● రెచ్చిపోతున్న కూటమి నేతల అనుయాయులు
● ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ అక్రమాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికారం అండతో కూటమి నేతల ఆగడాలు పెచ్చుమీరాయి. ఎక్కడపడితే అక్కడ రియల్ దందాలకు పాల్పడి జేబులు నింపుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుయాయులు ఇష్టానుసారంగా చట్టవిరుద్ధ పనులకు పూనుకుంటున్నారు. అనుమతులు లేకుండా ఉంగుటూరు మండలం కై కరంలో జాతీయరహదారిని ఆనుకుని శివకుమారికి చెందిన 45 సెంట్లు భూమిని మెరక పనులు చేస్తున్నారు. కంకర అక్రమ రవాణా చేస్తూ ఈ భూమిని మెరర చేస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించేలా పచ్చని వరిచేల మధ్యలో పూడిక పనులు సాగిస్తున్నారు. అలాగే ఇదే మండలం రాచూరులో చేపలు చెరువులు తవ్వేస్తున్నారు. దీనికి కూడా ఎటువంటి అనుమతులు పొందలేదని సమాచారం. సుమారు 25 ఎకరాల్లో పొక్లెయిన్లు, జేసీబీలు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మత్స్య శాఖ, రెవెన్యూ అధికారులు ఏ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే గొల్లగూడెంలో పోలవరం కాలువగట్టును కొల్లగొట్టి ఉన్న కాస్త కంకర గట్టును పట్టుకుపోతున్నారు. ఇలా నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి వెనుక ఉన్న అనుయాయులు అక్రమాలకు పాల్పడి జేబులు నింపుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పనులతో ప్రజాప్రతినిధి అనుయాయలు కాసులు సంపాదించుకుంటున్నా సామాన్యులు మాత్రం దుమ్ము ధూళితో నరకయాతన పడుతున్నారు.


