కూటమి తెచ్చిన కష్టాలు
విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సీ) కింద భీమవరంలో పేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన కుమారుడిని స్థానికంగా ప్రైవేట్ స్కూల్‌లో 1వ తరగతిలో చేర్పించేందుకు అర్హత పొందారు. కార్పొరేట్ స్కూల్‌లో తన కుమారుడికి సీటు రావడంతో ఉచిత విద్య అందుతుందని సంబరపడిపోయాడు. అడ్మిషన్ కోసం వెళితే ఫిజికల్ యాక్టివిటీస్, పుస్తకాలు, యూనిఫాం తదితర వాటి కోసం రూ.30 వేలు వరకు చెల్లించాలనడంతో షాకయ్యాడు. 7వ తేదీలోగా ఈ మొత్తం చెల్లించి అడ్మిషన్ తీసుకోకుంటే మీకు వచ్చిన సీటు రద్దవుతుందని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు.
సాక్షి, భీమవరం: పేదల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్యనందించాలన్న ఆశయానికి తూట్లు పడుతున్నాయి. అడ్మిషన్, ఫిజికల్ యాక్టివిటీస్, బుక్స్, యూనిఫాం తదితర వాటి పేరు చెప్పి విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సీ) లబ్ధిదారులకు విద్యాసంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. చెప్పినంత చెల్లించి అడ్మిషన్ తీసుకోకుంటే సీటు రద్దయిపోతుందని చెబుతుండటంతో చిన్నారుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు.
పేదల విద్యకు పెద్దపీట వేసిన జగన్ ప్రభుత్వం వారిపై ఫీజుల భారం పడకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే వీలు కల్పించారు. ఉచిత నిర్బంద విద్యాహక్కు చట్టం సెక్షన్–12(1), (సి) కింద ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1వ తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థుల కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఐదేళ్లు నిండి ఆరేళ్ల లోపు పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తూ అందుకు అర్హతగా విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.14 లక్షలలోపు ఉండాలి. స్కూల్స్ యాజమాన్యాలకు ఏడాదికి అర్బన్‌లో రూ.8,000, రూరల్‌లో రూ.6,500, ఏజెన్సీలో రూ.5,500 ఫీజుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని అమ్మఒడి సాయం నుంచి ప్రభుత్వమే చెల్లించి మిగిలిన సొమ్మును విద్యార్థి తల్లి ఖాతాకు జమచేసే విధంగా అప్పట్లో చర్యలు తీసుకుంది. జిల్లాలో 383 ప్రైవేట్ పాఠశాలలకు గాను 1వ తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తూ 2022–23 విద్యాసంవత్సరం నుంచి ఉచిత విద్యను అమల్లోకి తెచ్చారు. తొలి ఏడాది వివిధ ప్రైవేట్ స్కూళ్లలో 38 మంది విద్యార్థులు చేరారు. 2023–24లో అనూహ్యంగా 1,812 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 1,162కి ఉచిత విద్య పొందే అవకాశం కల్పించారు.
కూటమి ప్రభుత్వంలో ఉచిత విద్యకు కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అమ్మఒడి సాయాన్ని విడుదల చేయడం వలన ఆ మొత్తం నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలకు కనీస ఫీజు ఇచ్చేందుకు పేదలకు ఇబ్బంది ఉండేదికాదు. కాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనంకు తొలి ఏడాది ఎగనామం పెట్టడంతో ఫీజుల భారం తల్లిదండ్రులపై పడింది. ఫీజు మొత్తం చెల్లించాలంటూ అప్పట్లో పలు విద్యాసంస్థలు నోటీసులు ఇచ్చాయి. ఉచిత విద్య అందుతుందన్న ఆశతో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించిన పేదలు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి ఫీజులు చెల్లించిన పరిస్థితులు ఎదురయ్యాయి.
అడ్మిషన్, ఫిజికల్ యాక్టివిటీస్, పుస్తకాలు, యూనిఫాం పేరిట బాదుడు
సీటు కోసం రూ.30 వేల వరకూ డిమాండ్ చేస్తున్న విద్యాసంస్థలు
7లోపు అడ్మిషన్ తీసుకోకుంటే సీటు ఉండదని భయపెడుతున్న వైనం
బెంబేలెత్తుతున్న సెక్షన్–12(1)సీ లబ్ధిదారులు
పేదలకు ప్రైవేట్ స్కూళ్లల్లో ఉచిత విద్య పొందే వీలు కల్పించిన జగన్ సర్కారు
ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయింపు
రానున్న విద్యాసంవత్సరానికి ఆర్టీఈ 12(1)(సి) కింద తొలి విడతగా జిల్లాలో 1,047 మంది ఉచిత ప్రవేశాలకు అర్హత సాధించారు. ఈనెల 7వ తేదీలోగా విద్యార్థుల పేరెంట్స్ తమ ఆదాయం, కులం, ఆధార్, బర్త్ తదితర సర్టిఫికెట్లు అందజేసి అడ్మిషన్లు పూర్తి చేసుకోవాల్సి ఉంది. అందుకోసం వెళుతున్న వారికి ప్రైవేట్ స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్మిషన్ నిమిత్తం రూ.500 నుంచి రూ.2000 వరకు, ఫిజికల్ యాక్టివిటీస్ కోసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, పుస్తకాలకు రూ. 10 వేల వరకు, యూనిఫాంకు రూ.3 వేల వరకు చెల్లించాలని స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నట్టు పేరెంట్స్ అంటున్నారు. ఈ సొమ్ములు చెల్లించి నిర్ణీత గడువులోగా అడ్మిషన్ తీసుకోకుంటే సీటు రద్దయిపోతుందని చెబుతుండటంతో ఏంచేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. ఆయా ఫీజుల భారం లేకుండా ఉచిత ప్రవేశాలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్‌ను సంప్రదించగా ఆయన ఫోన్‌కు అందుబాటులో లేరు.


