సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి పనులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్న టీడీపీ నాయకులు ప్రజల ముక్కుపిండి డబ్బు దోచేస్తున్నారు. అత్తిలి మండలంలో కొందరు కూటమి నాయకులు చేస్తున్న ఈ తరహా దోపిడీకి ప్రజలు నెత్తీనోరు బాదుకుంటున్నారు. అత్తిలి మండలం ఆరవిల్లి గ్రామంలోని వైఎస్సార్ కాలనీలో విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను టీడీపీ నాయకులు సొమ్ముచేసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు కాలనీలోని ప్రజల నుంచి ఒక్కో ఇంటికీ ఒక్కోలా ధర నిర్ధేశించి వసూళ్లకు దిగిన వ్యవహారం ఆరవల్లిలో గుప్పుమంది. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం అంటూ రూ.300 నుంచి రూ.1,500 వరకు గుంజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీ ఉన్న గృహానికి ఒకలా, ఏసీ లేని గృహానికి మరొకలా టీడీపీ నాయకులు డబ్బులు వసూళ్లలో రూ.50 వేలకుపైగా దోచుకున్నారన్న విషయం గుప్పుమంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ శాఖ ఏర్పాటుచేస్తే టీడీపీ నాయకులు ఎందుకు డబ్బులు వసూలు చేశారంటూ కాలనీవాసులు గుర్రుగా ఉన్నారు.
వైఎస్సార్ కాలనీలో 100 ఇళ్లు
ఆరవల్లి వైఎస్సార్ కాలనీలో 100కుపైగా ఇళ్లు ఉండగా ఇప్పటివరకు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం సరిపోక లోఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో రూ.8 లక్షల నిధులతో విద్యుత్ 100 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు పనులు నిర్వహించారు. ముందుగా సరిపడా సిమెంట్ దిమ్మ కట్టించగా ఇదే అదనుగా చూసిన స్థానిక టీడీపీ నాయకులు డబ్బులు వసూళ్లకు తెరతీశారంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేయగా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు మాత్రం రూపాయితో సహా విద్యుత్ శాఖ వెచ్చిస్తుందని ప్రజలు ఎటువంటి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతుండడం విశేషం.
రూ.25 వేలు దోచేశారు
కాలం చెల్లిన తినుబండారాల ప్యాకెట్ విక్రయించారంటూ ఇటీవల ఒక వ్యాపారి నుంచి రూ.25 వేలు కూటమి నాయకుడు దోచుకున్న వ్యవహారం అత్తిలిలో సంచలనం రేకెత్తించింది. ఆర్యవైశ్యుడికి చెందిన ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసిన ప్యాకెట్ కాలం చెల్లిందని అర్ధరాత్రి సమయంలో ఇంటిపైకి పది మంది వచ్చి దౌర్జన్యానికి దిగగా సదరు వ్యాపారి కాళ్లు పట్టుకున్నా క్షమించని దుస్థితి. ఈ క్రమంలో సదరు కూటమి నాయకుడు రూ.లక్ష డిమాండ్ చేయగా తమ వద్ద అంతలేదని చివరకు రూ.25 వేలు ఇచ్చినట్లుగా అత్తిలిలోని ఆర్యవైశ్యులు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అత్తిలి మండలం అంతా దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులకు నిలయంగా మారిందని ప్రజానీకం చర్చించుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్న కొందరు నాయకులకు కప్పం కట్టకుంటే కానీ వ్యాపారాలు చేసుకోలేని స్థితిలో వ్యాపారులు ఉన్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
మామూళ్లు వసూలు చేస్తున్న వైనం
ఆరవల్లి వైఎస్సార్ కాలనీలో బయటపడిన వ్యవహారం
ఇంటికొచ్చి రూ.1,500 వరకూ గుంజేశారని ఆరోపణలు
విద్యుత్ శాఖ నిర్మిస్తే టీడీపీ నాయకుల దోపిడీ ఏంటనే ప్రశ్నలు


