ఆగిరిపల్లి: మండలంలో తెలుగు తమ్ముళ్ల దెబ్బకు ఏ ఒక్క కొండ మిగిలేలా లేదు. కొండ కనపడితే చాలు తవ్వేసి జేబులు నింపేసుకుంటున్నారు. మండలంలో కొన్ని రోజుల నుంచి గ్రావెల్ అక్రమ మాఫియా తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా అక్రమార్కులు మాత్రం దందా కొనసాగిస్తూనే ఉన్నారు. మండలంలోని ఈదర గ్రామంలో టీడీపీ నాయకులు గురుగట్టును ఎటువంటి అనుమతులు లేకుండా పగలు ట్రాక్టర్‌లో, రాత్రి లారీల్లో గ్రావెల్ తరలించి లక్షలాది రూపాయలు దోచుకుతింటున్నారు. కొన్ని రోజుల నుంచి పగలూ రాత్రి తేడా లేకుండా తవ్వేయడంతో సగం కొండ మాయమైపోయింది. గ్రావెల్ తవ్వకాలతో సమీపంలో ఉన్న మామిడి తోటలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. గ్రావెల్ అక్రమాలపై రెవెన్యూ అధికారులు, పోలీసులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసి మండలంలో అక్రమ తవ్వకాలు జరగకుండా చూస్తామని చెప్పిన మాటలు వట్టి మాటలు అని తేలిపోయాయి. మంగళవారం పట్టపగలు గురుగట్టు వద్ద భారీ మెషీన్‌తో తవ్వి సుమారు పాతిక ట్రాక్టర్లతో గ్రావెల్‌ను తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు వచ్చి తూతూమంత్రంగా ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మండలంలో గ్రావెల్ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మండలంలో ఏ ఒక్క కొండ మిగలదని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


