గవర్నర్‌కు స్వాగతం | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు స్వాగతం

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

గవర్నర్‌కు స్వాగతం కేంద్రీయ విద్యాలయానికి స్పందన భేష్‌ రఘురామకృష్ణరాజును బర్తరఫ్‌ చేయాలి గ్లోబల్‌ బ్రాండ్లుగా కోకో, జీడి పంటలు

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ గురువారం సందర్శించారు. ముందుగా హెలీకాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, ప్రాజెక్టు వ్యూ పాయింట్‌ నుంచి పనుల పురోగతిని పరిశీలించారు. గవర్నర్‌ హెలికాప్టర్‌ దిగిన వెంటనే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, బలరామకష్ణ ప్రసాద్‌, ట్రైకార్‌ ఛైర్మన్‌ బొరగం శ్రీను, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ్‌, ఎస్‌ఈ ఆర్‌. రామచంద్రరావు, జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్‌ రెడ్డి, మేఘ సీవో ఏవీ సతీష్‌, జీఎం గంగాధర్‌ స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ కె.నరసింహమూర్తి ప్రాజెక్టు పనులను గవర్నర్‌కు వివరించారు.

నూజివీడు: నూజివీడు కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో పూర్తయినట్టు ప్రిన్సిపాల్‌ మహమ్మద్‌ ఫారూఖ్‌ తెలిపారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయంకు ప్రజల నుంచి స్పందన బాగా వచ్చిందన్నారు. ఒకటో తరగతికి 80 వరకు వచ్చాయని, రెండో తరగతిలో ప్రవేశానికి 108 దరఖాస్తులు, మూడో తరగతికి 96, నాలుగో తరగతికి 96, ఐదో తరగతికి 47 చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రస్తుతం మొదటి ఏడాది కాబట్టి తరగతికి 40 సీట్లు చొప్పున మాత్రమే ఉంటాయన్నారు.

ఏలూరు (టూటౌన్‌): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేట ఎస్సీ మాల క్రైస్తవులపై డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు చేసిన దాడిని ఖండిస్తూ తక్షణం ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని మాల సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఇండోర్‌ స్టేడియం ఎదురుగా గల లేడీస్‌ క్లబ్‌ నందు ఏలూరు జిల్లా మాల సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో రఘురామ కృష్ణరాజును బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆకివీడు పెదపేట మాలలకు న్యాయం చేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన మాలలందరిని బేషరతుగా విడుదల చేయాలని, జరిగిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో మెజిస్ట్రీయల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సమావేశ అనంతరం కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. అక్కడ నుంచి ఏలూరు రేంజ్‌ డీఐజీ ఆఫీసు వరకు ప్రదర్శనగా వెళ్లి డీఐజీకి వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ చాగంటి సంజీవ్‌, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్‌ నూకపెయ్యి సుధీర్‌బాబు, ప్రొఫెసర్‌ ఎన్‌ఏడి పాల్‌, డాక్టర్‌ మెండెం సంతోష్‌కుమార్‌, నేతల రమేష్‌ బాబు, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: గ్లోబల్‌ బ్రాండ్లుగా దేశ కోకో, జీడి పంటలు మారనున్నాయని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ కె.ధనుంజయరావు అన్నారు. న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశానికి ధనుంజయరావు అతిఽథిగా హాజరయ్యారు. ఏపీలోని కోకో, జీడిపంటల సాగు, ఉత్పత్తి సామర్థ్యం, ప్రొసెసింగ్‌ గురించి వివరించారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని హార్టీకల్చర్‌ హబ్‌గా, ఏలూరు జిల్లాను కోకో హబ్‌గా ప్రకటించడంతో పాటు వార్షిక బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఉద్యానవర్సిటీని సందర్శించాలని ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మంగీలాల్‌ జాట్‌ని వీసీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement