బుట్టాయగూడెం: అడవిలో మారుజాతి కలపను నరికి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అక్రమార్కులు బుట్టాయగూడెం మండలంలోని పాలకుంట, ఇప్పలపాడు, రెడ్డిగణపవరం, బూరుగువాడ సమీపాల్లోని అటవీప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఉన్న కాల్వ గట్లపై ఉన్న చెట్లను నరికివేసి యథేచ్ఛగా ట్రాక్టర్‌లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పొగాకు బేరన్‌ల కోసం కలప అక్రమ రవాణా సాగిస్తున్నారు. పాలకుంట సమీపంలోని ఒక ప్రాంతంలో బేరన్ పుల్ల కోసం చెట్లను నరికివేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. దీనితోపాటు ఎగువ ప్రాంతంలో కూడా పెద్దపెద్ద చెట్లను నరికి వేసి రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్‌లలో అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


