జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో కొలువైన ఆంజనేయస్వామి వారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఆలయ ముఖ మండపం వద్ద తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,83,934 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే అన్నదాన సత్రంలో 1,815 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు. కాగా, ఆలయంలో జరుగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి మేకా పాపారావు, ఝాన్సీ లక్ష్మీబాయి దంపతులు (రాజమండ్రి) రూ. లక్ష విరాళం అందజేసినట్లు ఈవో తెలియజేశారు.
ఏలూరు రూరల్ : ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయని డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్ తెలిపారు. మంగళవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో 35, 45 ఏళ్ల వయస్సు పైబడిన విభాగంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా క్రీడాధికారులు జావలిన్, డిస్కస్‌త్రో, 100, 400 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్ విభాగాల్లో ఎంపిక పోటీలు చేపట్టారు. ప్రతిభ చాటిన వారికి జిల్లా జట్టులో చోటు కల్పించారు.
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు బుధవారం పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి ఆయన రాజమహేంద్రవరం చేరుకుంటారన్నారు. బుధవారం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని అక్కడ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, సంబంధిత కాట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమై పనులు జరుగుతున్న తీరు, పురోగతిపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. పవర్ ప్రాజెక్టు పనులను కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. పనులతో పాటు నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ సమస్యలపై సమీక్షిస్తారన్నారు. పీపీఏ సీఈవో, సీడబ్ల్యూసీ అధికారులు ఈయన వెంట రానున్నట్లు పేర్కొన్నారు.
కలిదిండి(కై కలూరు): ఎలుకల మందు తిని చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం కలిదిండి మండలం ఆరుతెగళపాడు శివారు కొమ్ములగూడెంకు చెందిన గుజ్జర్లపూడి సురేష్ (20) పదో తరగతి చదివి ప్రస్తుతం పెయింటింగ్ పనులకు వెళుతున్నాడు. ఈ నెల 14న కూలీ డబ్బులు ఇవ్వలేదని తల్లి మందలించడంతో మనస్థాపం చెంది ఎలుకల మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగాడు. ఈ నెల 16న ఇంట్లో వాంతులు చేసుకుంటుండగా తల్లి అడుగ్గా విషయం చెప్పాడు. దీంతో వెంటనే అతడిని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సురేష్ మృతి చెందాడు. తండ్రి గుజ్జర్లపూడి వెంకట గంగాధరరావు ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పీవీవీ.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


