ఫేస్ యాప్, ఫొటో హాజరు తొలగించాలి
కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
తణుకు అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకానికి పని కల్పించే ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఫేస్ యాప్, రెండు పూటలా ఫొటో హాజరు, పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించకపోవడంపై కూలీల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వీబీజీ రాంజీ పథకంగా మార్చి నూతన నిబంధనలు అమలు చేయడంతో తమ ఉపాధికి గండి పడేలా ఉందని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫేస్‌యాప్, రెండు పూటలా హాజరుపై నిరసనలు
వీబీజీ రాంజీ పథకంలో భాగంగా తీసుకువచ్చిన నిబంధనలతో పనులు సాగకపోగా చేసిన పనికి సరిపడా డబ్బులు అందడంలేదని ఉపాధి హామీ కూలీలు వాపోతున్నారు. ఫేస్ యాప్, రెండు పూటలా హాజరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉదయం పనిలోకి వచ్చిన వెంటనే ఒక ఫొటో తీస్తారని, పని దిగిపోయాక మరలా మరొక ఫొటో ఫేస్ యాప్ ద్వారా తీస్తున్నారు. అయితే ఉదయం ఫొటో దిగిన ప్రాంతంలోనే తిరిగి రెండో ఫొటో తీస్తేనే యాప్ తీసుకునే విధంగా రూపొందిచబడింది. దీంతో పని అయిపోయినా ఫొటో కోసం పడిగాపులు పడాల్సి వస్తుందని కూలీలు చెబుతున్నారు. జిడ్డు ముఖంతో వస్తే యాప్‌లో ఫొటో పడడం లేదని చెబుతున్నారు. ఉదయం ఫొటోలో ముఖం ఉన్నట్లుగా రెండో పూట కూడా అలాగే ముస్తాబులు చేసుకుని ఫొటోలు తీయించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. అంతేకాకుండా ఉదయం పెట్టుకున్న బొట్టు మాదిరిగానే రెండో ఫొటోలో కూడా ఉండాల్సి వస్తుందని అంటున్నారు. కూలీలకు ఇచ్చే అరకొర వేతనాలకు ఇన్ని నిబంధనలు పెడితే ఎలాగని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని మస్తరుకు ఫొటోకు యాప్ ద్వారా అనుసంధానం చేయడంతో యాప్‌లో ఫొటో తీసుకుంటేనే జీతం వచ్చే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రెండు పూటలా ఫొటో హాజరుకు సంబంధించి ఇంటర్నెట్‌లో సాంకేతిక ఇబ్బందులతో జాప్యం అవుతున్న సందర్భాల్లో కూలీలు పడిగాపులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
25వేలకు పైగా కూలీలు..
తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు సంబంధించి 48 గ్రామాల్లో సుమారుగా 25 వేలకు పైగా కూలీలు ఉపాధి హామీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఉదయం అప్పగించిన కొలతల ప్రకారం పని పూర్తి చేసినా రెండో పూట ఫొటో ఏంటని కూలీలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలతల ప్రకారం రోజు పనిచేసినా రెండో ఫొటో కోసం వేచిచూడాల్సిన దుస్థితి కూలీలకు ఉందని, పనిపూర్తిగా చేసినా కానీ రూ.240 కంటే ఎక్కువ రావడంలేదని వాపోతున్నారు. ఇప్పటికే వడదెబ్బలతో కొన్ని ప్రాంతాల్లో కూలీలు మృతిచెందగా, దువ్వలో ఇటీవల ఒక మహిళ స్పృహ తప్పిపడిపోయారు. వేసవిలో పని ప్రాంతంలో సౌకర్యాలు కల్పించాలని, టెంట్‌లు వేయాలని కోరుతున్నారు.
ఉపాధి హామీ పథకానికి నిబంధనలతో చిక్కులు
ఫేస్ యాప్.. రెండు పూటలా ఫొటోలు
ఫొటో హాజరులో సాంకేతిక ఇబ్బందులతో అవస్థలు
వేసవిలో పని ప్రాంతాల్లో సౌకర్యాలు కరువు
ఉపాధి కూలీలకు ఫేస్ యాప్, రెండు పూటలా ఫొటో హాజరు విధానం తొలగించాలి. కూలీలకు 40 శాతం అలవెన్స్‌లు ఇవ్వడంతోపాటు వడదెబ్బ నివారణకు పని ప్రాంతాల్లో టెంట్‌లు వేయాలని, తాగునీరు ఏర్పాటుచేయాలని, సామాగ్రి మరమ్మతులు ఖర్చులు, రవాణా ఛార్జీలు ఇప్పించడంతోపాటు విధుల్లో మృతిచెందిన కూలీలకు రూ.20 లక్షలు నష్టపరిహారం కల్పించాలని అధికారులకు విన్నవించాం.
– బళ్ల చినవీరభద్రరావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు
ఉపాధి హామీ పథకంలోని నూతన విధానాలతో కూలీల ఉపాధికి గండి పడుతోంది. ముఖ్యంగా ఫేస్ యాప్‌తోపాటు రెండు పూటలా ఫొటో హాజరు కోసం కూలీలు పని పూర్తయినా పడిగాపులు పడాల్సి వస్తుంది. వేసవి కారణంగా కూలీలకు పని ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి. కూలీలకు మస్తర్లు ఇతర అంశాల్లో మేట్‌లు పడుతున్న కష్టాన్ని గుర్తించి వారికి ప్రభుత్వం కూలీకి రూ.5 చొప్పున పారితోషికంగా అందచేయాలి.
– బండారు వెంకటేశ్వర్లు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ తణుకు మండల కన్వీనర్


