తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని అప్పారావుపేట, మాధవరం కోతిగుంట చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో మట్టిని తవ్వి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. కూలీలతో పూడికతీత పనులు చేపట్టాల్సి ఉండగా, పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం పేరుతో 30 నుంచి 40 అడుగుల లోతు జేసీబీలతో తవ్వేసి లారీలు, ట్రాక్టర్లలో మట్టిని విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. రాత్రింబవళ్లు యథేచ్ఛగా ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలను గాలికొదిలేసి తవ్వేస్తున్నా ఇటు రెవెన్యూ, అటు మైనింగ్ అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గణపవరం : గణపవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మందిని అరెస్టుచేసి మంగళవారం తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపర్చగా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ లలితాదేవి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పన రూ.80వేలు జరిమానా విధించినట్లు గణపవరం ఎస్సై ఎ.మణికుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


