడో మైలు వైపు విధులకు వెళ్తున్నారు. పెదవేగి మండలం నాగన్నగూడెం సమీపంలోకి వచ్చేసరికి, ఎదురుగా వస్తున్న ఆటో ముందు చక్రంలో గాలి తగ్గి అదుపు తప్పింది. ఒక్కసారిగా కుడివైపునకు ఒరిగిపోయిన ఆటో ప్రసాదరెడ్డి ప్రయాణిస్తున్న బైక్‌తో పాటు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాదరెడ్డి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు ఆటోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారంతా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వారిగా గుర్తించారు. వీరు రాట్నాలమ్మ అమ్మవారిని దర్శించుకుని, అనంతరం పెదవేగిలోని సాయిబాబా స్థూపాన్ని సందర్శించి ఆటోలో ఏడవ మైలు మీదుగా ఏలూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెదవేగి ఎస్సై ఎం. హరిగోపాల్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


