ఏపీటీఎఫ్ నాయకుల వినతి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబుపత్రాల మూల్యాంకన కార్యక్రమం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ విధులపై విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఆర్.ఆశకు గురువారం ఏపీటీఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ సంబంధిత సబ్జెక్టులను బోధించని ఉపాధ్యాయులకు కూడా మూల్యాంకన విధులు కేటాయించబడినట్లు గమనించామన్నారు. విభిన్న ప్రతిభావంతుల (వికలాంగుల) కేటగిరికి చెందిన ఉపాధ్యాయులకు కూడా ఉత్తర్వులను జారీ చేశారని, అలాగే ప్రాథమిక పాఠశాలల హెడ్‌మాస్టర్లకు ప్రత్యేక సహాయకులుగా విధులు కేటాయించినట్టు గుర్తించామన్నారు. అయితే వారు పాఠశాల నిర్వహణతో పాటు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని, ఈ సమస్యలు మూల్యాంకన ప్రక్రియ నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఈ మేరకు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను పునఃపరిశీలించి అర్హతలు, సంబంధిత సబ్జెక్టుల ఆధారంగా విధులను కేటాయించాలని సంఘం తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈ రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ మోహన్, జిల్లా కార్యదర్శి డీ శ్రీనివాసరావు, గుంటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


