ముగిసిన 10 పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నాటితో ముగిశాయి. ఈ పరీక్షల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షలకు 22,923 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 23,418 మంది విద్యార్థులకు గాను 495 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 97.89 శాతంగా నమోదైంది. పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ 32, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 06, జిల్లా విద్యాశాఖాధికారి 04, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ 03 మొత్తం 45 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
విద్యార్థుల్లో ఉత్సాహం
ఏడాది పాటు కఠోరదీక్షతో చదివి పరీక్షలను విజయవంతంగా రాయడంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. వాస్తవానికి ఏప్రిల్ 1వ తేదీతో పరీక్షలు ముగియాల్సి ఉండగా గత నెలలో రంజాన్ పండుగ సెలవు రావడంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించలేకపోయారు. దీనితో ఈ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి మార్చుతూ ప్రభుత్వ పరీక్షల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇంగ్లీష్ పేపర్ పరీక్షను గురువారం నిర్వహించారు. పబ్లిక్ పరీక్షల్లో చివరి పరీక్ష రాశామన్న ఆనందంలో పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కేరింతలు కొట్టారు. వారి విద్యా సంస్థల బస్సుల్లో తిరిగి వెళుతూ కేకలు వేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


