● దర్జాగా పోలవరం కుడి కాలువ గట్లపై చెట్ల నరికివేత
● అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నేతలు
ద్వారకాతిరుమల: పోలవరం కుడి కాలువ గట్లపై ఉన్న ఎంతో విలువైన వృక్ష సంపదను ఓ టీడీపీ కార్యకర్త దోచుకుంటున్నాడు. పట్టపగలు దర్జాగా వాటిని నరికి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు. బహిరంగంగా జరుగుతున్న ఈ అక్రమాలను అడ్డుకోకపోగా, తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి వద్ద నుంచి, ఎం.నాగులపల్లి వరకు పోలవరం కుడి కాలువ గట్టుపై ఉన్న వేప, ఇతర జాతులకు చెందిన భారీ వృక్షాలను గుళ్లపాడుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త గత పది రోజుల నుంచి మెషీన్లతో నరికిస్తున్నాడు. ఇదేంటని కొందరు రైతులు సదరు కార్యకర్తను నిలదీయగా.. నాకు పర్మిషన్ ఉంది.. ఏ చెట్టునైనా నరికేస్తానని దురుసుగా సమాధానం చెప్పాడని అంటున్నారు. కలపను తరలిస్తున్న వ్యక్తిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు.


