● రూ.కోట్ల నిధులు స్వాహా
● అక్రమార్కులపై లోకాయుక్త విచారణ
● కొత్తగా మరో రూ.80 లక్షల బిల్లుల గోల
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని పంచాయతీల్లో అవినీతిపరుల పనిపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రూ.కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తూ తమ జేబులు నింపుకోవడం.. అవినీతి ఆరోపణలపై విచారణ అధికారులను సైతం పక్కదారి పట్టిస్తూ ... అక్రమార్కులకు అండగా నిలిచిన జిల్లా అధికారి ‘పంచాయితీ’ నడుస్తోంది. నిధుల దుర్వినియోగంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో ఇక లోకాయుక్తను ఆశ్రయించారు. అవినీతి ఆరోపణలపై లోకాయుక్త ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి విచారణకు ఆదేశించింది. ఏలూరు జిల్లాలోని భీమడోలు, పూళ్ల గ్రామ పంచాయతీల్లో కోట్ల నిధులు దుర్వినియోగంపై రహస్య, ఒక్కో వ్యక్తిని విచారణ చేపట్టారు. అటు అధికారులతోపాటు, ఇటు ఫిర్యాదుదారులను విచారణకు పిలిచి వారినుంచి ఆధారాలు, వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
భారీగా నిధుల దుర్వినియోగం
భీమడోలు పంచాయతీలో ఫిర్యాదుదారులు రూ.2కోట్లు నిధులు దుర్వినియోగం చేశారనీ ఆరోపిస్తూ ఆధారాలు చూపిస్తుంటే గతంలో విచారణ చేసిన అధికారులు రూ.1.36 కోట్లు మాత్రమే దుర్వినియోగం అయ్యాయంటూ తేల్చడం... మరోవైపు అవినీతి జరిగిందనేది వెల్లడైనా డీపీఓ అక్రమార్కులకు వత్తా సుపలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక గుండుగొలను గ్రామ పంచాయతీలోనూ సుమారు రూ.70 లక్షలు నిధులు, పూళ్ళ గ్రామ పంచాయతీలో సుమారు రూ.90 లక్షలు నిధులు, పెయ్యేరు పంచాయతీలో సుమారు రూ.1.5కోట్లు కై ంకర్యం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా నాలుగు గ్రామ పంచాయతీల్లో ఏకంగా రూ.5.16 కోట్లు నిధులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి.
లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ దర్యాప్తు
ఏలూరు జిల్లా పంచాయతీ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీల్లో కోట్లలో నిధుల దుర్వినియోగంపై జిల్లాస్థాయిలో సాగుతున్న విచారణ బోగస్‌గా మారిందని, విచారణ అధికారులే అవినీతి పందికొక్కుల నుంచి భారీగా డబ్బులకు కక్కుర్తి పడుతూ నివేదికలను తొక్కిపడుతూ వచ్చారు. దీనిపై ఫిర్యాదుదారుడు బి.భాస్కర్ లోకాయుక్తను ఆశ్రయించగా ఏలూరు డీపీఓ అనురాధపై లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీచేసింది. అవినీతి సొమ్ముతో జేబులు నింపుకున్న అధికారులపై చర్యలు ఏవిధంగా ఉంటాయనేదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. అవినీతి అధికారుల భరతంపట్టే లోకాయుక్త విచారణతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఫిర్యాదుదారులతో పాటు గతంలో విచారణ చేసిన అధికారులు ఏలూరు డీఎల్‌పీవో అమ్మాజీ, జంగారెడ్డిగూడెం డీఎల్‌పీవో సుబ్బరాయన్, ఏలూరు డీపీవో అనురాధను ..ఒక్కొక్కరిగా గదిలోనే విచారణ చేపట్టినట్లు చెబుతున్నారు. మొత్తానికి అవినీతి బాగోతంలో పాత్రదారులైన అధికారులపై చర్యలు ఏమిటనే చర్చ జోరుగా సాగుతుంది.
నకిలీ బిల్లులు సృష్టించి
లోకాయుక్త విచారణ సాగుతోన్న తరుణంలో భీమడోలు పంచాయతీలో మరికొన్ని అక్రమాలు వెలుగులోకి రావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమార్కులంతా ఒక రిటైర్డ్ కార్యదర్శిని సంతకాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. సరికొత్త స్కామ్‌లో ఏకంగా రూ.80 లక్షలు నకిలీ బిల్లులు సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పనిచేసి పదవీవి రమణ చేసిన కార్యదర్శి పేరుతో నకిలీబిల్లులు సృష్టించగా... వాటిపై సదరు రిటైర్డ్ కార్యదర్శిని సంతకాలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. తనకు ఎలాంటి సంబంధం లేదనీ, ఇలా వేధింపులకు గురిచేయటం సరికాదంటూ రిటైర్డ్ కార్యదర్శి ఉన్నతాధికారులకు ఇప్పటికే ఉత్తరం కూడా రాసినట్లు సమాచారం.


